పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానం

ABN , First Publish Date - 2022-09-08T06:25:58+05:30 IST

పిఠాపురం పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, డ్రెయిన్లలో నెలల తరబడి పూడిక తొలగించడంలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు.

పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానం

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, సెప్టెంబరు 7: పిఠాపురం పట్టణంలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని, డ్రెయిన్లలో నెలల తరబడి పూడిక తొలగించడంలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ విమర్శించారు. పారిశుధ్య నిర్వహణ చేయకుంటే తామే రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. పిఠాపురం పట్టణంలోని 4వ వార్డులో సాలిపేట, శెట్టిబలిజపేట ప్రాంతాల్లో పర్యటించి అధ్వానంగా, పూడిక తొలగించని డ్రెయిన్లను ఆయన గురువారం పరిశీలించారు. డ్రెయిన్లలో పూడికను తొలగించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఎక్కడికక్కడ పందులు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, డ్రెయిన్లల్లో పూడిక తొలగించక పలు ప్రాంతాలు మురికికూపాలుగా మారాయన్నారు. పట్టణంలో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని, సుమారు 500 మంది ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. జ్వరాలు, వ్యాధులు ప్రభలుతున్నా మునిసిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కనీసం స్పందన లేదని, బ్లీచింగ్‌ చల్లడం లేదా ఫ్యాగింగ్‌ చేయడం విస్మరించారని విమర్శించారు. మురుగునీరు రోడ్లపై నిలిచిపోయి దుర్గంధపూరిత వాతావరణం నెలకొంటున్నదని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచకుంటే తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యత తీసుకుని డ్రెయిన్లలో పూడిక తొలగించడంతోపాటు ఫ్యాగింగ్‌ చేయిస్తామని, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విషజ్వరాలతో వందలాది మంది చనిపోతున్నా ప్రభుత్వంలో స్పందన కొరవడిందని తెలిపారు. పైపులైనులు పగిలిపోయి తాగునీరు కలుషితమైందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హాయాంలో 10వార్డులకు సంబంధించి ప్రధాన డ్రెయిన్‌కు రూ.70లక్షలు విడుదల చేశామని, రోడ్ల అభివృద్ధికి రూ.10కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులను అర్థాంతరంగా నిలిపివేశారని విమర్శించారు. వర్మ వెంట టీడీపీ పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, టీడీపీ నాయకులు ఆలపు దొరబాబు, చింతాకుల వీరలక్ష్మి, అల్లవరపు నగేష్‌, కోళ్ల బంగారుబాబు, పిల్లి చిన్నా, నల్లా శ్రీనివాస్‌, కొరుప్రోలు శ్రీను, వేణుం సురేష్‌, చవ్వాకుల రామచంద్రరావు తదితరులు ఉన్నారు.Read more