టౌన్‌ ప్లానింగ్‌లో అవినీతి

ABN , First Publish Date - 2022-12-31T01:11:49+05:30 IST

సచివాలయ కార్యదర్శులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ, మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారని, ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చిన్ని అన్నారు. టౌన్‌ ప్లానింగ్‌లో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాలన్నారు.

టౌన్‌ ప్లానింగ్‌లో అవినీతి
సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు

  • సచివాలయ కార్యదర్శులు, టౌన్‌ప్లానింగ్‌ అధికారుల కుమ్మక్కు

  • అక్రమ నిర్మాణాలకు సహకారం.. ప్రభుత్వ ఆదాయానికి గండి

  • కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ సూరపునేని చిన్ని

  • రిఫరల్‌ కేంద్రంగా కొవ్వూరు ఆసుపత్రి: కౌన్సిలర్లు

కొవ్వూరు, డిసెంబరు 30: సచివాలయ కార్యదర్శులు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ, మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారని, ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చిన్ని అన్నారు. టౌన్‌ ప్లానింగ్‌లో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాలన్నారు. కమిటీ వేయడానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపినట్లు చైర్‌పర్సన్‌ ప్రకటించారు. కొవ్వూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌లో సభ్యులు తిరస్కరించిన అంశాలు అధికారులు ముందుకు తీసుకెళ్లడంపై అసలు కౌన్సిల్‌కు విలువ ఉందా అని అధికార పార్టీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌన్సిలర్లు బత్తి నాగరాజు, కంఠమణి రమేష్‌బాబు మాట్లాడుతూ గత కౌన్సిల్‌ సమావేశాల్లో తిస్కరించిన (19వ వార్డులో రూ. 30 లక్షలతో రోడ్డు నిర్మాణం, సత్యవతినగర్‌ మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో గృహనిర్మాణ శాఖ సిమ్మెంటు గొడౌన్‌కు షాపు కేటాయించరాదని, కౌన్సిల్‌ సమావేశ మందిరాన్ని ఇతరశాఖల సమావేశాలకు ఇవ్వరాదని కౌన్సిల్‌ తీర్మానించింది.) అంశాలు ఆమోదం పొంది టెండరు దశకు చేరుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు కౌన్సిల్‌కు విలువ ఉందా అని కమిషనర్‌ను నిలదీశారు. దీనిపై కమిషనర్‌ బి.శ్రీకాంత్‌, మున్సిపల్‌ అధికారులు మినిట్స్‌ను తనిఖీ చేయడంతో అధికారులు ఎంతబాధ్యతగా పనిచేస్తున్నారో అర్థమవుతుందని కౌన్సిలర్లు ఆగ్రహించారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని చిన్ని మాట్లాడుతూ బాక్స్‌ టెండర్లు కాంట్రాక్టర్లకు తెలియజేయడం లేదని, నోటీసుబోర్డులో కూడా పెట్టకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై చైర్‌పర్సన్‌ రత్నకుమారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కోఆప్షన్‌ సభ్యులు ఏలూరి వెంకట్‌ మాట్లాడుతూ టెండరు దక్కించుకుని నిర్మాణాన్ని మధ్యలో వదిలివెళ్లి పోయిన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ గోదావరి బండ్‌పై పిచ్చిమొక్కలు తొలగించడానికి టెండర్‌ పిలుస్తున్నారని, అయితే పనులు చేసేది మున్సిపల్‌ సిబ్బందే కనబడుతున్నారు. అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించారు. కమిషనర్‌ మాట్లాడుతూ బండ్‌పై మొక్కలు తొలగించడానికి వేసిన ఎస్టిమేట్లలో పొరపాటు జరిగిందని, మరలా ఇలా జరగదన్నారు.

  • ఆసుపత్రి సేవలపై ఆగ్రహం

కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి సేవలపై టీడీపీ కౌన్సిలర్‌ బొండాడ సత్యనారాయణ కౌన్సిల్‌ను నిలదీశారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఆసుపత్రిలో డాక్టర్లను నియమించకపోవడంపై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ సాక్షాత్తు హోంమంత్రి అయ్యివుండి, కొవ్వూరు ఆసుపత్రిని రిఫరల్‌ కేంద్రంగా తయారుచేయడమేమిటన్నారు. ఆసుపత్రి సేవలపై అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలందరూ ప్రశ్నించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పి.సుభాషిణి మాట్లాడుతూ ఆసుపత్రిలో 11 మంది డాక్టర్లు ఉండవలసి ఉండగా, నలుగురు మాత్రమే ఉన్నారని, మరో ముగ్గురు డిప్యూటేషన్‌పై వారానికి రెండు రోజులు సేవలందిస్తున్నారన్నారు. 11 మంది డాక్టర్లను నియమిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు.

  • అడుగడునా సభా మర్యాదల ఉల్లంఘన

కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం నుంచి అధికార పార్టీ కౌన్సిలర్లు సభా మర్యాదలను ఉల్లంఘించారు. అడుగడుగునా ఎవరికిష్టం వచ్చినట్లు వారు సభ నుంచి బయటకు వెల్లడం లోపలికి రావడంతో కౌన్సిల్‌ సమావేశం కాస్తా రాజకీయపార్టీ మీటింగ్‌ను తలపించింది. పట్టణంలోని 23 వార్డుల్లో చేపట్టిన, చేపట్టవలసిన అభివృద్ధి అంశాలపై సభలో చర్చిస్తుండగా వైస్‌చైర్మన్లు, సీనియర్‌ కౌన్సిలర్లు సైతం పలుమార్లు బయటకు వెళ్లిపోవడం సభను విస్మయానికి గురిచేసింది. దీనితో కొంతమంది కౌన్సిలర్లు కౌన్సిల్‌ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాగే సభలో అభివృద్ధి అంశాలను ఆమోదించడంలోను కౌన్సిల్‌ సభ్యులు తడబడ్డారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. సమావేశంలో వైస్‌చైర్మన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, 23 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్‌ ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:11:49+05:30 IST

Read more