జిన్నా టవర్‌ను కూల్చడం కాదు.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టండి

ABN , First Publish Date - 2022-01-03T05:34:46+05:30 IST

గుంటూరులోని చారిత్రాత్మక జిన్నా టవర్‌ను కూల్చేస్తామని బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌ రెడ్డి విద్వేషపూరిత వ్యాఖ్యలను సమర్ధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేతనైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలని వైసీపీ మైనార్టీ సెల్‌ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆరీఫ్‌ హితవు పలికారు.

జిన్నా టవర్‌ను కూల్చడం కాదు..  విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టండి

  • సోము వీర్రాజుకు మైనార్టీ నేత ఆరిఫ్‌ హితవు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 2: గుంటూరులోని చారిత్రాత్మక జిన్నా టవర్‌ను కూల్చేస్తామని బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌ రెడ్డి విద్వేషపూరిత వ్యాఖ్యలను సమర్ధిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేతనైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాలని వైసీపీ మైనార్టీ సెల్‌ రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆరీఫ్‌ హితవు పలికారు. ఆదివారం స్థానిక జాంపేటలోని తన కార్యాలయంలో మైనార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట నిలబెట్టుకోలేని, చేతకానితనాన్ని మతవిద్వేషలు రెచ్చగొట్టి కప్పిపుచ్చుకోవాలని బీజీపీ నీచరాజకీయాలకు ఆజ్యం పోస్తుందని విమర్శించారు. మహ్మద్‌ ఆలీ జిన్నా పాకిస్తాన్‌ వ్యవస్థాపకుడు కాకముందే భారత స్వాతంత్య్ర సమరయోధుడు కావడం వల్లనే ఆయన పేరుతో కొన్ని కట్టడాలే దేశంలో కట్టారని, ఇప్పుడు వాటిని పాకిస్తాన్‌కు జోడించి మతతత్వ రాజకీయాలు చేయడం హేయమైన చర్యలని ఆయన అన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి భారతదేశానికి వలస వచ్చిన రాంనానీ అనే వ్యాపారస్తుడు కరాచీ పేరుతో దేశమంతా తన దుకాణాలను నడుపుతుండడం బీజేపి నేతలకు అభ్యంతరకరంగా లేదా అని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్య్ర సమరయోధుడు అబ్ధుల్‌ గఫర్‌ఖాన్‌కు భారతరత్న బిరుదు ఇచ్చి సత్కరించుకున్న మనం ఇప్పుడు ప్రజల మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టి చారిత్రక కట్టలను కూల్చివేయడం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎందరికో ఉపాధినిచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా, ఎత్తి వేయకుండా కాపాడాలని కోరారు. సమావేశంలో నగర మైనార్టీ సెల్‌ నాయకులు సయ్యద్‌ రబ్బాని, ఉపాధ్యక్షుడు సయ్యద్‌ గౌస్‌, హబీబ్‌ఖాన్‌, బషీర్‌, మహబూబ్‌ రఫీ పాల్గొన్నారు.

Read more