అక్కడ చెక్కు.. ఇక్కడ చిక్కులు

ABN , First Publish Date - 2022-07-30T06:44:36+05:30 IST

సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా గొల్లప్రోలును అష్టదిగ్బంధనం చేశారు. కాపునేస్తం మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్‌ వచ్చారు.

అక్కడ చెక్కు.. ఇక్కడ చిక్కులు
గొల్లప్రోలులో బస్సులో వస్తున్న సీఎం జగన్‌కు ఎండలో విద్యార్థుల స్వాగతం..

  • సీఎం రాకతో గొల్లప్రోలు అష్టదిగ్బంధనం
  • పట్టణమంతా బారికేడ్లు ఏర్పాటు
  • దుకాణాలు మూసివేత.. ప్రజల అవస్థలు
  • మండుటెండలో విద్యార్థుల పడిగాపులు
  • ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

కాపునేస్తం డబ్బులివ్వడానికి సీఎం జగన్‌ శుక్రవారం గొల్లప్రోలు వచ్చారు. ఇక్కడ మీటనొక్కి, లబ్ధిదారులకు చెక్కు అందజేశారు. అయితే ఈ  సందర్భంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎవరూ సొంత పనులు చేసుకునేందుకు కూడా బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. భద్రతా కారణాలంటూ దుకాణాలన్నిటినీ మూయించి వేశారు. ప్రైవేటు పాఠశాలలకు సెలవులిచ్చేశారు. వారి చేతికి ‘థ్యాంక్యూ జగన్‌ మావయ్య’, ‘థ్యాంక్యూ సీఎం సార్‌అన్న స్లోగన్‌ల ప్లకార్డులిచ్చి ఎండలో నిలుచోబెట్టారు. పాపం.. సభకు తరలించిన మహిళలు సైతం ఎండలో మాడిపోయారు. పోలీసులూ చెట్ల నీడల కూలబడి కూర్చోవలసి వచ్చింది. ఈ ఎండ తీవ్రతకు సీఎం జగన్‌ కోసం ఆయన ఉన్న బస్సు వద్ద వేచి ఉన్న వైసీపీ నాయకుడు సూరవరపు సురేష్‌ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అతనికి వైద్యులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించారు.


గొల్లప్రోలు, జూలై 29: సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా గొల్లప్రోలును అష్టదిగ్బంధనం చేశారు. కాపునేస్తం మూడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్‌ వచ్చారు. పట్టణమం తా బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రజల రాకపోకలపై ఆం క్షలు విధించారు. సీఎం జగన్‌ ఉదయం 10.40 గంటలకు గొల్లప్రోలు వచ్చినప్పటికి ఉదయం 6 గంటలు నుంచే అంక్షలు అమల్లోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గొల్లప్రోలు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో హెలీపాడ్‌ నుంచి పట్టణ శివారులోని సభా వేదిక వరకూ ఐరన్‌ బారికేడ్లు నిర్మించారు. దీంతో పట్టణ ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సీఎం వెళ్లే మార్గంలో ఉన్న షాపులన్నింటినీ పోలీసులు మూసివేయించారు. సీఎం తిరిగి వెళ్లేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో తాము వ్యాపారాలు చేసుకునే వీలు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లప్రోలు పట్టణ ప్రధాన రహదారులతోపాటు బైపాస్‌ రోడ్డులో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అధ్వానంగా ఉన్న చెరువులు, చెత్తకుప్పలు కనిపించకుండా పరదాలు కప్పారు. ఇక సీఎం వస్తున్నారంటూ గొల్లప్రోలు జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులను ఉదయం పది గంటల నుంచే ఎండలో నిలుచోపెట్టారు. ఎండ తీవ్రంగా ఉండడంతో విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం వచ్చి వెళ్లే వరకూ వారు అలా నిలుచోవాల్సి రావడంతో కొందరు అక్కడే ఉన్న గట్లుపై కూర్చొన్నారు. మరోవైపు సీఎం రోడ్‌షో నిర్వహిస్తారని ప్రచారం సాగినప్పటికీ ప్రజల స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఇదిలా ఉండగా సీఎం కాపునేస్తం సభ కోసం జనాన్ని భారీగా తరలించారు. కాపునేస్తం లబ్ధిదారులతోపాటు మహిళా సంఘాలు సభ్యులు, ఉపాధి కూలీలు, ఇతర పథకాల లబ్ధిదారులను బస్సులు, ఆటోలు, వేన్‌లతో తీసుకువచ్చారు. ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులన్నింటినీ అధికారులు ముందుగానే తీసుకోవడంతో శుక్రవారం ప్రైవేటు పాఠశాలలన్నింటికి సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేశాయి.



కాపులను మభ్యపెట్టేది ఇంకెన్నాళ్లు..

కాపులను మభ్యపెట్టేది ఇంకెన్నాళ్లు అంటూ జనసైనికులు సీఎం వెళ్లే మార్గంలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. బారికేడ్ల వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శించారు. కాపులకు ఏటా ఇస్తామన్న రూ.2 వేల కోట్లు, కాపుల రుణాలు ఏవీ, ఓట్ల కోసం బానిసలుగా వాడుకుంటారా అంటూ వారు నినాదాలిచ్చారు. పోలీసులు అక్కడ చేరుకుని వారిని అక్కడ నుంచి పంపివేశారు. తాటిపర్తిలో తమ ఇళ్లు మధ్యలో ఉండగా కోర్టు స్టే తేవడంతో ఆగిపోయాయని, వాటిని తిరిగి ప్రారంభించేలా చూడాలంటూ కొందరు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. హెవీ లైసెన్సు కలిగిన డ్రైవర్లను గుర్తించాలంటూ కొందరు ఫ్లెక్సీ చూపించి సీఎం జగన్‌ను కోరారు.

Updated Date - 2022-07-30T06:44:36+05:30 IST