ప్రభుత్వ బడుల్లో టెన్త్‌లో సగం మంది ఫెయిల్‌

ABN , First Publish Date - 2022-06-07T07:01:09+05:30 IST

పది పరీక్షల ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి 23,728 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 14,104 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ప్రభుత్వ బడుల్లో టెన్త్‌లో సగం మంది ఫెయిల్‌

 రాజమహేంద్రవరం, జూన్‌6 (ఆంధ్రజ్యోతి): పది పరీక్షల ఫలితాలలో  బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్‌  పాఠశాలలకు సంబంధించి 23,728 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 14,104 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉత్తీర్ణతా శాతం  59.44 శాతంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 14,866 మంది పరీక్షలు రాయగా 6419 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సగానికి పైగా ఫెయిల్‌ అయ్యారు. కేవలం 43.17 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు 8862 మంది పరీక్షలు రాయగా, 7685 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వారి ఉత్తీర్ణతాశాతం 86.7 శాతం. జిల్లాలో  ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో బాలికలే ఎక్కువ మంది ఉన్నారు.  బాలురు 12072 మంది పరీక్షలు రాయగా 6852 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏకంగా 5220 మంది  ఫెయిల్‌ అయ్యారు. బాలికలు మొత్తం 11,656 మంది పరీక్షలకు హాజరు కాగా,  7252 మంది ఉత్తీర్ణులయ్యారు. 62.22 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 4404 మంది ఫెయిల్‌ అయ్యారు. మొత్తం జిల్లాలో  100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 21 ఉన్నాయి. ఒక్కరు కూడా  ఉత్తీర్ణులు కానీ పాఠశాలలు ఐదు ఉన్నాయి. వాటిలో రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్‌ సమీపంలోని వీటి తెలుగుమీడియం స్కూల్‌, ఆల్కాట్‌ గార్డెన్‌లోని లూఽథరన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ ఉన్నాయి. అంతేకాక గోకవరం మండలంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌, రాజానగరంలో 2 పాఠశాలల్లో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు.

Read more