ఫిక్స్‌ అయిపోయారు

ABN , First Publish Date - 2022-07-21T06:58:56+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ పథకాల అమలుకు అప్పులపై ఆధారపడి బండి నెట్టుకువస్తున్న ప్రభుత్వానికి కొత్తగా అప్పులు పుట్టే మార్గాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆలయాలపై జగన్‌ ప్రభుత్వం కన్నేసింది.

ఫిక్స్‌ అయిపోయారు

  జిల్లాలో దేవాలయాల ఆదాయాలపై జగన్‌ సర్కార్‌ కన్ను
  సీజీఎఫ్‌ డబ్బుల కోసం దేవస్థానాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రద్దు చేయాలని ఆదేశాలు
  ఖాళీ అవుతున్న అన్నవరం, పిఠాపురం, సామర్లకోట ఆలయాల బ్యాంకు ఖాతాలు
 గత కొన్నిరోజులుగా నగదు డ్రాచేసి సీజీఎఫ్‌కు జమ చేస్తున్న ఈవోలు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, సంక్షేమ పథకాల అమలుకు అప్పులపై ఆధారపడి బండి నెట్టుకువస్తున్న ప్రభుత్వానికి కొత్తగా అప్పులు పుట్టే మార్గాలు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆలయాలపై జగన్‌ ప్రభుత్వం కన్నేసింది. ఖజానాకు ఎంతొచ్చినా పర్వాలేదు అనుకుంటున్న పెద్దలు దేవాలయాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీజీఎఫ్‌పై గురిపెట్టారు. తక్షణం వీటిని కట్టితీరాలని మెడపై కత్తిపెట్టారు. ఆలయాలు తమకు వస్తున్న రాబడిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వేసుకోగా వాటిని రద్దు చేసి ఆ డబ్బు తమకు ఇవ్వాలంటూ తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. లేకపోతే ఈవోలపై వేటు ఖాయం అంటూ ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరిస్తోంది. దీంతో అన్నవరం నుంచి పిఠాపురం వరకు, సామర్లకోట నుంచి తలుపులమ్మలోవ దేవస్థానం వరకు సర్కారీ ఒత్తిళ్లు తట్టుకోలేక గుడి ఎఫ్‌డీలు రద్దుచేసే పనిలో పడ్డా యి. వాస్తవానికి ఆలయాలు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా భక్తులు నుంచి వచ్చే కానుకలే ఆధారం. ఇలా వచ్చే రాబడిని ఆయా దేవస్థానాలు ఖర్చులు పోను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తాయి. వీటి ద్వారా వచ్చే వడ్డీతో ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేస్తుంటాయి. అయితే దేవస్థానాలకు ఏటా వచ్చే నికర ఆదాయంపై రాష్ట్రప్రభుత్వానికి 21.5 శాతం పన్ను చెల్లించాలి. ఇందులో కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద 9 శాతం పన్ను కట్టాలి. కానీ నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి, రాబడి పడిపోయిన ఆలయాలు వాటిని చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. గత టీడీపీ ప్రభు త్వం అయితే దేవస్థానాల జోలికి వెళ్లలేదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు రద్దు చేయవద్దని, ఒక్కసారి రద్దుచేస్తే తిరిగి డిపాజిట్‌ చేయడం కష్టమవుతుందని పేర్కొనేది. ఆలయంలో ఉన్న నిధులను బట్టి దశల వారీగా సీజీఎఫ్‌ చెల్లించవచ్చని అనేక సడలింపులు ఇచ్చింది. కానీ వైసీపీ సర్కారు మాత్రం తక్షణం డిపాజిట్‌లు రద్దుచేసి సీజీఎఫ్‌ చెల్లించాల్పిందేనని అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆలయాల ఎఫ్‌డీలు రద్దుచేస్తున్నారు. కొవిడ్‌తో గడచిన రెండు న్నరేళ్లుగా రాబడి పడిపోయిందని, ఇప్పుడు ఉన్న కాస్త ఎఫ్‌డీ లు రద్దు చేసుకుని సీజీఎఫ్‌ కడితే దేవస్థానాల భవిష్యత్తు అం ధకారం అయిపోతుందని వాదిస్తున్నా ప్రభుత్వం మాటవినక పోవడంతో డబ్బులు మళ్లించక తప్పడం లేదు. ఈ విషయం ఎక్కడా బయటపడకుండా గుట్టుగా కానిస్తున్నాయి.
నాలుగు నెలల్లో నాలుగు కోట్లు..
గడిచిన నాలుగు నెలల్లో అన్నవరం దేవస్థానం ఏకంగా రూ.4 కోట్లను తన ఆదాయం నుంచి మళ్లించి సీజీఎఫ్‌ కింద ప్రభుత్వానికి జమచేసింది. దీంతో భక్తుల కోసం అన్నవరంలో నిర్మిస్తున్న 138 గదుల శివసదన్‌ కాటేజీ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. పిఠాపురం పాదగయ దేవస్థానం రూ.75 లక్షలు చెల్లించింది. శ్రీపాద వల్లభ, సామర్లకోట, తలుపులమ్మ దేవస్థానాలు కోటి వరకు చెల్లించాల్సి ఉండడంతో నేడో రేపో ఎఫ్‌డీలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా అనేక దేవాలయాల నుంచి రాష్ట్రప్రభుత్వం ముక్కుపిండి డబ్బులు లాగుతోంది. గత ప్రభుత్వాలు ఈ జోలికి రాకపోగా వైసీపీ సర్కారు మాత్రం వెంటాడుతుండడంతో అధికారులు అంతర్గ తంగా ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. దీనివల్ల ఆదాయం తగ్గి చిన్న ఆలయాల దూపదీప నైవేద్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. నిజానికి అన్ని ప్రభు త్వ శాఖలకు సర్కారు జీతాలు చెల్లిస్తుండగా, దేవదాయ శాఖలోని ప్రధాన ఆలయాల్లో జీతభత్యాలను ఆయా ఆలయాలకు వచ్చే రాబడి నుంచి చెల్లిస్తున్నప్పుడు.. మళ్లీ ప్రభుత్వానికి కామన్‌గుడ్‌ ఫండ్‌ పేరుతో డబ్బులు చెల్లించాల్సిరావడం ఏంటనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

Updated Date - 2022-07-21T06:58:56+05:30 IST