ప్రభుత్వంపై పోరుకు... పార్టీ పటిష్టతకు...

ABN , First Publish Date - 2022-01-03T06:01:21+05:30 IST

టీడీపీకి గోదావరి సెంటిమెంట్‌ ఉంది. గోదావరి జిల్లాల్లో విజయం సాధిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని నేతలు, పరిశీలకుల అభిప్రాయం కూడా. పైగా ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు, పశ్చిమల్లో పార్టీకి బలమైన పునాది ఉంది. హేమాహేమీలైన నేతలు, నిబద్ధత గల కేడర్‌ ఉంది. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో కేడర్‌లోనూ కాస్త నిర్లిప్తత నెలకొంది. వారిలో మరింత ఉత్సాహం తేవడంతో పాటు ఈ జిల్లాల్లో ప్రధాన దృష్టి పెట్టడానికి అధిష్ఠానం యోచిస్తోంది.

ప్రభుత్వంపై పోరుకు... పార్టీ పటిష్టతకు...
సమన్వయ కమిటీ సమావేశానికి రివర్‌బే హాలులో పూర్తయిన ఏర్పాట్లు

  • నేడు రాజమహేంద్రవరంలో టీడీపీ జోన-2 సమన్వయ కమిటీ సమావేశం
  • ఉభయ గోదావరి జిల్లాల్లోని ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి నేతల రాక
  • అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమస్యలపై సమీక్ష
  • రివర్‌బేలో ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

టీడీపీకి గోదావరి సెంటిమెంట్‌ ఉంది. గోదావరి జిల్లాల్లో విజయం సాధిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని  నేతలు, పరిశీలకుల అభిప్రాయం కూడా. పైగా ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు, పశ్చిమల్లో పార్టీకి బలమైన పునాది ఉంది. హేమాహేమీలైన నేతలు, నిబద్ధత గల కేడర్‌ ఉంది. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో కేడర్‌లోనూ కాస్త నిర్లిప్తత నెలకొంది. వారిలో మరింత ఉత్సాహం తేవడంతో పాటు ఈ జిల్లాల్లో ప్రధాన దృష్టి పెట్టడానికి అధిష్ఠానం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచీ కేడర్‌ను ఉత్సాహపరిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును ఉధృతం చేయడానికి పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రివర్‌బేలో సోమవారం ఏలూరు, నరసాపురం, రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలు, వాటి అనుబంధ కమిటీలు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రాష్ట్ర కమిటీల నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ సమస్యలపై ఆరా తీయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ప్రధాన సమస్యలన్నిటినీ క్రోడీకరించి వాటిపై క్రమంగా పోరు చేయడానికి ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు. సమావేశంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పితా ని సత్యనారాయణ, కేఎస్‌ జవహర్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు తదితరులు పాల్గొంటారు.

నియోజకవర్గం నుంచి 40 మందికి ఆహ్వానం

ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 40 మంది నేతలకు ఆహ్వానం పంపారు. మొత్తం 200 మందికి పైగా నేతలు పాల్గొననున్నారు. దీనికోసం రివర్‌బేలోని ఆహ్వానం హాలును సిద్ధం చేశారు. పి.గన్నవరం తప్ప అన్ని నియోజకవర్గాలకూ ఇన్‌చార్జిలు ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల సమస్యలు, కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న ప్రజల పరిస్థితి, బలహీనవర్గాలకు ఓటీఎస్‌, టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడం, కొత్త కాలనీల్లో నెలకొన్న సమస్యలు, అధ్వానమైన రోడ్లు, ప్రజా సంక్షేమ పథకాల కోత, శాంతి భద్రతలు వంటి అన్ని సమస్యలపై ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. వీటిపై  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కాగా రివర్‌బేలో ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం పరిశీలించారు.

టీడీపీ నేతలంతా సోమవారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్తారు. ఓపీ సేవలు, ప్రజా ప్రయోజనార్ధం ఏర్పాటు చేసిన వివిధ పరికరాల వినియోగం, రోగులకు కల్పించే సదుపాయాలను పరిశీలిస్తారు. 


Read more