గురువు చెప్పాడని కత్తి దూసాడు

ABN , First Publish Date - 2022-11-24T00:22:08+05:30 IST

తుని నియోజకవర్గ టీడీపీ నేత పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు.

 గురువు చెప్పాడని కత్తి దూసాడు

తుని, నవంబరు 23: తుని నియోజకవర్గ టీడీపీ నేత పోల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. తన గురువు మాట విని నిందితుడు ఈ దురాగతానికి పాల్పడ్డాదని వివరించారు. తుని పట్టణ పోలీసుస్టేషన్‌లో బుధవారం ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఏఎస్సీ అందించిన వివరాలు ప్రకారం.. విశాఖపట్నం ఆరిలోవ పెద్ద గదుల ప్రాంతానికి చెందిన కప్పా అభిరామ్‌ గురువుగా చలామణి అవుతూ వివిధ ప్రాంతాల్లో పూజలు చేస్తుంటాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన అగ్రహారపు చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా నామవరంలో గురువు అభిరామ్‌ ఇల్లుకు అద్దెకు తీసుకుని అప్పుడప్పుడు తుని పరిసర ప్రాంతాల్లో పూజలు చేసేవాడు. ఈ నేపథ్యంలోనే గురువు అభిరామ్‌ తన శిష్యుడు చంద్రశేఖర్‌కు పోల్నాటి శేషగిరిరావుపై దాడి చేసే పనిని పురమాయించాడు. ఈ పని చేస్తే డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. గురువు మాటను గుడ్డిగా నమ్మే చంద్రశేఖర్‌ దాడి చేయడానికి ఒప్పుకుని మిగతా స్నేహితుల సాయం తీసుకున్నాడు. వారి బృందం శేషగిరిరావు కదలికలను ఎప్పటికప్పుడు గమనించేది. ఈ నేపథ్యంలో 17వ తేదీ ఉదయం నిందితుడు చంద్రశేఖర్‌ మోటారుసైకిల్‌పై ఒంటరిగా భవాని మాల ధరించి నుదుటికి విభూది, కుంకుమ పెట్టుకుని ముఖానికి మాస్క్‌ ధరించి శేషగిరిరావు ఇంటిలోపలకి వెళ్లాడు. భిక్షం అడగగా శేషగిరిరావు బియ్యం తెచ్చి వేస్తుండగా చంద్రశేఖర్‌ కత్తితో దాడిచేసి పారిపోయాడు. అక్కడే పడిపోయిన కత్తిని పోల్నాటి శేషగిరిరావు తీసుకుని వెంట పడి వీధి చివర వరకు వెళ్లి మోటారుసైకిల్‌పై పారిపోతున్న నిందితుడు చంద్రశేఖర్‌పై కత్తితో దాడి చేయగా చంద్రశేఖర్‌ వీపుపై గాయం అయ్యింది. పోలీసు బృందాలు తన కోసం గాలిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న నిందితుడు చంద్రశేఖర్‌ తుని పట్టణ పోలీసు స్టేషన్‌లో బుఽధవారం దర్యాప్తు అధికారి మురళీమోహన్‌ ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, మిగిలిన నిందితుల కోసం గాలింపుచర్యలు చేస్తున్నామని ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

Updated Date - 2022-11-24T00:22:08+05:30 IST

Read more