ఒక్కక్షణం ఆలోచించు..

ABN , First Publish Date - 2022-09-10T07:06:28+05:30 IST

మన జిల్లాలో ఆత్మనూన్యతకు గురై బలవ్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో చైతన్యంఉన్నా క్షణికావేశంలో చాలా జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఒక్కరు, ఇద్దరు లేదా కుటుంబ సమేతంగా ప్రాణాలను తీసుకుంటున్న సం ఘటనలు జిల్లాలో జరుగుతున్నాయి. కాకినాడ జిలాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 121మంది ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.

ఒక్కక్షణం ఆలోచించు..

  • ఆందోళన కలిగిస్తున్న బలవన్మరణాలు
  • జిలాల్లో ఆరునెలల్లో 121మంది ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులు, ప్రేమలో విఫలం, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి
  • మానసిక ఒత్తిడి, ఒంటరితనమే కారణాలు
  • ఒత్తిడిలో ఉన్నవారికి స్నేహితులు, కుటుంబీకులు ప్రేమ పంచాలంటున్న మానసిక నిపుణులు

ప్రేమ విఫలమై...

కేస్‌ స్టడీ 1: జిల్లాలో శంఖవరం మండలం వజ్రకూటం గ్రామానికి చెందిన రాకేష్‌(పేరుమార్చాము) ఇంటర్‌ చదువుతున్నాడు. కళాశాలలో ఓ అమ్మాయి తన ప్రేమను కాద నడంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారంపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది మృతిచెందాడు. ప్రే మంటే తెలియని వయస్సులో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు తీరని క్షోభను మిగిల్చింది. 

ఆర్థిక ఇబ్బందులతో..

కేస్‌ స్టడీ 2: ఈనెల 7న తునికి చెందిన చెన్నకృష్ణకిషో ర్‌ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా రావికంపా డు-తుని మధ్య గుర్తు తెలియని రైలు కిందపడి మృతిచెందాడు. కరోనా కారణంగా తన తండ్రి మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. దీంతో ఆకుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నమైంది.

జీవితం చాలా చిన్నది.. విలువైనది.. ప్రతిక్షణాన్ని బంధాలతో, ఆనందాలతో, సంతోషాలతో, సవాళ్లతో గడపాలి. ఉత్సాహం వచ్చినప్పుడు పొంగిపోవడమే కాదు.. కష్టం వచ్చినప్పుడు నిబ్బరంగా నిలబడాలి. అన్నింటికంటే జీవితమే ముఖ్యమని గ్రహించాలి. అలా అనుకున్నప్పుడు చిన్నచిన్న వాటికి జీవితాలను పణంగా పెట్టే పరిస్థితి రాదు. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమలో విఫలం, నిరుద్యోగం, పరీక్షల్లో తప్పడం, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు వంటి కారణాలతో చాలామంది ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. దీనివల్ల ఆయా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. తీసుకుంటే ప్రాణం చిటికెలో పోతుంది.. కానీ అదే తలచకుంటే నీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఉండదు. ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎన్ని అపజయాలు ఎదురైనా మళ్లీ ప్రయత్నించడమే.. ఎన్నో వైఫల్యాల తర్వాత వచ్చే విజయంలోనే అంతులేని ఆనందం ఉంటుంది. ఓడి గెలిస్తేనే కదా మజా. చిరునవులతో బతుకుతూ చిరంజీవిగా ఉండాలి. అప్పుడే ఏదైనా సాధించగలరు. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ఈ కథనం.. 

శంఖవరం, సెప్టెంబరు 9: మన జిల్లాలో ఆత్మనూన్యతకు గురై బలవ్మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో చైతన్యంఉన్నా క్షణికావేశంలో చాలా జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఒక్కరు, ఇద్దరు లేదా కుటుంబ సమేతంగా ప్రాణాలను తీసుకుంటున్న సం ఘటనలు జిల్లాలో జరుగుతున్నాయి. కాకినాడ జిలాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 121మంది ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. 

నడివయస్కులే ఎక్కువ

జిల్లా పోలీసుల గణాంకాల ప్రకారం ఈ ఆరునెలల్లో 18ఏళ్ల లోపు వారు ఏడుగురు ఆత్మహత్య చేసుకోగా 19నుంచి 30ఏళ్లలోపు వారు 32మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 30ఏళ్లు దాటిన వాళ్లే 82మంది ఉండడం గమనార్హం. వీరిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. చిన్నచిన్న మనస్పర్థలు కారణంగా కొందరు, ఆరోగ్య కారణాలు, మానసిక రుగ్మతలు ఉన్నవారు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది నడివయస్కులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కుటుంబ కలహాలతో దీర్ఘకాలిక మానసిక ఒత్తిళ్లు లాంటి పరిస్థితుల్లో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. 

స్నేహపూర్వకంగా మాట్లాడండి

ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నవారికి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే వారి ఆలోచనా విధానం మారుతుందని వైద్యనిపుణులు అం టున్నారు. మీరు ప్రొఫెషనల్‌ కాకపోయినా వారితో నిదానం గా, స్నేహపూర్వకంగా మాట్లాడితే చాలని వారు కుదురుకుంటారని అంటున్నారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు దిగా లుగా మారితే వారిని అనుమానించాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒంటరి అనే భావాన్ని తరిమేసే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.

ఉపాధి అవకాశాలు అన్వేషించాలి

ఎంతోమంది విద్యావంతులైన నిరుద్యోగులు ఆత్మహత్యల కు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాలేదని తీవ్ర ఆవేదనకు పాల్పడుతున్నారు. వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి. వారిలో ఆశావహ దృక్పథాన్ని తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు, స్నేహితులు కృషిచేయాలి. ఉపాధి అవకాశాలు అన్వేషించాలి. అప్పుడే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు విరమించుకుంటారు.

అవగాహన కల్పిస్తున్నాం: ఎస్‌ఐ రవికుమార్‌ 

ఎస్పీ ఆదేశాలతో ఆత్మహత్యలపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కళాశాలలో క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు ఆత్మహత్యలవల్ల అనర్థాలను వివరించి జీవితం ఆవశ్యకతను వారికి తెలియజేస్తున్నాం. ప్రతిజ్ఞ చేద్దాం-ఆత్మహత్యలను నివారిద్దామనే నినాదంతో ప్రజలందరితో ప్రమాణాలు చేయిస్తున్నాం. కష్టాలు వచ్చిపోతుంటాయి కానీ జీవితం మళ్లీ తిరిగిరాదు. ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదని విద్యార్థులు, యువకులు, ప్రజలు తెలుసుకోవాలి.

ధైర్యంగా ఉండి సమస్యలను అధిగమించాలి

కాకినాడ క్రైం: అన్ని సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు. మానసికంగా ధైర్యంగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలి. నిజ జీవితంలో సమస్యలు వస్తుంటాయి. వీటికి అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఉద్యోగం, కుటుంబం, ఇతర వ్యక్తిగత అంశాల్లో ఎన్నో స మస్యలు తలెత్తడం సహజం. పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలు, ఇబ్బందులున్నా మీకు అందుబాటులో ఉన్న అధికారులు, స్నేహితులకు తెలియజేసి సహాయం పొందాలి. మోసపూరిత రుణ లోన్‌ యాప్‌ల జోలికి వెళ్లి వేధింపులకు గురికాకండి. సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు కుటుంబ సభ్యుల ఫొటోలను ఆశ్లీ లంగా మార్చి ఇతరులకు షేర్‌ చేస్తామని మానసిక ఆం దోళనకు గురిచేస్తున్నారు. దీంతో బాధితులు ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. అందువల్ల యువత, మహిళలు ఈ ఆన్‌లైన్‌ ఇన్‌స్టంట్‌ లోన్‌యాప్‌లకు ఆకర్షితులు కాకండి.

-ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ, కాకినాడ జిల్లా

ఒంటరితనం పోగొట్టి ప్రేమ పంచండి

కాకినాడ క్రైం: మారుతున్న కాలానికి అనుగుణంగా పరుగులు తీయలేక, ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవ డంవల్ల కుటుంబం వీధిన పడుతుంది. అన్నింటికి తనువు చాలించడం పరిష్కారం కాదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో అధికులు సమస్యలను బయటకు చెప్పుకోకపోవడం, ఒంటరితనంతో గడపడం, చిరాకు పడడం, ఇతరులతో మాట్లాడకుండా ఏకాకిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారి తో ఆప్యాయంగా మాట్లాడడం, వారి మాటలు, ఆలోచనలకు అనుగుణంగా పాజిటివ్‌గా మాట్లాడుతూ ఒంటరిత నాన్ని పోగొట్టి ప్రేమ పంచడం ద్వారా ఆత్మహత్యలు చేసుకోకుండా చేయవచ్చు. వీరిని కౌన్సిలింగ్‌కి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించగలిగితే కుటుంబాలను కాపాడినట్లు అవుతుంది. ఒత్తిడిని మేనేజ్‌ చేసుకుంటే చాలావరకు ఇలాంటివి ఆపవచ్చు.

-డాక్టర్‌ బి.వరప్రసాద్‌, మానసిక వైద్యనిపుణులు, జీజీహెచ్‌ 


Read more