సిట్టింగ్‌లు సేఫ్‌

ABN , First Publish Date - 2022-09-17T06:59:35+05:30 IST

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో జిల్లాలో ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఖాయమని తేలిపోయింది.

సిట్టింగ్‌లు సేఫ్‌

  • రూరల్‌, సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆదిరెడ్డి సీట్లు పదిలం
  • చంద్రబాబు ప్రకటనతో గుసగుసలకు తాళం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ సీట్లు ఇవ్వనున్నట్టు  తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రకటించడంతో జిల్లాలో ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఖాయమని తేలిపోయింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు,  ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి సీనియర్‌ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి భవానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులుగా పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం వీచినప్పటికీ ఈ రెండు స్థానాల్లోనూ తెలుగుదేశమే గెలిచింది. జిల్లాలోని పార్లమెంట్‌తోపాటు మిగతా ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇటువంటి సమయంలో కూడా విజయం సాధించడంతోపాటు అధి కార వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ ఎమ్మె ల్యేలు పోరాటం చేస్తున్నారు. ఈనేపథ్యంలో అమరావతిలో ఇటీవల జరిగిన టీడీఎల్‌పీ సమావేశంలో చంద్రబాబు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు ఇవ్వ నున్నట్టు ప్రకటించారు. దీంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవాని వర్గాల్లో ఉత్సాహం పెరిగింది. అంతేకాక ఈసారి వీరికి టిక్కెట్లు రావని ఎద్దేవా చేస్తున్న అధికార పక్షానికి, వ్యక్తిగత శత్రువుల నోళ్లు కూడా మూతపడినట్టే. కానీ వీరికి ప్రస్తుత స్థానాలనే కేటాయిస్తారా, వేరే స్థానాలకు మారుస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితులను బట్టి మార్పు ఉండకపోవచ్చు. ఎన్నికల సమయంలో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుల వంటివి కుదిరితే ఏవైనా మార్పులు ఉండొచ్చు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు ఈసారి పోటీ చేయడానికి  ప్రయత్నిస్తున్నారు. భార్యకు ఇస్తారా, భర్తకు ఇస్తారా అనేది అధిష్ఠానమే తేల్చాల్సి ఉంది. మహిళల సీట్లు సర్దుబాటు విషయంలో తప్పనిసరి పరిస్థితి ఉంటే, భవానికే మళ్లీ టిక్కెట్‌ వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో వేరే నియోజకవర్గాల్లో ఎవరినైనా మహిళలను ప్రతిపాదిస్తే ఈ సీటును వీరి కుటుంబం నుంచి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. మహిళల సీట్లు జిల్లావారీ పరిగణనలోకి తీసుకుంటారా, రాష్ట్రవ్యాప్తంగా పరిగణిస్తారా అనేది అధిష్ఠాన నిర్ణయమే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బాగా బలీయం కావడం, అధికార వైసీపీ మీద ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరగడంతో తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగింది. లోక్‌సభ స్థానం నుంచి మళ్లీ మాగంటి రూప పోటీ చేయడానికి టిక్కెట్‌ అడుగుతారా లేదా అనేది చూడాలి. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కోసం ఇక్కడ ఆమె ఏమీ కృషి చేయలేదు. సీనియర్‌ నేత, గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ గత ఎన్నికల్లో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. అధిష్ఠానం పోటీ చేయమంటే చేస్తానన్నారు. సీనియర్‌నేత కాబట్టి ఆయన పేరును కూడా పరిశీలించే అవ కాశం ఉంది. ఇంకా కొన్ని పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. నర్సాపురం వైసీపీ ఎంపీ  రఘురామ కృష్ణంరాజు, సినీనటుడు నారా రోహిత్‌ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమ యం ఉంది.  బహుశా ఈ ఏడాది చివర నుంచి ఎవ రో ఒకరు తెరమీదకు వచ్చి పనిచేసే అవకాశం ఉంది. అనపర్తి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో ఇంకా స్పష్టత లేదు. కొద్దిరోజుల్లో మిగతాచోట్ల కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more