పోలీసులమని చెప్పి వెండి అపహరణ

ABN , First Publish Date - 2022-07-21T06:50:30+05:30 IST

పోలీసు తనిఖీ పేరుతో ఒక కారును అపి అందులో రవాణా చేస్తున్న 75 కేజీల వెండి వస్తువులను రూ 2.50 లక్షల నగదును అపహరించుకుపోయిన దొంగలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

పోలీసులమని చెప్పి వెండి అపహరణ

రాజమహేంద్రవరం సిటీ, జూలై 20: పోలీసు తనిఖీ పేరుతో ఒక కారును అపి అందులో రవాణా చేస్తున్న 75 కేజీల వెండి వస్తువులను రూ 2.50 లక్షల నగదును అపహరించుకుపోయిన దొంగలను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం  చెన్నైలో వెండి వ్యాపారి పురుషోత్తం నాగరాజన్‌ వద్ద పనిచేసే కుప్పుస్వామి సురేష్‌ బాబు, వెంకటేశన్‌ అన్నాదొరై  ఈ నెల 4వ తేదీన ఏపీ 39 బీఎల్‌ 0707 నెంబరు గల కారులో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒక గోల్డ్‌ షాపులో 19 కేజీల వెండిని తీసుకుని అక్కడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మరొక గోల్డ్‌షాపులో 15 కేజీల 176 గ్రాముల వెండిని తీసుకున్నారు. అదే కారులో  ఈనెల 5న రాజమహేంద్రవరం చేరుకుని ఇక్కడ 30 కేజీల 158 గ్రామలు వెండిని కొనుగోలు చేసుకుని మొత్తం 75 కేజీల వెండితో తిరిగి చెన్నై బయలు దేరారు. అయితే వారి కారును దేవరపల్లి వద్ద   ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆని పోలీసులమని చెప్పి కారులో గంజాయి, డబ్బులు ఉన్నాయని పోలీస్‌స్టేషన్‌కు రమ్మని బలవంతంగా గౌరీపట్నం నుంచి వెంకటాయపాలెం రోడ్డులోకి తీసుకువెళ్లారు. కారులో ఉన్న వెండి వస్తువులు నగదు, రెండు సెల్‌ ఫోన్లు, కారు తాళాలు లాక్కుని వెళ్లి పోయారని బాధితులు ఈనెల 9వ తేదీన దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌లో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చాకచక్యంగా దొంగతనానికి పాల్పడిన 11 మందిని అరెస్టు చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన కనిగోల్ల లక్ష్మీనారాయణ, సంసాని రామకృష్ణ అలియాస్‌ కిట్టు, ముప్పిన వారిగూడెంకు చెందిన పాతనేరస్తుడు  కుక్కల నాగేంద్ర కుమార్‌, చాగల్లుకు చెందిన గుడ్ల మణికంఠ, తాడేపల్లిగూడానికి చెందిన పంటమాని శ్రీనివాసరావు, కాకర దుర్గాప్రసాద్‌, గోపాలపురం మండలం వేళ్ళ చింతలగూడానికి చెందిన కవులూరి జోసెఫ్‌ అలియాస్‌ రాజశేఖర్‌, కొవ్వూరు మండలం తోగుమ్మికి చెందిన కాకుకలపాటి భార్గవ్‌, కొవ్వూరుకు చెందిన సొంగా వినయ్‌ కుమార్‌, తోగుమ్మికి చెందిన కొమ్మర ప్రదీప్‌కుమార్‌ పక్కా ప్లాన్‌ ప్రకారం ఈ దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు.  కాకులపాటి భార్గవ్‌, సొంగా వినయ్‌ కుమార్‌ ఒక ట్రావెల్స్‌ నుంచి వైట్‌ కలర్‌ స్విప్ట్‌ కారును అద్దెకు తీసుకుని దాని నెంబరు ప్లేట్‌ మార్చి రాజమహేంద్రవరం నుంచి కుప్పుస్వామి సురేష్‌, అన్నాదొరై కారును వెంటాడారని ఎస్పీ తెలిపారు. దేవరపల్లి సమీపంలో కారును పెంటమాని శ్రీనివాసరావు, కాకర దుర్గారావు, కాకులపాటి భార్గవ్‌, కొమ్మర ప్రదీప్‌లు ఆపి దోపిడీ చేశారని తెలిపారు. అటు పై దొంగిలించిన వెండి, నగదును దొంగలు కారులో కుమారదేవం అక్కడ నుంచి మద్దూరులంక తరలించి అక్కడ మిగలిన వారంతా కలిసి పంచుకుని వెళ్లిపోయారని చెప్పారు. నిందితులను బుధవారం అరెస్టు చేసి వారి నుంచి 75 కేజీల వెండి, రూ.30,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దొంగలను పట్టుకోవడంలో  కొవ్వూరు ఎస్‌డీపీవో బి.శ్రీనాథ్‌, దేవరపల్లి సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్‌ఐ కే శ్రీహరిరావు, తాళ్ళపూడి ఎస్‌ఐ కె..వెంకటరమణ, దేవరపల్లి ఏఎస్‌ఐ ఏకే సత్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుళ్లు వి.చంద్రశేఖర్‌, ఆర్‌.శ్రీనివాస్‌, ఐటీ కోర్‌ టీమ్‌ కానిస్టేబుల్‌ బి.హారీష్‌కుమార్‌, కొవ్వూరు క్రైమ్‌ కానిస్టేబుల్‌ అప్సారీ, దేవరపల్లి కానిస్టేబుల్‌ ఎస్‌కె సలీమ్‌, కె.కుమారస్వామి, బి.వీరబాబు, బి.విజయ్‌ కుమార్‌, కె.రామ్‌గోపాల్‌, కొవ్వూరు ఎస్‌డీపీవో హెచ్‌జీ టీవీ నరసింహారావులను ప్రత్యేకంగా అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందించారు.

Updated Date - 2022-07-21T06:50:30+05:30 IST