వైటీసీ కేంద్రం నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-11-28T00:59:45+05:30 IST

గిరిజన యువతకు శిక్షణ ఇచ్చే యూత్‌ ట్రైబల్‌ శిక్షణా కేంద్రాలు నిర్వీర్యమైపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీటిని నెలకొల్పారు.

వైటీసీ కేంద్రం నిర్వీర్యం

సామర్లకోట, నవంబరు 27: గిరిజన యువతకు శిక్షణ ఇచ్చే యూత్‌ ట్రైబల్‌ శిక్షణా కేంద్రాలు నిర్వీర్యమైపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీటిని నెలకొల్పారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. స్వయం ఉపాధి కల్పించేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శిక్షణ కేంద్రాలను పట్టించుకోవడం లేదు. నిధులు ఇవ్వక పోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా ఉన్నాయి. ఈ కారణంగా శిక్షణ నిలిచిపోయి గిరిజన యువతీ, యువకులు ఉపాధి కోల్పోతున్నారు. సామర్లకోట, నవంబరు 27: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కరువవుతోంది. గిరిజనులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యువత శిక్షణా కేంద్రాలు (వైటీసీ) నెలకొల్పారు. అయితే ప్రస్తుతం ఇవి ఎందుకు పనికిరాకుండా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. ఫలితంగా శిక్షణలు నిలిచిపోయాయి. దీంతో గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారు. సిబ్బంది వేతనాల కోసం ఏడాది కాలంగా ఎదురుచూపులు చూస్తున్నారు. వీరిలో కొందరైతే ప్రత్యామ్నాయ ఉపాధి వైపు వెళ్లిపోతున్నారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రంలో వైటీసీ పేరిట అధునాతన భవనాలను నిర్మించడమే గాక శిక్షణలకు సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. వందలాది మంది గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రంగాలలో శిక్షణ కల్పించే దిశగా కృషి చేశారు. టైలరింగ్‌, ప్లంబింగ్‌, పుట్టగొడుగుల పెంపకం, కంప్యూటర్స్‌ నర్సింగ్‌, ఆటోమొబైల్‌ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చేవారు. దీంతో పాటు అధికంగా డీఎస్సీ, కానిస్టేబుల్‌, ఆర్మీ, టెట్‌, ఆర్‌ఆర్‌బీ వంటి పరీక్షలకు కోచింగ్‌ కూడా ఇచ్చారు. అప్పటి రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉండే సామర్లకోట వైటీసీ శిక్షణా కేంద్రంలో వేలాది గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణ కల్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అసలు పట్టించుకోవడమే మానేశారు. అందులో పనిచేసే సిబ్బందికి సైతం జీతాలు చెల్లించడం మానేశారు. దీంతో బతుకుజీవుడా అంటూ మరో రంగంలో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిపోయారు. మరికొంత మంది సిబ్బంది వేరే ప్రాంతాలలో పనులు చేసుకుంటూనే పాత బకాయిల జీతాల కోసం రంపచోడవరంలో ఉన్న ఐటీడీఏ ప్రాజెక్ట్‌ పీవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల జిల్లాల విభజనతో సామర్లకోట వైటీసీ శిక్షణా కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనమయ్యింది. అయినా నేటివరకూ ఈ వైటీసీలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. కొద్ది నెలలుగా శిక్షణలు నిలిచిపోవడంతో గిరిజన యువత ఉపాధికి దూరమవుతున్నారు.

ప్రైవేటు చేతుల్లోకి

సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్ర ఆవరణలో ఉన్న యూత్‌ ట్రైబల్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వం నిర్వహించే సామర్థ్యం లేకపోవడంతో ప్రైవేట్‌ యాజమాన్యానికి లీజు ప్రాతిపదికన అప్పగించేందుకు అన్ని సన్నాహాలు పూర్తయినట్లు తెలిసింది. ఒంగోలు కేంద్ర కార్యాలయంగా ప్రస్తుతం గుంటూరు ప్రధాన కార్యాలయంగా నిర్వహణలో ఉన్న కేకే ఎడ్యుకేటర్స్‌ అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రైవేట్‌ యాజమాన్యంలోనే రానున్న కాలంలో రెండేళ్ల పాటు గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. ప్రైవేట్‌ రంగంలోనైనా వైటీసీ పూర్వవైభవం చూసేనా అని పలువురు గిరిజన నిరుద్యోగ యువత వేయికళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

సిబ్బందికి ఇబ్బందులు

సిబ్బందికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ శిక్షణా కేంద్రంలో మేనేజర్లు, కేర్‌టేకర్లు, హౌస్‌కీపింగ్‌. సెక్యూరిటీ గార్డులు తదితర సిబ్బందిని మొత్తం 20 మంది వరకూ గతంలో పనిచేసేవారు. వారికి గత అక్టోబరు నెల నుంచి జీతాలు చెల్లించడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పీవో వద్దకు వెళుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు. పాత బకాయిలు అయినా చెల్లించాలని సిబ్బంది కోరుతున్నారు. నిరుద్యోగులైన గిరిజన యువతకు శిక్షణ లేక ఎంతో మంది ఉపాధి అవకాశాలకు దూరం కావాల్సి వస్తోందని పడాల సింగన్నదొర అనే గిరిజన యువకుడు వాపోయాడు.

Updated Date - 2022-11-28T00:59:50+05:30 IST