జీతాలో జగనన్నా!

ABN , First Publish Date - 2022-09-28T05:44:50+05:30 IST

ఏ ఉద్యోగికైనా నెల జీతం రాకపోతే ఇబ్బందే.. వస్తుందో రాదో తెలియకపోతే మరింత ఇబ్బంది.. ఎందుకంటే జీతాలు రావని ఖర్చులు ఆగవు కదా..

జీతాలో జగనన్నా!

8 నెలలుగా జీతాలకు ఎదురుచూపులు 

ట్రామాకేర్‌ సిబ్బంది ఆకలి కేకలు

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు

స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

పస్తులుంటున్నామని ఆవేదన

ఎలా బతకాలంటూ ఆగ్రహం


ఏ ఉద్యోగికైనా నెల జీతం రాకపోతే ఇబ్బందే.. వస్తుందో రాదో తెలియకపోతే మరింత ఇబ్బంది.. ఎందుకంటే జీతాలు రావని ఖర్చులు ఆగవు కదా.. నెల వచ్చేసరికి ఎంత లేదన్నా.. ఇంటి అద్దెలు.. కరెంట్‌ బిల్లులు.. ఇంటిలోకి నెలసరి సరుకులు ఇలా ప్రతి నెలా ఖర్చు ఉంటూనే ఉంటుంది.. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే.. ఎందుకంటే ఎంత ఉన్నతాధికారికైనా ఈ ఖర్చు కామన్‌.. అటువంటిది పాపం రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో పనిచేసే ట్రామాకేర్‌ సిబ్బందికి 8 నెలలుగా జీతాలు రాకున్నా కనీసం పట్టించుకున్న వారే లేరు.. ఆయా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. తమ జీతాలు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.   పేర్లు చెప్పడానికి ఇష్టపడక పలువురు ఉద్యోగులు తమ ఆవేదన ఇలా వ్యక్తం చేశారు. 


రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 27 : జీతం నాలుగు రోజులు ఆలస్యమైతే చాలు ప్రభుత్వ ఉద్యోగులు గగ్గోలు పెడుతుంటారు. అలాంటిది ఒక నెలా, రెండు నెలలు కాదు ఏకంగా ఎనిమిది నెలల పాటు జీతాలు రాకపోతే ఆ ఉద్యోగుల కుటుంబాల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో ఎవరైనా ఊహించుకోవచ్చు. ఇంత దయనీయ పరిస్థితిని రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న ట్రామాకేర్‌ కాంట్రాక్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఈ ఏడాది జనవరి నుంచీ ప్రభుత్వం జీతాలు ఇవ్వడంలేదు. సెప్టెంబరు నెల కూడా పూర్తయితే 9 నెలల జీతాలు రావాల్సి ఉంటుంది. జీతాలివ్వాలని స్థానిక వైద్యాధికారులు,విజయవాడలోని వైద్యవిఽఽధాన పరిషత్‌ కమిషనర్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదు.ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తు న్నారే తప్ప జీతాలు మాత్రం చెల్లించడం లేదు. దీంతో జీతాలో జగనన్నా అంటూ ట్రామాకేర్‌ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. తమకిచ్చే చాలీచాలని వేతనం కూడా సకాలంలో ఇవ్వకపోతే ఎలా బతకాలంటూ ఆవేదన చెందున్నారు. 


ప్రమాదంలో నిండు జీవితాలు..


ట్రామాకేర్‌ విభాగం ... రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి అనుసంధానమై ఒక ప్రత్యేక విభాగంగా వైద్యసేవలు అందిస్తుంది. ప్రధానంగా హైవేలపై జరిగే రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ, అత్యవసర వైద్యసేవలందించడం ట్రామాకేర్‌ ప్రధాన ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ట్రామాకేర్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, తుని ప్రాంతాల్లో 2009లో రెండు ట్రామాకేర్‌ విభాగాలను ప్రారంభించి, 2010లో ట్రామాకేర్‌కు ప్రత్యేకంగా వైద్యసిబ్బందిని నియమించారు. స్పెషలిస్టు వైద్యులతో పాటు క్యాజువాలిటీ డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌ఓలు, థియేటర్‌ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఈసీజీ టెక్నీషియన్లు, అంబులెన్స్‌ డ్రైవర్లు, మేన్‌పోల్డ్‌ టెక్నీషియన్‌ తదితర పారామెడికల్‌ స్టాఫ్‌ను నియమించారు. వీరందరినీ కాంట్రాక్టు స్టాఫ్‌గా తీసుకున్నారు. 


పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..


ట్రామాకేర్‌ ఉద్యోగులకు జీతాలు, ఇతర నిర్వహణ తొలి ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం చూసుకునేది. అప్పట్లో సక్రమంగా నిధులు విడుదల కావడంతో ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించేవారు. అయితే ఐదేళ్ల తర్వాత ట్రామాకేర్‌ ఉద్యోగులకు జీతాలు, పర్యవేక్షణ బాధ్యతలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలోకి రావడంతో ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. కొంత కాలం పాటు రెండు, మూడు నెలలు ఆలస్యంగా జీతాలు వచ్చేవి. ఆ తర్వాత నుంచి నెలలు గడిచిపోతున్నా జీతాలు రావడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. 11వ పీఆర్‌సీ ప్రకారం జీతాలు పెంచాల్సి ఉన్నా ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. పాత జీతాలకు కూడా దిక్కులేని పరిస్థితి. అంబులెన్స్‌ డ్రైవర్లు, ఎలక్ర్టీషియన్‌, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వో లకు రూ. 12 వేల చొప్పున జీతాలు చెల్లిస్తుండగా.. ఎల్‌టీలకు రూ. 23 వేల వరకూ జీతాలు ఇస్తున్నాయి. అయితే  ఆ జీతం కూడా అందక ఇబ్బంది పడుతున్నారు.


60 మందికి మిగిలింది 25 మందే..


జీతాలు తక్కువ కావడం, ఇచ్చే అరకొర జీతాలు కూడా ఆలస్యం కావడంతో ట్రామాకేర్‌లో పనిచేసే వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని వెళ్లిపోయారు. ట్రామాకేర్‌కు సంబంధించిన ఒక్క వైద్యుడు కానీ, ఒక్క స్టాఫ్‌నర్సు కానీ ఇప్పుడు లేరంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రామాకేర్‌ ప్రారంభించినప్పుడు ఒక్క రాజమహేంద్రవరం విభాగంలోనే సుమారు 60 మంది వైద్య సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 25కు తగ్గిపోయింది. ఉన్న కొద్దిమంది కూడా తమకు మంచిరోజులు రాకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నెలల తరబడి జీతాల్లేక పోయినా ఆర్థిక ఇబ్బందులతోనే ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు తమ ఆర్థిక బాధలను అర్థం చేసుకుని, తక్షణమే జీతాలు విడుదల చేసి కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఇకనైనా   తమ జీతాలు విడుదల చేయాలని కోరుతున్నారు. 


ఎలా బతకాలో తెలియడం లేదు..

అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నాం.. ఏకంగా 8 నెలల పాటు జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడు తున్నాం. కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియడం లేదు. ఎంత కాలం జీతాలు లేకుండా పనిచేయమంటారు. ఇది మీకు న్యాయమేనా. కాస్త ఆలోచించండి. 


జీతాలివ్వకపోతే రోడ్డున పడతాం..

కిరాణా దుకాణం వద్ద ఖాతా పెట్టాను..                              5 నెలల పాటు సరుకులు అరువు ఇచ్చాడు..              ఇప్పుడు ఇవ్వనంటున్నాడు.. ఇద్దరు పిల్లలతో ఏం చేయాలో పాలుపోవడంలేదు. అద్దె కూడా బకాయి పడ్డార. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు.  ఈ నెలలో జీతాలు పడకపోతే వచ్చే నెలలో కుటుంబం రోడ్డున పడిపోతుంది. 


మా నాన్నే డబ్బులిస్తున్నాడు..

మా నాన్న వ్యవసాయం చేస్తాడు.. ఆయన పంపించే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా.                   ఒక నాలుగు నెలల పాటు డబ్బులు పంపించారు. ఇప్పుడు అడుగుతుంటే  ఉద్యోగం వదిలేసి వచ్చేయ్‌.. వ్యవసాయం చేసుకుందువు కానీ అంటున్నాడు.           ఏం చేయాలో పాలుపోవడం లేదు. 


నా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. 

8 నెలలుగా జీతాలు రాకపోవడంతో నా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది..వచ్చే కొద్ది మొత్తం కూడా రాకపోతే ఎలా బతుకుతాం. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండడంతో నా భార్య ఆ నిర్ణయం తీసుకుంది. కాదనలేకపోయాను. కానీ నాకు చిన్నతనంగా ఉంది. ఎంతకాలమిలా?

Updated Date - 2022-09-28T05:44:50+05:30 IST