రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2022-09-19T06:16:31+05:30 IST

అమ్మానాన్నలకు దూరంగా హాస్టల్‌లో ఉంటున్న ఆమె ఆదివారం సెలవుదినం కావడంతో వారిని కలిసేందుకు ఆత్రంగా సొంతూరుకు బయలుదేరింది.

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని మృతి

 తల్లిదండ్రులను కలిసి తిరిగి వెళ్తుండగా ఘటన

తొండంగి, సెప్టెంబరు 18: అమ్మానాన్నలకు దూరంగా హాస్టల్‌లో ఉంటున్న ఆమె ఆదివారం సెలవుదినం కావడంతో వారిని కలిసేందుకు ఆత్రంగా సొంతూరుకు బయలుదేరింది. స్నేహితురాలితో కలిసి వెళ్లి అమ్మానాన్నలతో ఆనందంగా గడిపింది. ఆప్యాయంగా పెట్టిన అమ్మచేతి వంటను  తిని భారమైన మనస్సుతో తిరిగి కళాశాలకు బయలుదేరింది. అమ్మానాన్నలతో  వస్తానమ్మా అని బయలుదేరిన బిడ్డ గమ్యం చేరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.  బెండపూడి శివారు సత్యదేవుడి నమూనా ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టా నందిని (21) అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని దుర్మరణం చెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన కట్టా కాశీవిశ్వనాథం కుమార్తె నందిని (21) కాకినాడ సూరంపాలెం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐటీ నాల్గో సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌లో ఉంటున్న నందిని తన స్నేహితురాలు వసంతతో కలిసి ఆదివారం కావడంతో కాకరాపల్లిలో ఉన్న తల్లిదండ్రులను కలిసేందుకు స్కూటర్‌పై వచ్చింది. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి న అనంతరం తిరిగి స్కూటర్‌పై కళాశాలకు స్నేహితురాలితో కలిసి బయలు దేరింది. బెండపూడి శివారు సత్యదేవుని నమూనా ఆలయం సమీపంలో స్కూటీ అదుపుతప్పి పక్కన ఆగిఉన్న లారీని ఢీకొనడంతో నందిని అక్కడికక్క డే మృతిచెందింది. వసంతకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై కేసు నమో దుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొండంగి ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒక్కగానొక్క కూతురు మర ణాన్ని తట్టుకోలేని ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.


Read more