బియ్యం అక్రమ నిల్వలపై దాడులు

ABN , First Publish Date - 2022-09-08T06:49:28+05:30 IST

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ ఎస్పీ రవికుమార్‌ ఆదేశాలతో రెండు జిల్లాల్లో అధికారులు రైస్‌ మిల్లులపై దాడులు చేశారు.

బియ్యం అక్రమ నిల్వలపై దాడులు

 రెండు జిల్లాల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు
పలు కేసుల నమోదు

రాజమహేంద్రవరం సిటీ/కోటనందూరు, సెప్టెంబరు 7: విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ ఎస్పీ రవికుమార్‌ ఆదేశాలతో రెండు జిల్లాల్లో అధికారులు రైస్‌ మిల్లులపై దాడులు చేశారు. కాకినాడ జిల్లాలోని కోటనందూరులో శ్రీలలిత ట్రేడర్స్‌ రైస్‌ మిల్లులో పీడీఎస్‌ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్టు వచ్చిన సమాచారంతో దాడి చేసిన అధికారులు బియ్యం తరలించిన ఆటోడ్రైవర్‌ శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. మిల్లులో నిల్వచేసిన 13,300 మెట్రిక్‌ టన్నుల పీడీఎస్‌ బియ్యం, 9300 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 4500 మెట్రిక్‌ టన్నుల విరిగిన బియ్యం, 2,675 మెట్రిక్‌ టన్నుల నూకలు, తవుడు కలిపి మొత్తం రూ.10,43,750 విలువ చేసే బియ్యాన్ని అధికారులు గుర్తించారు. వాటిని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు సీజ్‌ చేసి 6ఎ కింద కేసు నమోదు చేశారు. అలాగే రైసు మిల్లు యజమాని, గుమస్తా, ఆటోడ్రైవర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు కోసం కోటనందూరు పోలీస్‌స్టేషన్‌కు సిఫార్సు చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం ఆదర్శనగర్‌లో ఓ ఇంట్లో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా  నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. 50 కిలోల బియ్యం బ్యాగ్‌లు 51 ఉన్నాయన్నారు. వాటిని నిడబ్రోలు నాగమల్లికార్జునరావు రూరల్‌ మండలంలోని కొంతమూరు, కోలమూరు గ్రామాల్లో రేషన్‌ కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి వాటిని కోరుకొండ, గోకవరం ప్రాంతాల్లో ఇటుకబట్టి కార్మికులకు విక్రయిస్తున్నాడని తెలిపారు. అతని నుంచి 2.5 మెట్రిక్‌టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.96,900 ఉంటుందన్నారు. నిందితుడిపై 6ఎ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దాడుల్లో డీఎస్పీ ముత్యాలనాయుడు, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వై.సత్యకిశోర్‌, జియాలజిస్ట్‌ లక్ష్మీనారాయణ, వ్యవసాయాధికారి భార్గవ మహేష్‌, తహశీల్దార్‌ విజయకుమార్‌, హెచ్‌సీ జీవానంద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-08T06:49:28+05:30 IST