కుతుకులూరులో 800 కేజీల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2022-03-23T06:12:37+05:30 IST

అనపర్తి మండలం కుతుకులూరులోని బసివిరెడ్డి పేట నుంచి వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్థానికుల సమాచారంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కుతుకులూరులో 800 కేజీల రేషన్‌ బియ్యం స్వాధీనం
రేషన్‌ బియ్యం బస్తాలు

   అనపర్తి, మార్చి 22 : అనపర్తి మండలం  కుతుకులూరులోని బసివిరెడ్డి పేట నుంచి వ్యాన్‌లో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని స్థానికుల సమాచారంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంఎస్‌వో మెహర్‌బాబా తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బసివిరెడ్డి పేట నుంచి వ్యాన్‌లో తరలిస్తున్న 800 కేజీలు (16 బస్తాల) రేషన్‌ బియ్యాన్ని అధికారులు గుర్తించారు.  వ్యాన్‌ డ్రైవర్‌ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి బియ్యాన్ని బిక్కవోలు ఎంఎస్‌వో పాయింట్‌కు తరలించి వాహనాన్ని అనపర్తి పోలీసులకు అప్పగించారు. అయితే ఇక్కడ స్థానికుల కథనం మరోలా ఉంది. బసివిరెడ్డి పేటలో రేషన్‌ బియ్యం వ్యాన్‌లో తరలిస్తుండగా స్థానిక వీఆర్‌వోకు సమాచారం అందించామని దీంతో ఆయన ఎంఎస్‌వోకు సమాచారం అందించి వ్యాన్‌లో సరుకును సీజ్‌ చేసినట్లు తెలిపారు. వాహనం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకునే సరికి ఎంఎస్‌వో అక్కడికి చేరుకున్నారు. అక్కడ వ్యాన్‌లో ఏడు బస్తాలు మాత్రమే ఉండటంతో స్థానికులు అవాక్కయ్యారు. అప్పటివరకు వ్యాన్‌ నిండుగా ఉన్న బస్తాలు ఇక్కడికి వచ్చేసరికి కేవలం ఏడు మాత్రమే ఉండటం ఏమిటని అధికారులను మీడియా ప్రశ్నించడంతో మరోచోట దాచిన తొమ్మిది బస్తాలను అక్కడికి రప్పించి మొత్తం 16 బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లుగా కేసు నమోదు చేశారు. వ్యానులో మొత్తం 50 బస్తాల వరకు ఉంటాయని మిగిలిన బస్తాలు ఏమైనట్లని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిపై ఎంఎస్‌వో బాబాను వివరణ కోరగా తనకు సమాచారం అందిన వెంటనే వీఆర్‌వోను పంపించానని తాను వచ్చే సరికే వాహనం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుందని అన్నారు. బియ్యం మాయమవడంపై ప్రశ్నించగా విచారణ నిర్వహిస్తామని చెప్పారు.

Read more