చిన్న పులసలోచ్‌..

ABN , First Publish Date - 2022-09-11T06:53:29+05:30 IST

గోదావరి జిల్లాలో పులసకు ఎంతో డిమాండు ఉంటుంది. ఈ సీజన్‌లో లభించే పులసలను ఏ ధరకైననూ కొనుగోలు చేసి మాంసాహార ప్రియులు తృప్తిగా భుజిస్తారు.

చిన్న పులసలోచ్‌..

జానెడు పులస రూ.వెయ్యి.. ఇవీ అరుదుగానే

ఆత్రేయపురం, సెప్టెంబరు10: గోదావరి జిల్లాలో పులసకు ఎంతో డిమాండు ఉంటుంది. ఈ సీజన్‌లో లభించే పులసలను ఏ ధరకైననూ కొనుగోలు చేసి మాంసాహార ప్రియులు తృప్తిగా భుజిస్తారు. బంధుమిత్రులకు పులస పులుసు వండించి రుచిచూపిస్తారు. ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నేతలకు గోదావరిలో లభించే పులసలు వండించి ప్రత్యేకంగా పంపించడం పరిపాటే. ఈ సీజన్‌లో అరుదుగా లభించే పులసను పుస్తెలమ్మైనా కొనుగోలు చేస్తారని ఈ ప్రాంతవాసుల నానుడి. బొబ్బర్లంక గోదావరిలో లభించే పులసకు ఎంతో డిమాండు ఉంటుంది. ఇక్కడ లభించే పులస రుచే వేరంటారు మాంసాహారప్రియులు. ప్రస్తుతం ఇక్కడ పులస జాడే కానరాలేదు. వాతావరణంలోని ఏర్పడ్డ మార్పుల కారణ మో ఏమో గోదావరి నీటికాలుష్యమో తెలియదుగానీ మత్స్యకారుల వలకు పులస చిక్కలేదు. వారంరోజుల కిందట రెండు కిలోలలోపు పులస లభించగా రూ.22        వేల ధర పలికింది. మళ్లీ వేటదారుల వలకు ఒక్క పులస చిక్కలేదు. ప్రస్తుతం అరుదుగా జానెడు సైజులో ఉన్న పులసలు లభిస్తున్నాయి. ఒక్కొక్క చేప రూ.700 నుంచి రూ.1000 ధర పలుకుతోంది. పెద్ద చేపలు దొరకక పోవడంతో ఎలాగైనా తినాలనే కోరికతో పులసప్రియులు జానెడు పులసలను కొనుగోలు చేసుకుని ఈ ఏడాది పులస తిన్నామని తృప్తి పడుతున్నారు. అయితే వివిధ ప్రాంతాల్లో ఒడిశాలో లభించే విలసను తీసుకువచ్చి పులసలుగా అమ్మేస్తున్నారు.


Read more