విద్యుత్‌ బిల్లుల అప్‌డేట్‌ లింక్‌ క్లిక్‌ చేస్తే రూ.5.94 లక్షలు దోపిడీ

ABN , First Publish Date - 2022-11-03T00:46:57+05:30 IST

విద్యుత్‌ బిల్లుల అప్‌డేట్‌ చేసుకోవాలని మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన సందేశాలన్నీ క్లిక్‌ చేస్తే రూ 5.94 లక్షలు ఆన్‌లైన్‌లో దోపిడీ చేశారు.

విద్యుత్‌ బిల్లుల అప్‌డేట్‌ లింక్‌ క్లిక్‌ చేస్తే రూ.5.94 లక్షలు దోపిడీ

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 2 : విద్యుత్‌ బిల్లుల అప్‌డేట్‌ చేసుకోవాలని మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన సందేశాలన్నీ క్లిక్‌ చేస్తే రూ 5.94 లక్షలు ఆన్‌లైన్‌లో దోపిడీ చేశారు. బొమ్మూరు పోలీసుల కఽథనం ప్రకారం.. రాజమహేంద్రవరం లాలాచెరువు సమీపంలోని స్వరూప్‌ నగర్‌కు చెందిన కొమరాబత్తుల ఇర్మియ ఓఎన్‌జీసీలో మేనేజరుగా పనిచేస్తున్నారు. అతని మొబైల్‌ ఫోన్‌కు నాలుగురోజుల కిందట తన ఇంటికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులను అప్‌డేట్‌ చేసుకోవాలని మెస్సెజ్‌ వచ్చింది. అయితే దానిని క్లిక్‌ చేసి తన బ్యాంక్‌ ఖాతా వివరాలను అందులో పొందుపరిచాడు.మరుసటి రోజున తన బ్యాంక్‌ ఖాతాలో రూ.5.94 లక్షలు మాయంకావడంతో అవాక్కయ్యాడు. ఈ మేరకు బాధితుడు బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ బిల్లులపై ఫేక్‌ మెసేజ్‌లు

ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌.మూర్తి

రాజమహేంద్రవరం, నవంబరు2(ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ బిల్లులు కట్టలేదని..ఈ రాత్రి నుంచే మీకు విద్యుత్‌ సరఫరా ఆపేస్తున్నామని.. వెంటనే ఒక నెంబర్‌ను సంప్రదించాలని హెచ్చరిస్తూ విద్యుత్‌ వినియోగదారులకు ఫేక్‌ మేసేజ్‌లు వస్తున్నాయని, వీటిని నమ్మవద్దని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ టీవీఎస్‌.మూర్తి తెలిపారు.ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ చేశారు. కొంత మందికి 76798 21942 మొబైల్‌ నెంబర్‌ నుంచి ఇటీవల ఓ మెసేజ్‌ వచ్చిందన్నారు.ఇటువంటి ఫేక్‌ మెసేజ్‌ కాని .. వెబ్‌లింక్‌ కానీ వస్తే విద్యుత్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బిల్లుల చెల్లింపులో ఏవైనా సందేహాలు ఉంటే ఏఏవోఈఆర్‌ రాజమహేంద్రవరంలో 9440812694, రూర్‌లో 9440812695 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - 2022-11-03T00:47:00+05:30 IST