పోస్టాఫీసు ఖాతాల సొమ్ములు స్వాహా!

ABN , First Publish Date - 2022-09-17T07:07:59+05:30 IST

పోస్టల్‌ శాఖ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం. వడ్డీ తక్కువైనా అక్కడే డిపాజిట్లు చేస్తారు. సేవింగ్‌ ఖాతాలు తెరుస్తారు. ఆ నమ్మకాన్ని కొందరు పోస్టల్‌ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఖాతాలను తమకు అనుకూలంగా మార్చుకుని అవకతవలకు పాల్పడుతున్నారు.

పోస్టాఫీసు ఖాతాల సొమ్ములు స్వాహా!
పోస్టాఫీసు వద్ద ఖాతాదారుల ఆందోళన..

  • కొవ్వూరు మండలం ధర్మవరంలో గోల్‌మాల్‌
  • ఊరు ఊరంతా గగ్గోలు.. నకిలీ పాస్‌ పుస్తకాలతో బురిడీ
  • డిపాజిట్లు, సేవింగ్‌ ఖాతాల సొమ్ము భారీఎత్తున పక్కదారి
  • రూ.1.80 కోట్ల మేర గోల్‌మాల్‌?.. పోస్టుమాస్టరే నిందితుడు
  • అతడిని గదిలో ఉంచి ఆందోళన చేస్తున్న మదుపుదారులు
  • తమకు న్యాయం చేయాలంటూ అర్ధరాత్రి వరకు ఆందోళన

కొవ్వూరు, సెప్టెంబరు 16 : పోస్టల్‌ శాఖ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం. వడ్డీ తక్కువైనా అక్కడే డిపాజిట్లు చేస్తారు. సేవింగ్‌ ఖాతాలు తెరుస్తారు. ఆ నమ్మకాన్ని కొందరు పోస్టల్‌ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఖాతాలను తమకు అనుకూలంగా మార్చుకుని అవకతవలకు పాల్పడుతున్నారు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరంలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ.  కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో అందరూ కూలి పనిచేసుకుని జీవించే పేదలే. పోస్టల్‌ల్లో అయితే తమ సొమ్ము భద్రంగా ఉంటుందని చాలాకాలంగా ఎఫ్‌డీ, సేవింగ్స్‌ ఖాతాలను తెరిచారు. ఖాతాదారులు పెద్దగా చదువు కోకపోవడం, బయట విషయాలు పెద్దగా అవగాహన లేకపోవడం, కనీసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్టుకు బాండ్‌ ఇస్తారని తెలియకపోవడంతో పోస్టుమాస్టర్‌ ఎస్‌కే మీరావలీ నకిలీ పాస్‌ పుస్తకాలు తయారు చేయించి ఖాతాదారులను మోసగించడం ప్రారంభించాడు. ఇలా 2017 నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. గ్రామానికి చెందిన సుమా రు 750 మంది ఖాతాదారులకు చెందిన సుమారు రూ.1.80 కోట్ల సొమ్మును మా యం చేసినట్టు ఖాతాదారులు చెబుతున్నారు. గత అయిదేళ్లుగా అవకవతలకు పాల్పడుతుండడంతో ఎంత మొత్తం అనేది అంచనా వేయలేకపోతున్నారు.  

బయట పడిందిలా...

అదే గ్రామానికి చెందిన పెదవేగి ఆనందరావు ఈనెల 9న రూ.5 లక్షల సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్టు చేశాడు. పోస్టల్‌ సేవలు ఆన్‌లైన్‌ కావడంతో 14న కొవ్వూరు పోస్టాఫీసులో డిపాజిట్‌ సొమ్మును తనిఖీ చేయించగా తన ఖాతా కనిపించలేదు. దీంతో ధర్మవరం బ్రాంచి పోస్టాఫీస్‌ వేగేశ్వరపురం పరిధిలో ఉండడంతో కొవ్వూరు పోస్టల్‌ సిబ్బంది అక్కడ కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు. అక్కడ కూడా ఎఫ్‌డీలో సొమ్ములు లేకపోవడంతో ధర్మవరం పోస్టాఫీసుకు వెళ్లి పోస్టుమాస్టర్‌ను నిలదీశాడు. దాంతో ఆనందరావుకు అప్పటికప్పుడు రూ.4.50 లక్షలు ఇచ్చి సర్దుబా టు చేశాడు. ఈలోపు పోస్టల్‌ అధికారులకు అనుమానం రావడంతో ఆడిట్‌ చేయడానికి  శుక్రవారం వస్తున్నట్టు గ్రామంలో ఈనెల 15న టాంటాం వేయించారు. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. పోస్టాఫీసుకు ఖాతాదారులు క్యూ కట్టారు. శుక్రవారం కొవ్వూరు పోస్టల్‌ ఏఎస్పీ కె.శ్రీనివాసరావు తనిఖీకి విచ్చేశారు. ఉదయం నుంచి ఏ పాస్‌ పుస్తకం పరిశీలించినా, ఎవరి ఖాతాలను చూసినా పాస్‌ పుస్తకాలు నకిలీవని తేలడంతో తాము కష్టపడి దాచుకున్న సొమ్ము చెల్లించాలని పోస్టల్‌ కార్యాలయం వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఖాతాదారుల సొమ్ము చెల్లించే వర కు వెళ్లేది లేదని పోస్టాఫీసు వద్ద బైఠాయించారు. పోస్టుమాస్టర్‌ తన గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగుతోంది. 

ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు...

ప్రభుత్వ బ్యాంకు అయినా, ప్రైవేట్‌ బ్యాంకు అయినా ప్రతి ఏడాది ఆర్ధిక సంవత్సరం ముగిసే ముందు ఆడిట్‌ చేయడం జరుగుతుంది. పోస్టల్‌కు కూడా ప్రతి మూడేళ్లకు ఒకసారి ఆడిట్‌ చేస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు అయిదేళ్లు కావస్తోంది. అంటే మూడేళ్ల కిందట ఒకసారి ఆడిట్‌ జరిగింది. కానీ అవకతవకలను పట్టుకోలేకపోయారు. పోస్టుమాస్టర్‌ ముందు జాగ్రత్తగా నకిలీ పాస్‌ పుస్తకాలను ఇవ్వడంతో ఆడిట్‌ సిబ్బంది మీరావలీ మోసాలను కనిపెట్టలేకపోయారు. కానీ కాస్త లోతుగా ఆడిట్‌ చేసి ఉన్నట్టయితే మూడేళ్ల కిందటే ఈ మోసం బయటపడేది. 

నకిలీ పాస్‌ పుస్తకాలపై విచారిస్తున్నాం : ఏఎస్పీ

ప్రతి మూడేళ్లకు తనిఖీల్లో భాగంగా ధర్మవరం పోస్టాఫీసుకు రావడం జరిగిందని కొవ్వూరు పోస్టల్‌ ఏఎస్పీ కె. శ్రీనివాసరావు చెప్పారు. అయితే పోస్టాఫీసులో సొమ్ము దాచుకున్న ఖాతాదారులకు పోస్టుమాస్టర్‌ నకిలీ పాస్‌ పుస్తకాలు అందించి సొమ్ము గల్లంతు చేసినట్టు తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఖాతాదారులు లబోదిబో..

పోస్టాఫీసులో తాము దాచుకున్న సొమ్ములు లేవని తెలిసి బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. ఖాతాదారుడు సరిపల్లి జగదీష్‌ మాట్లాడుతూ ధర్మవరంలో టెంట్‌ సామాను అద్దెకు ఇచ్చి కొంతకొంతగా పిల్లల చదువులు, భవిష్యత్‌ కోసం రూ.9 లక్ష లు ఎఫ్‌డీలో దాచుకున్నామని, నకిలీ పాస్‌ పుస్తకం ఇచ్చి పోస్టుమాస్టర్‌ మోసగించా డని వాపోయాడు. తాతపూడి సునీత అనే మహిళ మాట్లాడుతూ తాను కష్టపడి సంపాదించుకున్న లక్ష రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశానని, జనవరిలో మరో 2 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్టు చేయడానికి తెస్తే కుమారునికి బాగాలేదు తర్వాత ఇస్తా నని పోస్ట్‌మాస్టర్‌ తీసుకున్నాడని వాపోయింది. కొయ్యా సువర్ణరాజు అనే ఖాతాదారుడు మాట్లాడుతూ తన సేవింగ్‌ ఖాతాలో రూ.1,82,865 ఉండాలని, చెక్‌ చేస్తే రూ. 166 ఉన్నాయని, ఎఫ్‌డీలో రూ.40 వేలు వేస్తే అవి లేవంటున్నారని వాపోయాడు.

Updated Date - 2022-09-17T07:07:59+05:30 IST