ఒక్కరూ రారేంటో...

ABN , First Publish Date - 2022-02-16T06:38:22+05:30 IST

జిల్లాలో ఏ పనికి ప్రభుత్వం టెండర్లు పిలిచినా గత ప్రభుత్వ హయాంలో కాంట్రా క్టర్లు క్యూ కట్టేవారు. పోటాపోటీగా బిడ్‌లు దాఖలు చేసేవారు. పిలిచిన తొలి ప్రయత్నం లోనే అన్నీ పూర్తయిపోయి పనులు మొదలయ్యేవి. కానీ గడచిన రెండున్నరేళ్లుగా జిల్లాలో ఏ ఒక్క టెండర్‌కు తొలి ప్రయత్నంలో ఒక్క కాంట్రాక్టరు కూడా పని చేయడానికి ముందుకు రావడంలేదు.

ఒక్కరూ రారేంటో...
శిథిలావస్థకు చేరిన సామర్లకోట పోలీస్‌ స్టేషన

  • జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పోలీసు స్టేషన్లకు మరమ్మతులు కలే
  • ఒకటికి పదిసార్లు టెండర్లు పిలిచినా కన్నెత్తి చూడని కాంట్రాక్టర్లు
  • ఏపీఎస్పీ బెటాలియన సహా మండపేట, సామర్లకోట, సీతానగరం, కోరుకొండ, ఆత్రేయపురం, తొండంగి స్టేషన్లకు ఇక్కట్లు
  • వీటన్నింటి మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.కోటితో అంచనాలు 
  • ఎన్నిసార్లు గడువు పూర్తయినా ఒక్క టెండరూ దాఖలు కాని దుస్థితి
  • రాజమహేంద్రవరం, రంప, తుని, రామచంద్రపురం ఆసుపత్రుల్లో అదనపు పడకల పనులకు ఏకంగా 22వసారి టెండర్ల పిలుపు
  • బిల్లులు రావనే భయంతో ప్రభుత్వ వర్కులంటేనే కాంట్రాక్టర్ల బెంబేలు

జిల్లాలో టెండర్‌ వర్కులకు కాంట్రాక్టర్ల నుంచి అసలు స్పందనే ఉండడం లేదు. ఏ పనికి బిడ్‌ ఆహ్వానించినా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఎవరొకరు రాకపోతారా అనే ఆశతో ఒకటికి పదిసార్లు అదేపనిగా పిలుస్తున్నా ఒక్కరూ ఉలకడం లేదు. ఆసుపత్రులు, రహదారులు, పీహెచసీలు, ఆర్‌బీకేలు, ట్రాన్సకో, పీఆర్‌, రైతుబజార్లు ఇలా ఏ శాఖలో పనులకు చూసినా ఇదే గతి.  ఇప్పుడు తాజాగా పోలీసు స్టేషన్లకు ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఏపీఎస్పీ బెటాలియనసహా మండపేట, సామర్లకోట, సీతానగరం, కోరుకొండ, ఆత్రేయపురం, తొండంగి స్టేషన్లకు మరమ్మ తులు, ఆధునికీకరణకు ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన రూ.కోటితో టెండర్లు పిలిస్తే అసలు స్పందనే రాకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. వీటికి అసలు మరమ్మతులు జరుగుతాయనే నమ్మకం కూడా పోయింది. రాజమహేంద్రవరం, రంపచోడవరం, తుని, రామచంద్రపురం ఆసుపత్రుల్లో అదనపు పడకల ఏర్పాటుకు గతేడాది పిలిచిన టెండర్లకు స్పందనలేకపోవడంతో ఇప్పటికి 22వసార్లు పిలవాల్సి వచ్చింది.

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఏ పనికి ప్రభుత్వం టెండర్లు పిలిచినా గత ప్రభుత్వ హయాంలో కాంట్రా క్టర్లు క్యూ కట్టేవారు. పోటాపోటీగా బిడ్‌లు దాఖలు చేసేవారు. పిలిచిన తొలి ప్రయత్నం లోనే అన్నీ పూర్తయిపోయి పనులు మొదలయ్యేవి. కానీ గడచిన రెండున్నరేళ్లుగా జిల్లాలో ఏ ఒక్క టెండర్‌కు తొలి ప్రయత్నంలో ఒక్క కాంట్రాక్టరు కూడా పని చేయడానికి ముందుకు రావడంలేదు. ఒకరకంగా సర్కారు టెండర్లు అంటేనే వీరంతా బెంబేలెత్తిపో తున్నారు. పనులు చేసినా బిల్లులు చెల్లించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడంతో కోట్ల విలువైన పనులైనాసరే కన్నెత్తి చూడడం లేదు. దీనికి నిదర్శనమే గతేడాది జిల్లాలో కొన్ని వందల రహదారుల నిర్మాణానికి రూ.750 కోట్లతో పిలిచిన టెండర్ల వ్యవహారం. వీటికి పదిసార్లు బిడ్‌లు ఆహ్వానించినా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇలా జరగడం జిల్లా టెండర్ల చరిత్రలో ఇదే తొలిసారి. ఆ తర్వాత ఆసుపత్రులు, పీహెచసీలు, అంగన వాడీ భవనాలు, రైతుబజార్లు, ఆర్‌బీకేలు, పీఆర్‌ పనులు, ఆర్‌డబ్ల్యూ వర్కులు ఇలా వేటికి టెండర్లు పిలిచినా ఎనిమిది నుంచి పదిసార్లు పిలిచినా స్పందన రాలేదు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల బిల్లుల భయంతో ఏ పనీ సక్రమంగా జరగలేదు సరికదా ఎక్కడివక్కడే అన్నట్టు ఆగిపోయాయి. తాజాగా ఈ తిరస్కారం పోలీ సుస్టేషన్లకు సైతం విస్తరించింది. వీటికి ఎన్నిసార్లు బిడ్లు ఆహ్వానిస్తున్నా ఏ ఒక్కరూ పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కోరుకొండ స్టేషన ఆధునికీకరణకు రూ.15.71లక్షలతో కొన్నినెలల కిందట ఏపీ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన టెండర్లు పిలిచింది. ఎవరూ రాకపోవడంతో ఇప్పుడు మూడోసారి పిలిచారు. అయినా స్పందన శూన్యం. తొండంగి స్టేషనలో రెస్ట్‌రూమ్‌ల నిర్మాణానికి రూ.7.80 లక్షలతో టెండర్లు పిలవగా ఇప్పుడు నాలుగో కాల్‌ వరకు వచ్చింది. సామర్లకోట టౌన పోలీసు స్టేషన 1989లో నిర్మించారు. అప్పటినుంచి ఇప్పటివరకు దీనికి మరమ్మతులు లేకపో వడంతో శిథిలావస్థకు చేరింది. శ్లాబు పెచ్చులూడి కింద పడుతోంది. దీంతో మరమ్మతులకు రూ.7.43 లక్షలతో రెండోసారి టెండర్‌ పిలవాల్సి వచ్చింది. మండపేట టౌన స్టేషనలో మరమ్మతులకు రూ.6.55 లక్షలు కేటాయించా రు. రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. ఆత్రే యపురం స్టేషనకు మరమ్మతులకు రూ.5.83 లక్షలు, రాజమహేంద్రవరంలో బ్యారక్‌ మరమ్మతులకు రూ.15.71 లక్షలు, సీతానగరం స్టేషనలో వెయిటింగ్‌ హాల్‌, స్టోర్‌ రూం నిర్మాణానికి రూ.17.08 లక్షలు కేటాయించి టెండ ర్లు పిలిచారు. ఈ మూడింటికి పనులు చేయడానికి ఒక్క కాంట్రాక్టర్‌ కూడా టెండర్‌ వేయలేదు. కాకినాడ ఏపీఎస్పీ బెటాలియనలో మరమ్మతులకు రూ.15.48 లక్షలు కేటా యించి టెండర్లు నాలుగుసార్లు పిలిచినా కాంట్రాక్టర్లు అటువైపు చూడలేదు. ఇలా దాదాపు కోటి రూపాయల పనులకు బిడ్‌లు అదేపనిగా ఆహ్వానిస్తున్నా ఒక్కరు కూడా పని చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో మర మ్మతులు జరగక స్టేషన్లకు కష్టాలు పెరుగుతున్నాయి. దీంతో అనేక స్టేషన్ల నుంచి మరమ్మతు, ఆధునికీకరణ పనులు ఇంకెప్పుడు చేస్తారంటూ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన ఇంజనీర్లకు పోలీసు అధికారులు ఫోన్లు చేయాల్సి వస్తోంది. కాగా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులు, మహిళల కోసం పది పడకల నిర్మాణం కోసం రూ.27 లక్షలతో గతేడాది టెండర్లు పిలిచారు. స్పందన లేకపోవడంతో తాజాగా 22వ సారి బిడ్‌లు ఆహ్వానించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి వసతులే రాజమహేంద్రవరం, తునిలో కల్పించడానికి 19సార్లు టెండర్లు పిలవాల్సిన దుస్థితి నెలకొందని, ఈ సమస్యలకు మోక్షం ఎప్పుడంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Read more