పింఛన్ల పంపిణీలో చేతివాటం

ABN , First Publish Date - 2022-09-10T06:19:39+05:30 IST

పేదల పింఛన్ల పంపిణీలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చేతివాటం ప్రదర్శించాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.వీరబాబు ఈనెల పింఛన్లను చెల్లించేందుకు ముందుగా లబ్ధిదారుల నుం చి వేలిముద్రలు తీసుకున్నాడు.

పింఛన్ల పంపిణీలో చేతివాటం

కొత్తపల్లి, సెప్టెంబరు 9: పేదల పింఛన్ల పంపిణీలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ చేతివాటం ప్రదర్శించాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామ సచివాలయంలో  వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.వీరబాబు ఈనెల పింఛన్లను చెల్లించేందుకు ముందుగా లబ్ధిదారుల నుం చి వేలిముద్రలు తీసుకున్నాడు. ఒకటో తేదీన పలువురి దగ్గర వేలిముద్రలు తీసుకుని సొమ్ములు చెల్లించకపోవడంతో పలువురు సర్పంచ్‌ వేమగిరి చెల్లాయ్యమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె పంచాయతీ కార్యదర్శి నాగులపల్లి ముసలయ్యకు ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సంబంధిత వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను పింఛను సొమ్ములపై ఆరా తీశారు. సరైన సమాధానం చెప్పలేకపోవడంతో కార్యదర్శి ఇన్‌చార్జి ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడంతో ఆయన శుక్రవారం మెమో జారీ చేశారు. దీంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ప్రతీ నెలా ఒకటవ తేదీ నుంచి ఐదో తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందని ఇన్‌చార్జి ఎంపీడీవో రామారావు చెప్పారు. ఫించన్ల పంపిణీ పూర్తయ్యాక 6వ తేదీ నాటికి మిగిలిన సొమ్మును డీఆర్‌డీఏకు జమచేయాల్సి ఉంటుందన్నారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నుంచి రూ.23వేలు  సొమ్ము డీఆర్‌డీఏకు జమచేయాల్సి ఉందని తెలియజేశారు. మిగిలిన సొమ్ములు తిరిగి జమచేయని కారణంగా, అదేవిధంగా గ్రామంలో పలువురి వద్ద వేలిముద్రలు తీసుకొని సొమ్ములు చెల్లించలేదనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌, డీడీ సోషల్‌వెల్ఫేర్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఇన్‌చార్జి ఎంపీడీవో తెలిపారు.
గతంలోను ఇంతే..!
వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పి.వీరబాబు గతంలో కూడా పింఛన్‌ సొమ్ములు తీసుకొస్తున్న సందర్భంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ ఢీకొని అపహరించుకొని పోయారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతైన విచారణ చేపట్టాక నిజంకాదని తేలడంతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నుంచి రూ.2లక్షలు రికవరీ చేయడం గమనార్హం.

Updated Date - 2022-09-10T06:19:39+05:30 IST