అనుమానాలెన్నో!

ABN , First Publish Date - 2022-08-31T06:34:53+05:30 IST

ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ గొడౌన్‌ సీజ్‌పై ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొదటిసారి ఈనెల 19న జరిగిన దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం జేసీ నేతృత్వంలో కలెక్టర్‌ హైపర్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

అనుమానాలెన్నో!

  • ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ గొడౌన్‌ సీజ్‌ చేశామంటున్న అధికారులు 
  • కాకినాడ పోర్టులో ఇప్పటికే సరుకు దిగుమతి 
  • ఆ సరుకు ఎక్కడికి వెళ్లినట్టు..?
  • గొడౌన్‌కు సరుకు అన్‌లోడ్‌ అయినట్లు అనుమానాలు


సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 30: ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ గొడౌన్‌ సీజ్‌పై ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొదటిసారి ఈనెల 19న జరిగిన దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం జేసీ నేతృత్వంలో కలెక్టర్‌ హైపర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విచారణలో సైతం అధికార యంత్రాంగం గోప్యత ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ హైపర్‌ కమిటీ నివేదిక వచ్చేలోపు మరోసారి సోమవారం ఈ పరిశ్రమలోని ప్రొడక్షన్‌ యూనిట్‌లో ఘోర ప్రమాదం జరిగి మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన పరిశీలించేందుకు విచ్చేసిన కలెక్టర్‌ ప్రమాదం జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకుని ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించారు. ప్యారీ షుగర్‌ పరిశ్రమ గొడౌన్‌లో మొదటిసారి జరిగిన ప్రమాదం కారణంగా గొడౌన్‌ని మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొడౌన్‌ని నిర్వాహకులు మూసివేయకుండా యథావిధిగా ముడిసరుకు అన్‌లోడ్‌ అయినట్లు కార్మికులు చెప్తున్నారు.


అంతా ఒట్టిదేనా..?

వాకలపూడిలో ప్యారీ షుగర్‌ పరిశ్రమ ఉంది. షుగర్‌ ముడి చక్కెరను విదేశాలనుంచి ఇక్కడకు షిప్పుల ద్వారా దిగుమతి చేసుకుంటారు. ఈ సరుకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. అక్కడినుంచి ప్యారీ షుగర్‌ పరిశ్రమలోని గొడౌన్‌కు తరలించి అన్‌లోడ్‌ చేస్తుంటారు. ఈనెల 19న ప్యాకింగ్‌ చేసిన షుగర్‌ బస్తాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా సరఫరా చేసే క్రమంలో విద్యుత్తు సరఫరా జరిగే ప్రాంతంలో విద్యుత్తు షాక్‌తో పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందగా మరో 9మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ కోసం జేసీ నేతృత్వంలో ఆయా శాఖల అధికారులతో హైపర్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత ఈ కమిటీ రెండు రోజులపాటు విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు నివేదించింది. ఈ కమిటీ నివేదిక వచ్చేలోగా ఈనెల 29న మళ్లీ రెండోసారి ప్రమాదం జరిగింది. ఇప్పుడు షుగర్‌ను గ్రేడింగ్‌ చేసే క్రమంలో అత్యధిక పీడనం రావడం, దీని తీవ్రతకు ఇనుప గెడ్డర్‌ రాడ్లు పక్కనే ఉన్న సీ పాన్‌పై నుంచి ఒకటో అంతస్తులో పనిచేస్తున్న పేరూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాగంప్రసాద్‌లపై పడడంతో వారు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్యారీ షుగర్‌ పరిశ్రమలో మొదటిసారి జరిగిన ప్రమాదం కారణంగా గొడౌన్‌ని సీజ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెండు వారాల కిందట ఇతర దేశాల నుంచి ముడిసరుకు కాకినాడ పోర్టులో అన్‌లోడింగ్‌ అయినట్లు తెలిసింది. గొడౌన్‌ని సీజ్‌ చేస్తే విదేశాలనుంచి వచ్చిన సరుకు ఎక్కడ అన్‌లోడ్‌ చేశారో అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ముడి సరుకు ఎక్కడబడితే అక్కడ నిల్వ చేసేందుకు ఆస్కారం లేదు. అత్యంత ఖరీదైన ముడి సరుకు వర్షానికి తడచినా తీవ్రనష్టం వాటిల్లుతుంది. శుద్ధి చేసిన ఘగర్‌ని విదేశాలకు ఎగుమతి చేసే పరిశ్రమ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇక్కడే ఉంది. అందువల్ల షిప్పుల్లో దిగుమతి అయిన ముడిసరుకు ఏ గొడౌన్‌కు తరలివెళ్లిందో, ఎక్కడ దాచారో అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాకినాడ పోర్టులో దిగుమతి అయిన ముడి సరుకు నేరుగా ప్యారీ షుగర్‌ పరిశ్రమలోని గొడౌన్‌కే చేరిందన్నది యధార్థమని, అధికారులు చెబుతున్నది అంతా ఒట్టిదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  



మృతుల కుటుంబాలకు రూ.60లక్షల చొప్పున పరిహారం: కలెక్టర్‌

కాకినాడ సిటీ, ఆగస్టు 30: వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యారీ షుగర్‌ రిఫైనరీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.60లక్షల పరిహారం అందిస్తున్నా మని కలెక్టర్‌ కృతికాశుక్లా తెలిపారు. సంస్థ యాజమాన్యంతో కాకినాడ ఆర్డీవో, డీఎస్పీ, ఫ్యాక్టరీస్‌ ఇన్‌స్పెక్టర్‌, కార్మిక సంఘాల నాయకులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరిపిన చర్చల్లో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.40లక్షల పరిహారం, ఉద్యోగుల కాంట్రీబ్యూషన్‌ ద్వారా మరో రూ.5లక్షల సొమ్మును చెల్లించేందుకు సదరు సంస్థ అంగీకరించిం దన్నారు. వర్క్స్‌మెన్‌ కాంపెన్సేషన్‌ చట్టం కింద రూ.10 లక్షలు, వైఎస్సార్‌ బీమా పథకం కింద రూ.5లక్షలు కలిపి మొత్తం రూ.60 లక్షల పరిహారం అందజేస్తామన్నారు. నిబంధనల మేరకు మృతుల కుటుంబాల్లోని ఒకరికి కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు సంస్థ అంగీకరించిందన్నారు. ఈ సంస్థలో ప్రమాణిక రక్షణ చర్యలు పాటించకుండా ఆపరేషన్స్‌ కొన సాగించడంవల్ల కార్మికుల భద్రతకు ముప్పు ఉన్నందున ఫ్యాక్టరీస్‌ చట్టం-1948, ఏపీ ఫ్యాక్టరీస్‌ రూల్స్‌-1950లోని సెక్షన్‌ 40(2) ప్రకారం థర్డ్‌ పార్టీ పరిశీలన ద్వారా సంస్థలోని భద్రతా వ్యవస్థ అమలును ధృవీకరించి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆపరేషన్స్‌ అన్నింటినీ నిలిపివే స్తూ ఫ్యాక్టరీస్‌శాఖ ద్వారా ప్రొహిబిటరీ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

Updated Date - 2022-08-31T06:34:53+05:30 IST