ఊరు..బేజారు

ABN , First Publish Date - 2022-04-10T06:40:34+05:30 IST

ఊరు.. బేజారెత్తుతోంది. తమ గ్రామం సొమ్ములు ఎక్కడ ప్రభుత్వం తన్నుకుపోతుందోనన్న భయంతో వణికిపోతోంది. తల ఒక్కింటికి లెక్కపెట్టి.. కేంద్రం పంపించే నిధులు తమ పంచాయతీ ఖాతాలోకి వచ్చినా.. అవి ఉంటాయో, మాయమవుతాయోనన్న బెంగ నిత్యం పట్టిపీడిస్తోంది. నిజానికి పంచాయతీలు పల్లె ప్రగతికి పట్టుగొమ్మలు.. ఇవి ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కానీ దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలపై పగబట్టింది. అన్ని రకాలుగా బలోపేతం చేయాల్సిందిపోయి నిలువునా వెన్నువిరిచేస్తోంది.

ఊరు..బేజారు

  రాష్ట్ర ప్రభుత్వ అడ్డగోలు విధానాలతో జిల్లాల్లో పంచాయతీలు నిర్వీర్యం
 ఆర్థికంగా బలోపేతం చేయాల్సిందిపోయి మూడేళ్లుగా వెన్నుపోటు
 పంచాయతీ పాలన దెబ్బతీసేలా పోటీగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు
  సచివాలయాల నిర్వహణ ఖర్చులు, కరెంటు బిల్లులు అన్నీ పంచాయతీ ఖాతాల నుంచే

(కాకినాడ,ఆంధ్రజ్యోతి):  ఊరు.. బేజారెత్తుతోంది. తమ గ్రామం సొమ్ములు ఎక్కడ ప్రభుత్వం తన్నుకుపోతుందోనన్న భయంతో వణికిపోతోంది. తల ఒక్కింటికి లెక్కపెట్టి.. కేంద్రం పంపించే నిధులు తమ పంచాయతీ ఖాతాలోకి వచ్చినా.. అవి ఉంటాయో, మాయమవుతాయోనన్న బెంగ నిత్యం పట్టిపీడిస్తోంది.  నిజానికి పంచాయతీలు పల్లె ప్రగతికి పట్టుగొమ్మలు.. ఇవి ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కానీ దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలపై పగబట్టింది. అన్ని రకాలుగా బలోపేతం చేయాల్సిందిపోయి నిలువునా వెన్నువిరిచేస్తోంది. పోటీగా సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు.. వాటి నిర్వహణ ఖర్చుల భారం మొదలుకుని వీటికి వచ్చే కోట్ల ఆర్థిక సంఘం నిధులను అడ్డంగా కాజేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వీటి ఖాతాలను గుల్ల చేసేస్తోంది. చివరకు అసలు పంచాయతీ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఖాళీ అవుతాయో తెలియని దుస్థితి. దీంతో పంచాయతీలు తీర్మానించిన పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు భయపడిపోతున్నారు. ఖాతాలో డబ్బులున్నాయనే భ్రమతో పనులు      చేస్తే చివరకు బిల్లులు కూడా రావేమోననే భయం నెలకొంది. దీంతో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అనేక పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇలా నిధుల మళ్లింపు, బకాయిలకు జమ చేయడంపై జిల్లాల్లోని అన్ని  గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పంచాయతీలపై పగబట్టింది. వాటిని అన్ని రకాలుగా నిర్వీర్యం చేస్తూ వెన్ను విరుస్తోంది. ఒకప్పుడు గ్రామాల్లో ఏ పని చేయాలన్నా..ప్రజల అవసరాలు తీర్చాలన్నా పంచాయతీలదే కీలక పాత్ర. కానీ దీనికి విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం పంచాయతీలకు పొగపెడుతోంది. ప్రభుత్వం వచ్చీ రాగానే పోటీగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో అప్పటి నుంచీ పంచాయతీలకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. పంచాయతీలు చేయాల్సిన పనులు సచివాలయ వ్యవస్థ చేతిలోకి రావడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీల్లో జరిగే పనులను పర్యవేక్షించడానికి సచివాలయాల్లో ఇంజనీర్‌ను నియమించి ఎంబుక్‌లు నిర్వహించే బాధ్యత అప్పగించినా అదేదీ జరగడం లేదు. అలాగే గ్రామ సచివాలయాలను పంచాయతీల్లోనే ఏర్పాటు చేయడంతో ఈ నిర్వహణ భారం అంతా వాటిపైనే పడింది.
మొదట్లో సచివాలయ సిబ్బందికి ఫర్నిచర్‌ను లక్షలు వెచ్చించి పంచాయతీ ఖాతాల నుంచే కొన్నారు. ఇప్పటికీ వీటి నిర్వహణ ఖర్చు, కంప్యూటర్ల మరమ్మతుల భారం పంచాయతీలపైనే పడింది. ఇంతకు ముందు వందల్లో వచ్చే కరెంటు బిల్లులు సచివాలయాల రాకతో పంచాయతీలకు వేలల్లో బిల్లులు వస్తున్నాయి. దీంతో వచ్చే రాబడి కంటే ఖర్చే అధికంగా ఉంటోంది. మరో పక్క కరెంటు బిల్లులు పంచాయతీలకు వేలల్లో వస్తుంటే డబ్బులు లేక కట్టే పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీలకు వచ్చిన డబ్బులను నేరుగా దారి మళ్లించి విద్యుత్‌ బిల్లులు బాకీలు చెల్లించింది. దీంతో ఇప్పుడు పంచాయతీల్లో వీధి దీపాల మరమ్మతులు, రహదారుల మరమ్మతులు, దోమల నివారణ, డ్రైన్ల నిర్వహణ, మంచినీటి సరఫరా ఏ పనిచేయాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి.   రాష్ట్ర ప్రభుత్వం తీరుతో కాకినాడ,తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని 1,029 పంచాయతీలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఇదంతా ఒకెత్తయితే ఇటీవల మూడు జిల్లాల్లోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.282కోట్లు ఖాతాల్లో పడ్డాయి. దీంతో ఇంతకు మునుపు తీర్మానం చేసిన విధంగా పంచాయతీలు రకరకాల పనులు స్థానికంగా కాంట్రాక్టర్లకు అప్పగించాయి. తీరా కొన్నిరోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా రూ.282 కోట్లను వెనక్కు లాగేసుకుంది. ఇందులో ఒక్క కాకినాడ జిల్లా నుంచే రూ.101 కోట్లు లాగేసింది. దీంతో పంచాయతీ ఖాతాల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలంలోని పంచాయతీల ఖాతాల నుంచి రూ.3.81 కోట్లు, గొల్లప్రోలు మండలం రూ.3.68 కోట్లు, జగ్గంపేట 5.36 కోట్లు, కాకినాడ రూ.10.57 కోట్లు, కరప రూ.5.07 కోట్లు, కిర్లంపూడి రూ.4.96 కోట్లు, కోటనందూరు రూ.3.28కోట్లు, రౌతులపూడి రూ.3.84 కోట్లు, సామర్లకోట రూ.5.41 కోట్లు, శంఖవరం రూ.3.88 కోట్లు, తాళ్లరేవు రూ.6.06 కోట్లు, తొండంగి రూ.5.91 కోట్లు, తుని రూ.5.84 కోట్లు, కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలంలోని పంచాయతీల ఖాతాల నుంచి రూ.4.58 కోట్లు, అంబాజీపేట మండలం 4.14 కోట్లు, అమలాపురం రూ.5.81 కోట్లు, ఆత్రేయపురం 4.34 కోట్లు, ఐ.పోలవరం రూ.4.58 కోట్లు, మలికిపురం రూ.5.06 కోట్లు, మామిడికుదురు రూ.4.66 కోట్లు, మండపేట రూ.5.21 కోట్లు, ముమ్మిడివరం రూ.2.90 కోట్లు, ఉప్పలగుప్తం రూ.4.05 కోట్లు, రాజోలు రూ.4.71కోట్లు, సఖినేటిపల్లి రూ.4.88 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి మండలం పంచాయతీల నుంచి 4.65 కోట్లు, బిక్కవోలు 4.66 కోట్లు, గోకవరం రూ.4.83 కోట్లు, కడియం రూ.4.75 కోట్లు, రాజమహేంద్రవరం రూ.10.81 కోట్లు, రాజానగరం రూ.7.32 కోట్లు చొప్పున ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా పంచాయతీ నిధులు లాగేసుకుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఆందోళన చేయడంతో రెండు రోజుల కిందట గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ఆ డబ్బులను ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఇక్కడా మోసమే. పేరుకు పంచాయతీ ఖాతాల్లో డబ్బులు కనిపిస్తున్నా ఒక్క బిల్లు కూడా ప్రాసెస్‌ అవకుండా ప్రభుత్వం ఫ్రీజింగ్‌ విధించింది. దీంతో డబ్బులు ఖాతాలో ఉన్నా ఒక్క రూపాయి కూడా తీసే పరిస్థితి పంచాయతీలకు  లేకుండా పోయింది.
 

Read more