చివరికిలా!

ABN , First Publish Date - 2022-11-12T00:35:36+05:30 IST

అయ్యోపాపం అన్నదాత.. ఆరంభం నుంచి కష్టాలే.. నాట్లు వేసిన నాటి నుంచి ఏ ప్రకృతి విపత్తు వచ్చిపడుతుందోనని ఆందోళన..

చివరికిలా!
కడియంలో ఆరబెట్టిన ధాన్యం

1.84 లక్షల ఎకరాల్లో సాగు

239 కేంద్రాల ఏర్పాటు

60 శాతం చేతికొచ్చిన పంట

ఆరంభంకాని కొనుగోళ్లు

ఆన్‌లైన్‌ కాకపోవడమే కారణం

ఆర్‌బీకేల చుట్టూ ప్రదక్షిణలు

మిల్లులకు ధాన్యం తరలింపు

రైతులకు కాటా స్లిప్‌లతో సరి

అయ్యోపాపం అన్నదాత.. ఆరంభం నుంచి కష్టాలే.. నాట్లు వేసిన నాటి నుంచి ఏ ప్రకృతి విపత్తు వచ్చిపడుతుందోనని ఆందోళన.. అంతా పూర్తయి చివరికి పంట చేతికి వచ్చిందంటే ఎలా అమ్ముకోవాలోనని ఆందోళన.. గత మూడున్నరేళ్లగా వ్యవసాయంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మార్పుతో అన్నదాతలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోతున్నారు.

కడియం, నవంబరు 11 : ఆరుగాలం కష్టప డినా అన్నదాతకు కష్టాలు..మిగిలేది నష్టాలే.. పంట పండించే వరకూ పంట ఎలా ఉంటుం దోనని ఆందోళన..పండిన తరువాత ఎలా విక్రయిం చుకోవాలోనని ఆందోళన..అమ్మేస్తే డబ్బులు ఎప్పు డు వస్తాయోనని ఆందోళన..ఇలా ఆరంభం నుంచి పూర్తయ్యే వరకూ అంతా ఆందోళనే.. గతంలో పంట పండిన వెంటనే దళారులు వచ్చే వారు.. అయిన కాడికి కొనుగోలు చేసుకుని వెళ్లిపో యే వారు..మూడు నాలుగు రోజుల్లో డబ్బులు ఇచ్చేసే వారు..ప్రస్తుతం అమ్మడం వరకే రైతు పని ఆ తరువాత డబ్బులు ఎప్పుడు పడతాయనేది అంతా దైవాదీనం..21 రోజులు గ్రేస్‌ పిరియడ్‌.. ఆ తరు వాత నెల పట్టవచ్చు..రెండు నెలలు పట్టవచ్చు.. డబ్బులు వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే. ప్రస్తు తం అయితే గ్రామాల్లో పంటను కొనే నాథులే కానరావడంలేదు. ప్రభుత్వ నిబంధనల కారణంగా రైతులంతా ఆర్‌బీకేల చుట్టూ ప్రద క్షిణలు చేస్తు న్నారు.మా ధాన్యం తీసు కెళ్లండి..మా ధాన్యం తీసుకెళ్లండంటూ అర్రులు చాస్తున్నారు. ఆర్‌బీకే సిబ్బంది మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవ డంతో అంతంతమాత్రంగానే మిల్లులకు తరలిస్తు న్నారు.దీంతో అన్నదాత ఇంతా పండించిన ధాన్యం ఏమైపోతుందోనని రాత్రి పగలూ కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాడు.

1.84 ఎకరాల్లో సాగు..

జిల్లాలో తొలకరి పంట 1,84,015 ఎకరాల్లో (73, 706 హెక్టార్లు)లో 1,41,000 మంది రైతులు వరిసాగుచేశారు.ఇప్పటి వరకు 12 వేల హెక్టార్లలో పంట కోత ప్రారంభమైంది.కడియం మండలంలో మొత్తం 2,086 హెక్టార్లలో రైతులు స్వర్ణ రకం వరి పంటను సాగు చేశారు.ప్రస్తుతం 20 నుంచి 30 శాతం పంట కోత దశలో ఉండగా మిగిలిన 80 శాతం పంట మరో వారం,రెండు వారాల్లో పూర్తవు తుందని రైతులు చెబుతున్నారు.అయితే ప్రస్తుతం కొనుగోళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ఆరంభం కాకపో వడంతో కోసిన ధాన్యం ఆరబెట్టడానికి జాగా లేక ఇబ్బందులు పడుతున్నారు.వరి పంట కోత కోసి ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లిపోతుంటే మిగిలిన వారికి పంట కోసి ధాన్యం ఆరబెట్టుకునేందుకు జాగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పంట కొనుగోళ్లు లేక ఎక్కడికక్కడ కోతలు నిలిచిపోయాయి.

ప్రారంభంకాని కొనుగోళ్లు

జిల్లాలో 367 రైతు భరోసా కేంద్రాలు ఉండగా 239 ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.నిన్న మొన్నటి వరకూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే లేదు.రైతుల ఆందోళనల నేపథ్యంలో గత రెండు రోజుల్లో ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు.అయితే ఇంక నూ ఆన్‌లైన్‌లో నమోదు కావడంలేదు..ఆర్‌బీకే సిబ్బంది ధాన్యం పరిశీలించి డైరెక్టుగా మిల్లులకు తరలించి కాటా స్లిప్‌ మాత్రమే ఇస్తున్నారు.ఆన్‌ లైన్‌లో నమోదు కాకపోవడంతో ఈ సారి సొమ్ము లు జాప్యం తప్పదని వాపోతున్నారు.

మిగిలేది నష్టమే..

ఒక ఎకరా పంట పొలం దమ్ము చేసిన నాటి నుంచి నాట్లు వేయడం, పురుగు మందులు, ఎరు వులు ఖర్చు సుమారు రూ.15 వేల వరకు అవు తుంది. పంట కోత కు రూ.5 వేలు, కట్టేతకు రూ. 2,800, కుప్ప నూర్పుకు రూ. 2,800, బరకాలకు రూ.225, కుప్ప తొక్కడానికి ట్రాక్టరుకు రూ.1,500 ఈ విధంగా ఎకరా ఒక్కంటికి ఖర్చు సుమారు రూ.12,325 పైమాటే ఖర్చవుతుంది.అంటే ఎకరా పండించాలంటే ఎటువంటి విపత్తులు లేకుండా సాఫీగా సాగితే సుమారు రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది.ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తే కామన్‌ రకానికి రూ.45 వేల వరకూ ఆదాయం వస్తుంది.కౌలు రైతు అయితే ఇందులో 15 బస్తాలు తీసివేస్తే మిగిలేది నష్టమే.పంట దిగుబడికి, ఖర్చు లకు లెక్కవేస్తే తమకు మిగిలేది ఏమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతా కష్టపడితే.. కొనుగోలుకు కష్టపెట్టడం తగదంటున్నారు.

పంట పండింది.. కోత కోయలేదు..

తొలకరి పంట స్వర్ణరకం ఆరు ఎకరాలు వరి పండించా. ఽధాన్యం పంటను కూలీలతో కోయించి ఒడ్డుకు తీసుకురావాలంటే చాలా ఖర్చవుతుంది. ప్రస్తుతం నా పంట పండింది. అయితే కోతలు కోద్దామంటే ఇంకా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ఆరంభం కాలేదు.. పంటను కోసిన తరువాత ఎక్కడ పెట్టాలి. అందుకే కోత కోయకుండా నిలుపుదల చేశా.

- కోసూరి వెంకటరమణ, కడియం

ఖర్చులన్నీ లెక్కవేస్తే.. మిగిలేది తక్కువే..

ఆరుగాలం కష్టపడ్డా.. ప్రస్తుతం పంట చేతికి వచ్చింది. కోద్దామంటే అవకాశం లేకుండాపోయింది. దమ్ము చేసి.. నాట్లు వేసి.. కోత కోసే వరకూ చాలా ఖర్చులు అవుతున్నాయి. ఈ ఏడాది ఎకరాకు 25 బస్తాల వరకూ మాత్రమే దిగుబడి వచ్చింది. ఖర్చులన్ని లెక్కవేస్తే మిగిలేది తక్కువే. - కుప్పాల శ్రీను, కడియం

ధాన్యం తప్పనిసరిగా కొంటాం..

అధికారుల ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేం ద్రాలు ప్రారంభిస్తున్నాం.ఈ సారి ఆలస్యమైన మాట వాస్తవమే.నూతన విధానం ప్రవేశపెట్టడంతో కాస్త ఆలస్య మైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100 కేజీల ధాన్యం రూ. 2,040 (కామన్‌రకం) రూ. 2,060 (ఏగ్రేడు) 75 కేజీల ధాన్యానికి రూ. 1,530 (కామన్‌రకం) రూ. 1,545 (ఏగ్రేడు) ధర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రైతు నుంచి ధాన్యం తప్పనిసరిగా కొనుగోలు చేస్తాం.

- డా కె.ద్వారకాదేవి, ఏవో, కడియం

Updated Date - 2022-11-12T00:35:36+05:30 IST

Read more