అధికారులు సమాచారమివ్వడం లేదు

ABN , First Publish Date - 2022-09-19T06:11:32+05:30 IST

అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందడం లేదని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ కాకర్ల నారాయుడు అధ్యక్షతన నిర్వహించారు.

అధికారులు సమాచారమివ్వడం లేదు

 కొవ్వూరు, సెప్టెంబరు 18: అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందడం లేదని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ కాకర్ల నారాయుడు అధ్యక్షతన నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పామెర్ల నగేష్‌ మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులపట్ల వైద్యులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహారిస్తున్నారన్నారు. ప్రసవం కోసం గర్భిణిని ఆసుపత్రికి తీసుకువెళ్తే సిబ్బంది తీరు బాధాకరమన్నారు. గర్భిణులను సైతం రాజమహేంద్రవరం రిఫర్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరికిరేవుల సర్పంచ్‌ మట్టా శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధికారుల నుంచి ఏ సమాచారం అందడం లేదన్నారు. రెండేళ్ల క్రితం చేపట్టిన సచివాలయం, ఆర్‌బీకే, విలేజ్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. ఎంపీపీ కాకర్ల నారాయుడు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు బిల్లులు మంజూరు కావడం లేదని, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని, గ్రామాల్లో పనులు చేపట్టడానికి ఆసక్తి కనబర్చే ప్రజాప్రతినిధులు తమ గ్రామ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేయాలన్నారు. స్వచ్ఛ కార్పొరేషన్‌ ద్వారా మండలానికి 42 రిక్షాలు, 252 టబ్‌లు మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చాయని, వాటిని గ్రామాల వారీగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి, వైస్‌ ఎంపీపీ వీరమల్ల నారాయుడు, తశీల్దార్‌ బి.నాగరాజు నాయక్‌, ఎంపీడీవో ప్రసన్నకుమార్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-19T06:11:32+05:30 IST