అనంత రాజభోగం

ABN , First Publish Date - 2022-08-17T06:02:17+05:30 IST

డ్రైవర్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబుకు రాజ మహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో సకల మర్యాదలు జరుగుతున్నట్టు సమాచారం.

అనంత రాజభోగం

ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌కు జైలులో సకల సౌకర్యాలు
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి): డ్రైవర్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న  వైసీపీ ఎమ్మెల్సీ  అనంత ఉదయబాబుకు రాజ మహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌లో సకల  మర్యాదలు జరుగుతున్నట్టు సమాచారం.  కేవలం సాధారణ ఖైదీల మాదిరిగానే జైలు భోజనం పెడుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సాధారణ ఖైదీలతో సెల్‌లో ఉండాల్సిన ఎమ్మెల్సీకి జైలులోని ఆస్పత్రిలో ప్రత్యేక బెడ్‌ ఏర్పాటు చేశారు. సాధారణంగా అనార్యోగంతో ఎవరైనా అడ్మిట్‌ అయితే, కొద్దిరోజుల తర్వాత  మామూలుగా సెల్‌లో వేస్తారు. కానీ  ఎమ్మెల్సీకి మాత్రం రోజూ అదే బెడ్‌ను ఇస్తున్నట్లు తెలిసింది. అంతేకాక ఆయన ప్రతి రోజూ ఉదయం సుమారు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ  సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రూమ్‌ వెనుక ఉన్న విశ్రాంతి రూమ్‌లోనే ఉంటున్నట్టు సమాచారం. భోజనం  కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. అందరితో కాకుండా ప్రత్యేకంగా పెడుతున్నట్టు సమాచారం. పైగా ఆయన బంధువులు, పరిచయస్తులు వచ్చినా సాధారణ ఖైదీని ఎలా మాట్లాడిస్తారో అలానే మాట్లాడించాలి. కానీ ఏకంగా లోపలికి తీసుకుని వెళ్లి మాట్లాడిస్తున్నారు. అంతేకాక సూపరింటెండెంట్‌ రూమ్‌లో కూడా కూర్చో పెడుతున్నట్టు సమాచారం.  పైగా వారంలో ఎక్కువ మందిని ఆయన కలిసేటట్టు కూడా చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేతో పాటు,  ఎమ్మెల్సీ బంధువులు తరచూ వస్తుండడం గమనార్హం.  సెంట్రల్‌ జైలు గేటు లోపల అమర్చిన సీసీ కెమెరాలు పరిశీలిస్తే  ఎవరు ఎన్నిసార్లు వచ్చారో కూడా అర్థమవుతుందని కొందరు చెబుతున్నారు. ఇప్పటికే బాధితుల తరపున వాదిస్తున్న ప్రముఖ న్యాయవ్యాది ఏపీసీఎల్‌ఎ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు   త్వరలో ఆధారాలతో వీటిని  రుజువు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more