తల్లీకూతుళ్ల దహనం కేసు ఛేదన

ABN , First Publish Date - 2022-07-07T06:49:46+05:30 IST

కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో సంచలనం రేపిన తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు.

తల్లీకూతుళ్ల దహనం కేసు ఛేదన

   ప్రియుడిని భార్య నుంచి వేరు చేయాలని ఓ మహిళ పన్నాగం
  కూతుళ్లను ప్రేరేపించి పెట్రోల్‌తో ఇంటిపై  దాడి చేయించిన వైనం

అల్లవరం, జూలై 6: కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో సంచలనం రేపిన తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు. చనిపోయిన యువతి  భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ  ఈ ఘాతుకానికి పథక రచన చేసినట్లు పోలీసులు చెప్పారు.  డీఎస్పీ వై.మాధవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కొమరగిరిపట్నం ఆకుల వారి వీధికి చెందిన తల్లీకూతుళ్లు సాధనాల మంగాదేవి (42), గర్భిణి మేడిశెట్టి జ్యోతి (22) ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున అగ్నికీలల్లో సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చనిపోయిన జ్యోతి భర్త సురేష్‌(ఆటో డ్రైవర్‌)కు ఇదే గ్రామానికి చెందిన సుంకర నాగలక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. సురేష్‌ జ్యోతిని పెళ్లి చేసుకోవడం, ఆమెతో ఉండడం నాగలక్ష్మికి కంటగింపుగా ఉండేది. దీంతో వాళ్లిద్దరిని ఎలాగైనా విడదీయాలని ఎవరో జ్యోతికి రాసినట్లు ప్రేమలేఖలు రాసి సురేష్‌ నడిపే ఆటోలో వేసేది. అయితే ఈ ప్రయత్నం ఫలించపోవడంతో జ్యోతిని హతమార్చితేనే సురేష్‌ తనవాడు అవుతాడని నాగలక్ష్మి ఆలోచించింది. దీంతో తన కుమార్తెలు దివిహరిత, సౌజన్య (వీరిద్దరికి నాగలక్ష్మి సవతితల్లి)ను హత్యలకు ప్రేరేపించింది. 2వ తేదీ రాత్రి సౌజన్య కేసును పక్కదారి పట్టించేందుకు మగవాడిలా ప్యాంటు, షర్టు ధరించి టోపీ పెట్టుకుని, చేతికి గ్లౌజులు వేసుకుని హోండా యాక్టివా మోటారు సైకిల్‌పై అక్క హరితతో కలిసి జ్యోతి ఇంటికి వెళ్లింది. జ్యోతి, మంగాదేవి పడుకున్న పాకలో పెట్రోల్‌ చల్లి అంటించారు. పక్క గదిలో ఉన్న తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. మంగాదేవి, జ్యోతి సజీవ దహనానికి కారణమైన నాగలక్ష్మి, సౌజన్య, హరిత వీఆర్వో ద్వారా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిని అరెస్టు చేసి అమలాపురం ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. సురేష్‌కు ఈ కేసుతో సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. డీఎస్పీ వై.మాధవరెడ్డి ఆధ్వర్యంలో రూరల్‌ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్‌ఐ బి.ప్రభాకరరావు కేసును సకాలంలో ఛేదించారు. ఈ కేసు దర్యాప్తులో సహకరించిన అల్లవరం పోలీసు సిబ్బంది ముద్రగడ ధర్మరాజు, అరిగెల సుఽభాకర్‌, క్రైమ్‌ పార్టీ ఏఎస్‌ఐ అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్‌ కానిస్టేబుల్‌ బి.రామచంద్రరావు, కానిస్టేబుల్‌ జి.కృష్ణసాయి, డి.అర్జున్‌లను డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-07-07T06:49:46+05:30 IST