-
-
Home » Andhra Pradesh » East Godavari » mlc thota on dhulo talk protext-NGTS-AndhraPradesh
-
ఎమ్మెల్సీ తోటపై ‘దూళి’ వ్యాఖ్యలతో దుమారం
ABN , First Publish Date - 2022-02-23T06:27:24+05:30 IST
మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి (రాజమహేంద్ర వరం) జిల్లాలో కలప డానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు జేఏసీ సభ్యులు మంగళవారం మునిసిపల్ కార్యాలయంలోని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చాంబర్‌లో సమావేశమయ్యారు.

మండపేట, ఫిబ్రవరి 22: మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి (రాజమహేంద్ర వరం) జిల్లాలో కలప డానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు జేఏసీ సభ్యులు మంగళవారం మునిసిపల్ కార్యాలయంలోని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చాంబర్‌లో సమావేశమయ్యారు. మండపేట తప్ప మండపేట రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో చేపట్టే రిలే దీక్షల్లో పాల్గొనవద్దంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిలువరిస్తూ రెండు నాల్కల ధోరణి అవలం బిస్తున్నారని జేఏసీ సభ్యుడు దూళి జయరాజు చేసిన వ్యాఖ్యలు దూమారం లేపాయి. దీనికి వైసీపీ నేత, జేఏసీ సభ్యుడు కర్రి పాపారాయుడు స్పందిస్తూ జయరాజు తమ నేతపైనా, పార్టీపైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆరోపణలను సహించేది లేదంటూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. వీరిద్దరి మధ్య వాగ్వివాదంతో జేఏసీ సభ్యులు అవాక్కయ్యారు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు తక్కువగా వున్న నేపథ్యంలో విభేదాలు విడనాడి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని పలువురు సూచించారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు పార్టీలకతీతంగా అంతా మండపేటను రాజమహేంద్రవరంలో కలపాలనే ఒకే ఒక్క డిమాండుతో ముందుకు సాగాలని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి, పరిస్థితిని వివరించి న్యాయం జరిగేలా కోరాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో కలెక్టర్, ప్రజాప్రతినిధులను జేఏసీ, ఎమ్మెల్సీ సారధ్యంలో కలవాలని నిర్ణయించారు.