ఒక్క చాన్స్‌

ABN , First Publish Date - 2022-04-10T06:56:51+05:30 IST

మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ సోమవారమే కావడంతో జిల్లాలో ఆశావహ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ నెలకొంది. క్యాబినేట్‌లో తమకు బెర్త్‌ దొరుకుతుందో లేదోననే బెంగ వీరిని వేధిస్తోంది. అమాత్యగిరీ ఇప్పుడు దక్కించుకోకపోతే తర్వాత ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవరపాటు గురిచేస్తోంది.

ఒక్క చాన్స్‌

  • మంత్రి పదవి బెర్త్‌పై ఆశావహ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ టెన్షన్‌
  • నిన్నటివరకు తమకే ఖాయమని ప్రచారం
  • చివర్లో ఎక్కడ చేజారిపోతుందేమోనని గుబులు
  • నాలుగురోజులనుంచి అమరావతిలోనే మకాం వేసిన దాడిశెట్టిరాజా, దొరబాబు
  • సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతల చుట్టూ ప్రదక్షిణలు
  • ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ అక్కడే ఉండి రాయబారాలు
  • కన్నబాబుకు మళ్లీ ఛాన్స్‌ ఇస్తారంటూ కొత్త ప్రచారం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ సోమవారమే కావడంతో జిల్లాలో ఆశావహ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ నెలకొంది. క్యాబినేట్‌లో తమకు బెర్త్‌ దొరుకుతుందో లేదోననే బెంగ వీరిని వేధిస్తోంది. అమాత్యగిరీ ఇప్పుడు దక్కించుకోకపోతే తర్వాత ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవరపాటు గురిచేస్తోంది. దీంతో అమరావతిలో మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమకు బెర్త్‌ ఖాయమని ఇంతవరకు ధీమాగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఆఖరి నిమిషంలో పేరు తారుమారైపోతుందేమోననే ఆందోళనతో అక్కడే మకాం వేసి పావులు కదుపుతున్నారు. గాడ్‌ఫాదర్‌ల చుట్టూ తిరుగుతూ ఒక్క చాన్స్‌ అంటూ ఒత్తిడి తెస్తున్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు నాలుగురోజులుగా అమరావతిలోనే పాగా వేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మూడురోజులనుంచీ అక్కడే ఉన్నారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రి కన్నబాబుకు మరో దఫా ఛాన్స్‌ వస్తుందనే తాజా ప్రచారంతో తమకు ఎక్కడ ఛాన్స్‌ పోతుందోననే వీరు తమ లాబీయింగ్‌ పట్టు పెంచారు.

ఛాన్స్‌ వస్తుందా..

సీఎం జగన్‌ తన కొత్త క్యాబినెట్‌కు సోమవారం ముహూర్తంగా నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో తమ జాతకం ఏంటో తేల్చుకోవడానికి జిల్లా ఎమ్మెల్యేలు ముగ్గురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధినేత ఆదేశాలతో ఇటీవల మంత్రి కన్నబాబు పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వీరిద్దరూ బెర్త్‌ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. తమకు పదవి ఖాయం అంటే తమకు ఖాయమని చాలారోజులుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి క్యాడర్‌ సైతం తమ నేతకు అమాత్యగిరీ ఖాయమైపోయినట్లేనని ప్రచారం కూడా తారాస్థాయికి తీసుకువెళ్లారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొత్త మంత్రులు ఎవరనే చర్చ వచ్చినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజాకు శుభాకాంక్షలు చెప్పారు. అటు అధిష్ఠాన పెద్దలనుంచి డిప్యూటీ సీఎం ఛాన్స్‌ అని సంకేతాలు వచ్చినట్లు సదరు నేత అనుచరులు చెబుతున్నారు. అందులోభాగంగా రాజా పుట్టినరోజు వేడుకలను ఇటీవల భారీగా చేశారు. ఎమ్మెల్యే దొరబాబు బెంగళూరు నుంచి కథ నడుపుతున్నారు. కొత్త క్యాబినేట్‌ ప్రకటించడానికి ఇంకా ఒక్కరోజే సమయం ఉం డడంతో బెర్త్‌ ఖాయమైందా? లేదా? పోటీ తీవ్రత నేపథ్యంలో ఒక వేళ చివరి నిమిషంలో అవకాశం చేజారిపోయే ప్రమాదం ఉందన్న భయంతో సద రు నేతలు ఇప్పుడు అమ రావతిలో మకాం వేశారు. ఎక్కడికక్కడ పార్టీ పెద్దలు, గాడ్‌ఫాదర్‌లపై ఒత్తిడి తెస్తూ ఒక్క ఛాన్స్‌.. ప్లీజ్‌ అంటూ పావులు కదుపుతున్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నాలుగురోజులనుంచీ అమరావతిలోనే పాగా వేశారు. పార్టీలో నెంబర్‌-2 అయిన సజ్జలను కలిసి పదవి ఖరారయ్యేలా జాగ్రత్త ప డుతున్నారు. జిల్లా కీలక సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ద్వారా అక్కడే ఉండి ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. పెండెం దొరబాబు కూడా నాలుగురోజులనుంచీ అమరావతి నుంచి కదల్లేదు. అక్కడే ఉండి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తనకు తెలిసిన సీనియర్‌ నేతలు, జగన్‌ సన్నిహితులతో రాయబారాలు నడుపుతున్నారు. జగన్‌ తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని అధిష్ఠానానికి గుర్తుచేస్తూ ఇన్నేళ్ల సీనియర్‌ ఎమ్మె ల్యే అయిన తాను ఏనాడూ ఏ పదవీ కోరలేదని, ఇప్పుడు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జిల్లాలో ఇతర ఆశావహులకు విప్‌ పదవి ఉండగా తనకు ఏ పదవీ లేదని, ఈ నేపథ్యంలో బెర్త్‌ ఖాయం చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

సీఎం ఆదేశాలతో మంత్రి కన్నబాబు ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. పదవి పోవడంతో అలిగి అసంతృప్తి చెందారనే ప్రచారం శుక్రవారం నుంచి జోరందుకుంది. ఆయనతోపాటు అదే సామాజికవర్గానికి చెందిన పలువురు అమాత్యులనుంచీ అసమ్మతి బుస కొట్టే ప్రమాదం ఉండడంతో రాజీనామా చేసిన మంత్రుల్లో తిరిగి కొందరికి అధిష్ఠానం పదవి ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో కన్నబాబు పేరు కూడా వినిపిస్తోంది. దీంతో ఆశావహ ఎమ్మెల్యేలు ఇద్దరిలో టెన్షన్‌ పట్టుకుంది. పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమై రాజా, దొరబాబు అమరావతిలో మకాం వేసి ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. రాజాకు డిప్యూటీ సీఎం అని ప్రచారం జరగ్గా కన్నబాబు మళ్లీ వచ్చే అవకాశం ఉండడంతో పదవికి ఎసరు పడినట్లు క్యాడర్‌ చెవికి చేరడంతో నియోజకవర్గంలో ఓరకమైన స్థబ్తత నెలకొంది. పిఠాపురంలోను ఇదే పరిస్థితి. దీంతో మంత్రి పదవి సాధించుకునే రావాలనే పట్టుదలతో వీరిద్దరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే ద్వారంపూడి మూడురోజులుగా అమరావతిలోనే పాగా వేశారు. తనకు పదవి వద్దని బయటకు చెబుతున్నా అమాత్య కల నెరవేర్చుకునేందుకు ఇదే ఛాన్స్‌ అన్నట్టుగా ప్రయత్నిస్తున్నట్లు అనుచురు లు చెబుతున్నారు. మరికొందరైతే కాకినాడ, కోనసీమ జిల్లాల్లో తనకు తెలిసిన, కావాల్సిన వారికి మంత్రి పదవి చేజారిపోకుండా తన పలుకుబడి ఉపయోగించేందుకే అక్కడ మకాం వేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కొత్త మంత్రుల ఎంపికపై కసరత్తు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించడంతో రాజధానిలోనే ఉండి లక్ష్యం నెరవేర్చుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more