మందులోళ్లకు డబ్బు జబ్బు

ABN , First Publish Date - 2022-07-30T06:11:04+05:30 IST

జిల్లాలోని గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట కొంత మంది మెడికల్‌ షాపుల యజమానులు రోగులను అడ్డదారిన దోచేస్తు న్నారు.

మందులోళ్లకు డబ్బు జబ్బు

మెడికల్‌ వ్యాపారుల మాయాజాలం

రోగులపై ధరల బాదుడే బాదుడు

తట్టుకోలేకపోతున్న జనం

సాధారణ మందుల ముసుగులో జనరిక్‌

మోసపోతున్న కొనుగోలుదారులు

జిల్లా వ్యాప్తంగా వెయ్యికిపైనే షాపులు

విచ్చలవిడిగా సాగుతున్న వ్యాపారం

పట్టించుకోని ఔషధ  అధికారులు


జ్వరం వస్తే డోలో 650 వేసుకుంటే తగ్గిపోతుంది.. దీని ధర రూ.2లు.. అదే జ్వరం వచ్చిందని మెడికల్‌ షాపునకు వెళితే రూ.100కు తగ్గకుండా బాదేస్తారు.. జ్వరానికి వంద ఎందుకంటారా..మరి వచ్చిన కొనుగోలుదారుడిని రూ.2లతో వదిలేస్తారా..ఎంతో కొంత రాబట్టవద్దు.. అదీ ఇదీ అని రూ.100పైనే బిల్లు చేస్తారు. ఆ మందులు వేసుకుంటే తగ్గక చస్తుందా.. ఎందుకంటే అందులో ఒకటి డోలో 650 ఉండనే ఉంటుంది. మరి మిగిలిన మందులెందుకంటారా          అదే మెడికల్‌ షాపుల వ్యాపార రహస్యం..


 జలుబు చేస్తే మాన్‌టెక్‌ ఎల్‌సీ, సెట్రోజన్‌.. ఈ రెండు రకాల టాబ్లెట్‌లు రూ.20లు..రోజులో ఉదయం ఒకటి.. సాయం త్రం ఒకటి చొప్పున రెండు రోజులు వేసుకుంటే.. జలుబు మటుమాయం.. అంటే రెండు రోజులకు సుమారు రూ. 40లు ఖర్చు అవుతుంది. అదే మెడికల్‌ షాపునకు వెళ్లి చూడండి.. నాలుగు రకాలకు తగ్గకుండా మందులు ఇచ్చేస్తారు. బిల్లు చూస్తే               రూ. 100కి తగ్గదు. 


ఇలా ఏదైనా సరే మందుల షాపునకు వెళ్లామా ఇక అంతే.. ఆ దోపిడీకి అంతే ఉండదు.. పావలా టాబ్లెట్‌ను  ఏ మాత్రం బెరుకు.. భయం లేకుండా రూ.10లకు అమ్మేస్తారు.. ఎందుకంటే ప్రతి టాబ్లెట్‌పై ధర ఉండదు.. ధర ఉన్న టాబ్లెట్‌లు ఇవ్వరు. మొత్తం 10 టాబ్లెట్స్‌కు కలిపి ఒక చోటే ఎమ్మార్పీ ఽధర ఉంటుంది. ఆ ధర లేకుండా మందులు కట్‌ చేసి అమ్మేస్తారు. దీంతో కొనుగోలుదారుడికి అసలు ఽధర ఎంతనేది తెలియదు. ఏదో ఇచ్చారు వేసుకున్నాం.. తగ్గింది కదా ఇక చాల్లే అని వదిలేస్తాడు. అసలు దోపిడీ అంతా ఇక్కడే జరుగుతోంది. 


నేడు రోగి రోగంతో కాదు.. ముందులు కొనలేక చచ్చిపోతున్నాడు.. ఇదీ ఒక సీనియర్‌ డాక్టర్‌ చెప్పిన మాట..ఇది ముమ్మాటికి నిజం.. ఎందుకంటే మెడికల్‌ షాపుల మాయాజాలం అంతా ఇంతా కాదు.. రోగులను జలగల్లా పట్టి పీడించేస్తున్నారు.. ఏదైనా దీర్ఘకాలిక రోగం వచ్చిందా సామాన్యుడి బతుకు అంతే.. నెలవారీ చింతే.. మందులు కొనలేక.. మెడికల్‌ షాపు వద్ద బిల్లు కట్టలేక లబోదిబోమంటాడు.. మందు వేసేకోక పోతే ప్రాణాలు పోతాయ్‌.. అలాగని మందులు కొంటే ఇంట్లో గడవదు.. చివరకు చాలా మంది ప్రాణాలనే బలిపెడుతున్నారు.  నిడదవోలు, జూలై 29 : జిల్లాలోని గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట కొంత మంది మెడికల్‌ షాపుల యజమానులు రోగులను అడ్డదారిన దోచేస్తు న్నారు. వాడే మందులపై అవగాహన లేక పోవడాన్ని మెడికల్‌ మాఫియా అలుసుగా తీసుకుంటుంది.   దీం తో సామాన్యుల, మధ్య తర గతి నుంచి దోపిడీకి తెగబడుతున్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడద వోలు, అనపర్తి,రాజానగరం, గోపాలపురం నియోజక వర్గాల పరిధిలోని మెడికల్‌ షాపుల యజమానులు కొందరు ప్రజల బలహీన తలను అడ్డం పెట్టుకుని మెడికల్‌ మాఫి యాగా విజృంభించారు. మెడికల్‌ షాపుల వ్యాపారం లాభసాటిగా ఉండ డంతో విచ్చల విడిగా వెలుస్తున్నాయి. ఒక్క రాజమహేంద్రవరంలో సుమారు 300లపైనే షాపులు ఉంటాయి. కొవ్వూరు మం డలంలో 80, నిడద వోలు, చాగల్లు మండలాల్లో 135, ప్రతి మండలానికి 30 పైనే మెడికల్‌ షాపులు ఉంటాయి. మైనర్‌ గ్రామానికి రెండు చొప్పున ఉం టాయి. అయినా ఎవరి వ్యాపా రం వాళ్లది.ఎందుకంటే కొంత మంది ఆర్‌ఎంపీ డాక్టర్లను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తారు. మరి కొన్ని చోట్ల ఏకంగా ఆర్‌ఎంపీ డాక్టర్లే మెడికల్‌ షాపులు పెడుతున్నారు. 


జనరిక్‌.. పక్కదారి!


ముందుల షాపుల్లో మోసాలు ఇంతింతికాదయా.. ఇది నిజం. డాక్టర్లు రోగికి రాసే నాలుగు రకాల మందుల్లోను రెండు రకాల మందులు మాత్రమే బ్రాండెడ్‌ కంపెనీలవి ఇచ్చి మిగిలిన రెండు మందులు జనరిక్‌ మందులను అంట కట్టేస్తున్నారు. ఎందుకంటే ధరలో వ్యత్యాసమే కారణం. బ్రాండెడ్‌ కంపెనీకి చెందిన రక్తపోటును తగ్గించే 15 టాబ్లెట్ల షీటు ఎంఆర్‌పీ రూ.346లు ఉండగా అదే జనరిక్‌ మందులు 15 టాబ్లెట్లు ఎంఆర్‌పీ రూ.300లు ఉంటుంది. ఇది ప్రభుత్వం జనరిక్‌ పేరుతో రూ.150లకే మెడికల్‌ ఏజెన్సీలకు సరఫరా చేస్తూ అదే ధరకు విక్రయించాలని ఆదే శాలు జారీ చేసింది. మెడికల్‌ షాపు యజమాని ఎంఆర్‌పీ రూ.300లకు విక్రయి స్తాడు.అంటే ఆ ఒక్క షీట్‌లోనే రూ.150 లాభం అనమాట.. ఇలా కొందరు మెడికల్‌ షాపుల యజమానులు జనరిక్‌ మెడి సిన్‌ అడ్డం పెట్టుకుని దోచేస్తు న్నారు. ప్రజలకు ఏది జనరిక్‌ ఏది బ్రాండెడ్‌ తెలి యక పోవడంతో దోపిడీకి తెగబడుతున్నారు. మరో పక్క ఇంటిం టికి తిరిగి వైద్యం చేసే ఆర్‌ఎంపీలు, పీ ఎంపీలు కొందరు ఈ జనరిక్‌ మెడిసిన్‌ను పరిమితికి మించి కొనుగోలు చేసి మధ్య,పేద వర్గాలకు ఖరీదైన మందుల పేరు తో విక్రయిం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 15 రోజుల కిందట ఔషధ తనిఖీ ఆధికారుల తనిఖీలలో ఒక పీఎంపీ వైద్యుడి వద్ద సుమారు రూ. లక్ష విలువైన రెండు వందల రకాల ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వైద్యుడి వద్ద సరైన ధ్రువపత్రాలు లేకపోవడం పరిమితికి మించి మందులు నిల్వ ఉండడంతో కేసు నమోదు చేశారు.


అధికారుల తనిఖీల్లేవ్‌..


మందుల వ్యాపారం కరోనా ముందు.. కరోనా తర్వాత అని చూడాలి.. ఎందుకంటే కరోనా తర్వాత చిన్న చిన్న మెడికల్‌ షాపుల వాళ్లు కూడా కోటీశ్వరులైపోయారు.. ఎందుకంటే తల పోటు వస్తే మెడిసిన్‌.. జ్వరం వస్తే మెడిసిన్‌.. జలుబు చేస్తే మెడిసిన్‌.. కరోనా భయం కారణంగా మందులు వాడని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు.దీనికి ఇదే నిదర్శనం..కరోనాకు ముందు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి రూ. 50 వేలు అప్పు చేసి మెడికల్‌ షాపు పెట్టాడట. కరోనా రెండేళ్లు ముగిసేసరికి రూ. 50 లక్షల ప్రాఫిట్‌లోకి వచ్చేశాడట.. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. మెడికల్‌ షాపుల వ్యాపారం ఎంత లాభసాటి అనేది.  మరో పక్క ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌) ప్రభుత్వ నిబంధనల ప్రకారం మందుల షాపులపై నిత్యం తనిఖీలు చేయాలి. జిల్లాల విభజన తరువాత ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో మెడికల్‌ వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోతోంది.  


Read more