వదల బొమ్మాళి!

ABN , First Publish Date - 2022-09-26T05:57:01+05:30 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది.. అది ఒక ఫోన్‌ కోసమే వాడితే ఫరవాలేదు..

వదల బొమ్మాళి!

ఆగని రుణ యాప్‌ల వల.. బలైపోతున్న అమాయకులు  

ఫోన్‌లో రుణానికి క్లిక్‌ చేశామా చిక్కులే

విచారణ సాగుతుండగానే మళ్లీ కేసులు

ఫోన్‌ పట్టుకుంటే రుణయాప్‌ల క్యూ

ఇంకనూ నిషేధం కాని వైనం

ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సిందే

దంపతుల కేసులో 11 మంది అరెస్టు


ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది..  అది ఒక ఫోన్‌ కోసమే వాడితే ఫరవాలేదు.. అవకాశం ఉంది కదా అన్ని యాప్‌లు చూశామా.. ఇక అంతే.. ఏదో ఒక యాప్‌లో చిక్కుకుపోతాం.. చివరకు ఇబ్బందులకు గురవుతాం.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చాలా మంది రుణయాప్‌ల మాయలో పడి నలిగిపోతున్నారు.. మీకు రుణం కావాలా అని మెసేజ్‌ వచ్చిన వెంటనే ఒక్క క్లిక్‌ చేసి.. ఇప్పుడు చిక్కుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు..        ఆ నిర్వాహకులకు పోలీసులన్నా భయం లేనట్టు ఉంది. ఒక పక్కన దంపతుల ఆత్మహత్య కేసును సీరియస్‌గా తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నా.. వేధింపులు మాత్రం ఆగడం లేదు.        ప్రతి రోజూ ఏదో ఒక చోట కేసులు నమోదువుతూనే ఉన్నాయి. గత వారమే చూసుకుంటే కడియంలో       ఒక కేసు నమోదైతే.. సీతానగరం మండలం వంగలపూడిలో మరో ఘటన వెలుగుచూసింది. ఈ యాప్‌లపై పోలీసులే కాదు.. ప్రభుత్వమూ దృష్టి సారించాల్సి ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వం కాల్‌మనీ కేసులపై ఏ విధంగా అయితే స్పందించిందో..ప్రస్తుత ప్రభుత్వం అలా స్పందించకపోతే మరింత మంది బలిపశువులుగా మారే ప్రమాదం ఉంది. 


కడియం, సెప్టెంబరు 25 : పోలీసులు తీగ లాగితే డొంక కదులుతోంది.. రుణయాప్‌ లింక్‌ లాగేకొలదీ ఇంకా ఇంకా వస్తూనే ఉంది.రుణయాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుల సెల్‌ఫోన్‌ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు గతంలో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.. వారిని విచారించగా ఆదివారం మరో నలుగురు పోలీసులకు చిక్కారు.. అయితే అసలు సూత్రధారి మాత్రం తప్పించుకున్నట్టు సమాచారం. 


రుణానికి.. క్లిక్‌ చేయవద్దు..


మీ దగ్గర ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉందా? ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాలను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఉపయోగిస్తున్నారా? అయితే జర జాగ్రత్త.. ఒక్క క్లిక్‌ చేస్తే చాలు మీకు రుణం కావాలా ? అయితే నిమిషాల వ్యవధిలో మేమిచ్చేరుణం మీ బ్యాంకు ఖాతాకు వస్తుంది. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి మీ సమాచారం తెలియచేయండి అంటూ క్రెడిట్‌ బీ, మనీవ్యూ, వండర్‌లోన్‌, ట్రూబేలన్స్‌, ఎం పోకెట్‌,  బుడ్డీ కేష్‌, హోమ్‌ క్రెడిట్‌, పోకెట్లీ, మనీవ్యూ, స్టార్‌కేష్‌, ఫ్రెండ్లీ కేష్‌, స్విఫ్ట్‌ లోన్‌, కేషీఫై, మనీటాప్‌ క్రెడిట్‌లైన్‌ వంటి రకరకాల వందలాది రుణయాప్‌లు దర్శనమిస్తాయి. పొరపాటున మీరు ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి మీరు రుణం కోసం మీ విలువైన సమాచారం (ఆఽధార్‌కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు  ఖాతా వివరం, మీరు చేస్తున్న ఉద్యోగం, మీకు తెలిసిన బందువులు, స్నేహితుల చిరునామాలు) వంటివి యాప్‌ నిర్వాహకులకు ఫోన్‌ద్వారా అప్‌లోడ్‌ చేస్తే ఇక అంతే సంగతులు... మిమ్నల్ని ఆ భగవంతుడే రక్షించాలి.. తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. 


అయినా వేధింపులు ఆగలేదు.. 


రుణయాప్‌ల దురాగతానికి కడియంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుని ఆ కుటుంబానికి తీరని ధుఃఖాన్ని మిగిల్చాడు. మూడు నెలల కాలం దాటకుండానే కడియంకు కూతవేటు దూరంలో ఉన్న రాజమహేంద్రవరంలో దంపతులు బలి.. మండల పరిధిలో దుళ్ళలో మరొకరకి వేధింపులు. సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో ఒక ఎల్‌ఐసీ ఏజెంట్‌కు వేధింపులు..బొమ్మూరులో ఒక మహిళకు వేధింపులు..ఇలా నాటి నుంచి కేసులు నమోదవు తూనే ఉన్నాయి. ఒక పక్క కేసు విచారణ ముమ్మరంగా సాగుతున్నా వేధింపులు మాత్రం ఆగకపోవడం గమనార్హం. దీంతో అన్ని రుణయాప్‌లపై పోలీసులు నిఘా పెట్టాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. 


బలిపశువులుగా మారుతున్నారు..


 కొంతమంది వారు పడుతున్న ఇబ్బందులు చెబుతూ  పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే మరి కొంత మంది వారు తీసుకున్న రుణం కంటే అనేక రెట్లు కట్టమంటే కట్టలేక బలిపశువులుగా మారిపోతున్నారు.లేదంటే ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకుంటూ అనేక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా రుణయాప్‌లపై కఠిన చర్యలు  తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా రుణాలు ఇస్తామంటూ యాప్‌లు, తీసుకున్న తరువాత వారికి రుణయాప్‌ల నిర్వాహకుల వేధింపులు షరామామూలుగానే జరుగుతున్నాయి. 


రుణం తీసుకున్నా.. ఆ మరుక్షణమే వేధింపులు..


మాది కడియం మండలం దుళ్ళ.. నా పేరు చాపల చంద్రశేఖర్‌. నేను నర్సరీలో కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నా.ఈ నెల 10వ తేదీన తక్కువ వడ్డీకి రుణం కావాలా అంటూ నా మొబైల్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. క్లిక్‌ చేస్తే ఓ యాప్‌ ద్వారా రూ. 3,796, మరో యాప్‌ ద్వారా రూ. 3,440 వస్తుందని మళ్లీ మెసేజ్‌ వచ్చింది. సేవా రుసుం పోను సదరు యాప్‌ల ద్వారా రూ. 2,277 మరో యాప్‌ ద్వారా రూ. 2,236 నా బ్యాంకు ఖాతాకు జమయ్యాయి.ఆ తరువాత నుంచే సొ మ్ము చెల్లించాలని వేధింపులు ఆరంభమయ్యాయి.నాకు అర్ధం కాలేదు. రకరకాల ఫోన్‌ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.సొమ్ములు చెల్లించేందుకు గడువు ఉన్నా ఫోన్‌లో ఉన్న నెంబర్లకు ఫొటోలు మార్పింగ్‌చేసి పంపించారు. ఏం చేయాలో అర్ధం కాలేదు.  ఈ నెల 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశా. ఎవరూ యాప్‌లో రుణాలకు ఆశపడవద్దు. 


వద్దన్నా.. రుణమిచ్చి వేధించారు..


సీతానగరం మండలం వంగలపూడికి చెందిన బీమా ఏజెంట్‌ గంగారావు సెల్‌ఫోన్‌కు గతనెల 26వ తేదీన ఒక లింక్‌ వచ్చింది. ఆ లింక్‌ ఓపెన్‌ చేయగానే రూ. 7 వేలు అకౌంట్‌ జమ య్యాయి. మీకు రూ. 7 వేలు వేశాం..మరో రూ. 5 వేలు కలిపి వారంలో రూ. 12 వేలు చెల్లించాలని మరో మెసేజ్‌ వచ్చింది. అప్పటికే రుణయాప్‌ల మీద ఊరూవాడా చర్చ జరగడంతో భయపడిన బీమా ఏజెంట్‌ వెంటనే రూ. 12 వేలు జమ చేసేశాడు. కొద్ది గంటల వ్యవధిలోనే మళ్లీ రూ. 12 వేలు జమ చేశారు. నాకు లోన్‌ వద్దని తిరిగి యాప్‌ ఖాతాలో వేశారు.అంతలో యాప్‌ నిర్వాహకులు ఫోన్‌ చేసి ఈ నెలలో రూ. 21,800 కట్టాలని చెప్పారు.ఆ మొత్తం కట్టేశాడు.అయినా ఇంకా సొమ్ముకట్టాలని   బెదిరింపులు ఆరంభమయ్యాయి. దీంతో కంగారుపడిన అతను మీడియాను ఆశ్రయించాడు.తన ఆవేదనను వెళ్లగక్కాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చాడు. 


గ్రామగ్రామాన అవగాహన సదస్సులు


రుణయాప్‌లపై ప్రతి మండలంలోనూ గ్రామాల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వలంటీర్లు, మహిళా పోలీసులు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ  రుణయాప్‌లపై వివరించడం జరుగుతుంది. యాప్‌లో రుణాలు తీసుకోవడం మంచిది కాదు.. ఒక వేళ ఇప్పటికే తీసుకుని వేధింపులకు గురవుతుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.బలవన్మరణాలకు       పాల్పడితే ఒరిగేదేమీ ఉండదు. - తిలక్‌,  కడియం సీఐ


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

సెల్‌ఫోన్‌ల కారణంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. వాటిలో ఇదీ ఒకటి.. రుణయాప్‌ల తీగ లాగితే డొంక కదిలింది. ఎక్కడెక్కడి వారో నిందితులుగా ఉన్నారు. ఇంత నెట్‌వర్క్‌ కారణంగానే దర్జాగా వేధింపులకు దిగుతున్నారు. మిగిలిన యాప్‌లపై కూడా దృష్టి పెడతాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.. కోరి కోరి కష్టాలు కొనితెచ్చుకోవద్దు.మనీ యాప్‌లకు సంబంధించి త్వరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు.   

 - సుధీర్‌కుమార్‌ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ


Read more