లైన క్లియర్‌!

ABN , First Publish Date - 2022-02-16T06:43:34+05:30 IST

మోరంపూడి, జొన్నాడ ప్లైఓవర్ల నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఈనెల 28న టెండర్లు ఖరారు చేయనున్నారు. వాస్తవానికి ఇవి ఎప్పుడో పూర్తి కావలసి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ జిల్లాలోని మోరంపూడి, దివాన్‌చెరువు, వేమగిరి, జొన్నాడ ప్లైఓవర్లను మంజూరు చేయించారు.

లైన క్లియర్‌!

  • మోరంపూడి, జొన్నాడ ఫ్లై ఓవర్లకు 28న టెండర్లు ఖరారు
  • మోరంపూడి జంక్షన్‌లో ఆక్రమణలు తొలగించే ప్రయత్నాలు
  • ఇప్పటికే భూ సేకరణ పూర్తి
  • ఫ్లై ఓవర్‌ పూర్తయితే ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్టే
  • ఇటు ఆవ వందడుగుల రోడ్డు పూర్తయితే ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డు ఒత్తిడి తగ్గినట్టే

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మోరంపూడి, జొన్నాడ ప్లైఓవర్ల నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఈనెల 28న టెండర్లు ఖరారు చేయనున్నారు. వాస్తవానికి ఇవి ఎప్పుడో పూర్తి కావలసి ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ జిల్లాలోని మోరంపూడి, దివాన్‌చెరువు, వేమగిరి, జొన్నాడ ప్లైఓవర్లను మంజూరు చేయించారు. మోరంపూడి ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. కానీ  గుండుగొలను-దివాన్‌చెరువు జాతీయ రహదారి నిర్మాణం వల్ల జొన్నాడ నుంచి రాజమహేంద్రవరం హైవేలో ట్రాఫిక్‌ పెద్దగా ఉండదని పొరపాటు సమాచారం వల్ల కేంద్రం ఈ హైవేను జాతీయ రహదారుల జాబితాలో నుంచి తీసేసింది. కానీ తర్వాత అప్పట్లోనే ఒత్తిడి తేవడంతోపాటు అధికారులు ఇక్కడి ట్రాఫిక్‌ వివరాలు అందివ్వడం, జాతీయ రహదారిని ఆరు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తుండడంతో మళ్లీ ఈ హైవేను జాతీయ రహదార్ల జాబితాలో చేర్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం చాలాకాలం దీనిని పట్టించుకోలేదు. ఇటీవల ఎంపీ మార్గాని భరత్‌ కూడా ఢిల్లీ స్థాయిలో పలు ప్రయత్నాలు చేసినట్టు ప్రకటించారు. ఎట్టకేలకు కేంద్రం మోరంపూడి, జొన్నాడతోపాటు పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం, తేతలి, కైకరం ఫ్లైఓవర్లకు కూడా క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ ఐదింటికి ఒకే టెండరు పిలిచింది. గత నెలలోనే ఇది ఖరారు కావలసి ఉంది. కానీ దీని టెండరు గడువును ఈనెల 28 వరకూ పొడిగించారు. ఈసారి ఇవి ఖరారవుతాయని అధికారులు చెబుతున్నారు. మోరంపూడి ఫ్లైఓవర్‌ను రూ.56.13 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో రూ.25.2 కోట్లు ఇప్పటికే భూసేకరణ కోసం ఖర్చు చేశారు. మిగతా రూ. 30 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు. హుకుంపేట వైపు నుంచి లాలాచెరు వు వైపు మోరంపూడి సెంటర్‌లో 600 మీటర్ల పొడువునా దీనిని నిర్మించనున్నారు. ఇక జొన్నాడ ఫ్లైఓవర్‌కు రూ.23.86 కోట్లు కేటాయించారు. ఉం డ్రాజవరం ఫ్లైఓవర్‌కు రూ.35.7 కోట్లు, తేతలి ఫ్లైఓవర్‌కు రూ.32.44 కోట్లు,  కైకరం ఫ్లైఓవర్‌కు రూ. 67.25 కోట్లు ఇచ్చారు. ఇక మోరంపూడి ఫ్లైఓవర్‌ పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. ఇక్కడ హైవేతోపాటు సిటీ నుంచి మోరంపూడి వైపు, మోరంపూడి నుంచి సిటీలోకి వేలాది మంది, వాహనా లు పయనిస్తుంటాయి. పైగా ఈ జంక్షన్‌ బ్లాక్‌స్పాట్‌. అందుకే చాలాకాలం నుంచి ఇక్కడ ఫ్లైఓవర్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాక రాజమహేంద్రవరం జిల్లా కేంద్రమవుతోంది. దీంతో ట్రాఫిక్‌ పెరుగుతుంది. ఈ ఫ్లైఓవర్‌ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఈ ఫ్లైఓవర్‌ పూర్తయ్యేలోపు తూర్పు రైల్వేస్టేషన్‌ రోడ్డు నుంచి వాంబే గృహాల గుండా మోరంపూడికి నిర్మించనున్న 100 అడుగుల రోడ్డు కూడా పూర్తయితే మరింత ప్రయోజనం. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన ఈ రోడ్డు పూర్తయితే ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్డుకు ప్రత్యామ్నాయ రోడ్డుగా ఉపయోగపడుతుంది.

వారంలో ఆక్రమణలు తొలగిస్తాం : ఎన్‌హెచ్‌ పీడీ సురేంద్రనాథ్‌

మోరంపూడి సెంటర్‌లో భూసేకరణ పూర్తయింది. అందులో ఉన్న ఆక్రమణలన్నీ వారంరోజుల్లో తొలగిస్తాం. ప్రజలు సహకరించి, వాటి తొలగింపునకు సహకరించాలి.

Read more