సంక్షేమ మంత్రం... అభివృద్ధి జపం!

ABN , First Publish Date - 2022-05-24T06:05:01+05:30 IST

ప్రధానంగా వ్యవసాయం, ఇరిగేషన, హౌసింగ్‌ అంశాలతో పాటు తొమ్మిది అంశాలను చర్చకు పెట్టారు. ఐదు అంశాలపై మాత్రమే చర్చించి సమావేశాన్ని ముగించారు. గత వైఫల్యాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు సమావేశం జరిగిన క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనూహ్య రీతిలో భద్రత ఏర్పాటు చేశారు.

సంక్షేమ మంత్రం... అభివృద్ధి జపం!
డీఆర్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్‌. చిత్రంలో మంత్రులు విశ్వరూప్‌, వేణు, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

  • ఎజెండాలో తొమ్మిది అంశాలు.. ఐదింటిపై అరకొరగా చర్చ
  • కోనసీమ జిల్లా తొలి అభివృద్ధి సమీక్షా సమావేశం తీరిది
  • జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలి 
  • ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు మంత్రుల సూచన

ప్రధానంగా వ్యవసాయం, ఇరిగేషన, హౌసింగ్‌ అంశాలతో పాటు తొమ్మిది అంశాలను చర్చకు పెట్టారు. ఐదు  అంశాలపై మాత్రమే చర్చించి సమావేశాన్ని ముగించారు. గత వైఫల్యాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు సమావేశం జరిగిన క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనూహ్య రీతిలో భద్రత ఏర్పాటు చేశారు. పాత్రికేయులను అనుమతించలేదు. సమావేశం అనంతరం  మంత్రులు ముగ్గురూ మీడియాతో మాట్లాడి తమ అభిప్రాయాలను  గొప్పగా చెప్పుకున్నారు.

అమలాపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): వనరులు పుష్కలంగా ఉన్న కోనసీమ జిల్లాను అన్ని రంగాల్లోను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజల సహకారంతో ముందుకు సాగాలని జిల్లా ఇనచార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా తొలి అభివృద్ధి సమీక్షా సమావేశం అమలాపురంలోని క్షత్రియ కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. పరిపాలనా వికేంద్రీకరణ, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన కోనసీమ జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆయన సూచన చేశారు. జూన 1 నుంచి విడుదల కానున్న సాగునీటితో రాష్ట్రంలో మూడు పంటలు పండించుకునే కొత్త సంప్రదాయానికి సీఎం ప్రాధాన్యత కల్పించారన్నారు. జిల్లావ్యాప్తంగా గృహ నిర్మాణ స్థలాలు ఫిల్లింగ్‌, ఇతర సమస్యలను వారంలో పరిష్కరించాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా తొలకరికి అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలని కోరారు. గత పంట కాలానికి సుమారు రూ.2కోట్ల ధాన్యం బకాయిలు నిలిచిపోయాయని, సాంకేతిక సమస్యలతో ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి రమేష్‌ పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ జిల్లా పేరు మార్చేందుకు ప్రభుత్వం ఒక నెల గడువు ఇచ్చిందని, ఈలోగా ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలను సామరస్య ధోరణిలో అందించాలని విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 29వ తేదీ  వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ‘సామాజిక న్యాయభేరి’ పేరిట మంత్రులతో బస్సు యాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు.

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ప్రాథమిక రంగానికి పొటెన్షియాలిటీ ఉన్న జిల్లాగా కోనసీమ ఉందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జిల్లా పరిషత చైర్మన విప్పర్తి వేణుగోపాలరావు, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, యిళ్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్‌, కొండేటి చిట్టిబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, పొన్నాడ వెంకటసతీష్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ హెచఎం ధ్యానచంద్ర, డీఆర్వో సత్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వై.ఆనందకుమారి, పంచాయతీరాజ్‌ ఈఈ చంటిబాబులతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 


కాగితాలకే పరిమితమైన అభివృద్ధి

చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ 

కోనసీమ జిల్లాలో కొన్ని అభివృద్ధి పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధిం చిన అభివృద్ధి వాస్తవ పరిస్థితులకు, అధికారులు చెప్తున్న లెక్కలకు పొంతన లేదు. జిల్లాలో 28,619 ఇళ్లకు  అనుమతి రాగా 26వేల పైచిలుకు ఇళ్లకు ఆనలైన ప్రక్రియ పూర్తయింది. 4,821 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదని చెప్తున్న లెక్కలు కాగితాలకే పరిమితం. గత రబీలో అధికారులు ఎరువులు ఇవ్వడంలో చూపిన నిర్లక్ష్యం వల్ల బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధర చెల్లించి రైతులు కొనుక్కోవలసి వచ్చింది. ప్రభుత్వం రైతు సంక్షేమమని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఆ దిశగా కార్యక్రమాలు అమలు కావట్లేదు. ఽగత పంటకు సంబంధించి ధాన్యం సొమ్ములు రైతులకు ఇంకా అందని పరిస్థితి. ఇరిగేషన పనులు పూర్తవుతాయో లేదో కూడా తెలియదు.


రైతు భరోసా కేంద్రాలతో ఒరిగిందేమీ లేదు 

యిళ్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ

రైతు భరోసా కేంద్రాలతో ఒరిగిందేమీ లేదు. క్షేత్ర స్థాయిలో రైతులు తమ ధాన్యాన్ని దళారులు, వ్యాపారులకు అమ్ముకోవలసిన పరిస్థితి. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. రైతులకు రవాణా చార్జీలు కూడా చెల్లించట్లేదు. గోనె సంచులు ఇవ్వట్లేదు. జిల్లావ్యాప్తంగా 9.93 లక్షల కమతాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కేవలం 60వేల మంది కౌలు రైతులను మాత్రమే గుర్తిం చామంటున్నారు. అర్హులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు. గత టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఫ్లాట్లను లబ్ధిదారులకు ఎప్పుడు అందించేదీ స్పష్టంగా చెప్ప డం లేదు. నూతన విద్యా విధానం పేరుతో పాఠశాలల్లోని తరగతులను విలీనం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 35వేల పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి. కొత్తగా నాడు-నేడు పనులు చేపట్టడం మంచిదే. కానీ ముందస్తు వివరాలు తెలుసుకోవట్లేదు. టీచర్‌ పోస్టులు ఎత్తివేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

Read more