దీక్ష విరమించిన సూర్యచంద్ర

ABN , First Publish Date - 2022-06-07T07:04:27+05:30 IST

జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ పాటంశెట్టి సూర్యచంద్ర ఏడురోజులుగా చేస్తున్న దీక్ష విరమించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, ఉపాధి కూలీలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

దీక్ష విరమించిన సూర్యచంద్ర
దీక్ష విరమించి మాట్లాడుతున్న జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి సూర్యచంద్ర

  • విరమింపజేసిన జనసేన పీఏసీ సభ్యుడు కందుల దుర్గేష్‌
  • ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడిన సిబ్బంది, అధికారులపై చర్యలకు కలెక్టర్‌ సిఫార్సు
  • 14మంది మేట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌ 
  • ఏపీవో, ఈసీలకు షోకాజ్‌ నోటీసులు

జగ్గంపేట రూరల్‌, జూన్‌ 6: జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ పాటంశెట్టి సూర్యచంద్ర ఏడురోజులుగా చేస్తున్న దీక్ష విరమించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, ఉపాధి కూలీలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఆయన డిమాండ్‌ మేరకు ఉపాధి సిబ్బందిపై చేపట్టిన చర్యలను మొదట అధికారులు వేర్వేరు కాగితాల్లో తీ సుకువచ్చి సూర్యచంద్రకు అందజేశారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చర్యలు తీసుకున్న ఉపాధి సిబ్బంది, అధికారుల వివరాలన్నీ ఒకే కాగితం పై లిఖితపూర్వకంగా టైప్‌ చేసి ఇవ్వాలని పట్టుబట్టారు. అందుకు అను గుణంగా అధికారులు కార్యాలయానికి వెళ్లి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేసి మళ్లీ ఒకే పేపర్‌పై టైప్‌ చేసి డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సూర్యచంద్ర అంగీకారం తెలిపారు. 

గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతికి పాల్పడిన సిబ్బందిపై, అందుకు సహకారం అందించిన మండలస్థాయి అధికారులపై జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా చర్యలకు డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మికి సిఫార్సు చేశారు. గ్రామంలో 14మంది మేట్లను, ఒక టెక్నికల్‌ అసిస్టెంట్‌ను సస్పెన్షన్‌ చేశారు. ఏపీవో, ఈసీలకు షోకాజు నోటీసులు జారీచేశారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి మొత్తం రూ.లక్షా52వేల206గా తేల్చారు. ఈ మొత్తం 31మంది ఉపాధి కూలీలు, పలువు రు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగస్తులనుంచి రికవరీకి ఆదేశించారు. సూర్యచం ద్రకు సోమవారం సంఘీభావం తెలిపిన వారిలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తుమ్మలబా బు, ప్రత్తిపాడు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బుగత శివ తెలిపారు. ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ జస్టిస్‌(ఏఐఎల్‌ఏజే) తరుపున ఉపాధి పథకంలో జరుగుతున్న అవినీతిపై హైకోర్టులో పిల్‌ వేస్తామని శివ తెలిపారు. దీక్ష విరమించిన తర్వాత సూర్యచంద్ర మాట్లాడుతూ ఇక నుంచైనా అధికారులు అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా ఉపాధి పనులు జరిగేలా చూసి ఉపాధి కూలీలకు ఆసరాగా ఉండాలని కోరారు. దీక్షకు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీడీ కే ఎన్‌వీ ప్రసాద్‌రావు, పెద్దాపురం డీఎస్పీ బి.అప్పారావు, తహశీల్ధార్‌ వై.సరస్వతి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, సీఐ సూరి అప్పారావు పాల్గొన్నారు.

Read more