దిగిరాకపోతే దింపుతాం

ABN , First Publish Date - 2022-09-21T05:54:00+05:30 IST

కార్మికుల హక్కులను విస్మరిస్తూ.. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మికులు మండిపడ్డారు.

దిగిరాకపోతే దింపుతాం
సీఐటీయూ పిలుపు మేరకు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న అసంఘటిత రంగ కార్మికులు, ఆశలు, అంగన్‌వాడీలు

  • కార్మికుల కలెక్టరేట్‌ ముట్టడి
  • సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ధవళేశ్వరం, సెప్టెంబరు 20 : కార్మికుల హక్కులను విస్మరిస్తూ.. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మికులు మండిపడ్డారు. సీఐటీయూ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద సీఐ టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో భవ నిర్మాణ కార్మికులు, అంగన్‌ వాడీ లు, ఆశావర్కర్లు, ఫ్యాక్టరీ కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఏవీ.నాగేశ్వరరావు మాట్లాడుతూ 15 ఏళ్ల కిందట నిర్ణయించిన కనీస వేతనం తోనే ఈ రోజు రాష్ట్రంలోని కార్మికులు పనిచేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆశాలు, అంగన్‌వాడీలు, సర్వశిక్ష అభియాన్‌, వీఈవోలకు కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేయాలన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సుమారు కోటి మంది కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డు ఏర్పా టు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి రూ. 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డుకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటి మంది కార్మికుల ఓట్లు కావాలంటే ప్రభుత్వం వెంటనే కార్మిక సంక్షేమ చర్యలు చేపట్టాలన్నారు.అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, టి.అరుణ్‌, కేవీఎస్‌ రామచంద్రరావు, డి.పవన్‌, ఎం. సుందర బాబు, జె.రాంబాబు,బి.పూర్ణిమిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more