పారా లీగల్‌ వలంటీర్ల సేవలు కీలకం

ABN , First Publish Date - 2022-04-24T06:29:03+05:30 IST

పారా లీగల్‌ వలంటీర్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థకు కళ్లు, చెవులు లాంటి వారని, అంకితభావంతో వారంతా గ్రామస్థాయి వరకు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్‌ అమానుల్లా సూచించారు.

పారా లీగల్‌ వలంటీర్ల సేవలు కీలకం
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్‌
రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 23: పారా లీగల్‌ వలంటీర్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థకు కళ్లు, చెవులు లాంటి వారని, అంకితభావంతో వారంతా గ్రామస్థాయి వరకు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అషానుద్దీన్‌ అమానుల్లా సూచించారు. ఆనం కళా కేంద్రంలో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమం, పేదరిక నిర్మూలన అనే అంశంపై శనివారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పౌరసేవలు మరింత పారదర్శకంగా అందించాలన్నారు. పారా వలంటీర్లు సేవాగుణంతో పనిచేయాలన్నారు. అర్హులైన వారికి పథకాలు అందకపోయినా, న్యాయం జరగకపోయినా ప్రజలు వారి హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఈ వ్యవస్థలున్నాయని చెప్పారు. అనంతరం పీఎల్‌వీ, పీఎల్‌ఏ న్యాయవాదులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. అలాగే జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. డ్రోన్‌ కెమెరాలు, లాక్‌డ్‌ హౌస్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌, దిశ పెట్రోలింగ్‌ వాహనాల ప్రత్యేకత, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటును ఆయన పరిశీలించారు. బహిరంగ మద్యం తాగే వారిపై తీసుకునే చర్యలు, సారా నిర్మూలన అంశాలపై తీసుకునే చర్యలను ఎస్పీ ఐశ్వర్యరస్తోగి  న్యాయమూర్తికి వివరించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జస్టిస్‌ మొక్కలు నాటారు.  ఆయనను డీఎల్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శి ఎం.బబిత, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వెంకటజ్యోతిర్మయి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.ప్రత్యూషకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే చీఫ్‌ జస్టిస్‌ను రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు ఇళ్ల శివప్రసాద్‌, ఉపాధ్యక్షుడు టి.పాణిగ్రహి తదితరులు కూడా కలిశారు.

Updated Date - 2022-04-24T06:29:03+05:30 IST