కాల్వ గట్టునే కొల్లగొడుతున్నారు!

ABN , First Publish Date - 2022-09-11T05:58:40+05:30 IST

అధికారులకు మామూళ్లు ఇచ్చాం.. తవ్వుకోమన్నారు.. మధ్యలో నీకెంటి.. అక్రమంగా తాడిపూడి కాల్వ గట్టునే తవ్వేస్తూ.. ఇదీ మట్టి మాఫియా ప్రశ్నించిన తీరు..

కాల్వ గట్టునే కొల్లగొడుతున్నారు!
పట్టపగలే దర్జాగా తాడిపూడి కాల్వ గట్టు తవ్వేస్తున్న మాఫియా

తాడిపూడి కాల్వ గట్టుకే రక్షణ కరువు 

రెచ్చిపోతున్న గ్రావెల్‌ మాఫియా

కన్నుపడితే ఖాళీ చేసేస్తున్నారు

తాడిపూడి కాల్వ గట్టు గుల్ల  

పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా రవాణా

 మామూళ్ల మత్తులో అధికారులు

నల్లజర్ల మండలంలో ఘటన


అధికారులకు మామూళ్లు ఇచ్చాం.. తవ్వుకోమన్నారు.. మధ్యలో నీకెంటి.. అక్రమంగా తాడిపూడి కాల్వ గట్టునే తవ్వేస్తూ.. ఇదీ మట్టి మాఫియా ప్రశ్నించిన తీరు.. ఏం జరుగుతుందోనని కనీసం భయం లేదు.. ఎందుకంటే అధికారులకు ఎంత కావాలంటే అంత పడేశాం.. ఇక నన్ను వాళ్లేం చేస్తారనే ధైర్యం.. అందుకే దర్జాగా పగలు తవ్వేసి తరలించేస్తున్నా కనీసం కన్నెత్తి చూసిన వారే లేరు.. రెవెన్యూ వ్యవస్థ.. పోలీస్‌ వ్యవస్థ.. సచివాలయ వ్యవస్థ.. ఇన్ని వ్యవస్థలు ఉండి ఏం లాభం.. మారుమూల గ్రామాల్లో             కాల్వ గట్లు దర్జాగా కొట్టేస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు.. కాపాడలేకపోతున్నారు. 


 నల్లజర్ల, సెప్టెంబరు 10 : మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కన్నుపడితే చాలు అక్కడా ఇక్కడా అని లేదు.. ఎక్కడైనా సరే తవ్వేస్తున్నారు.ఎందుకంటే అడిగే నాథుడు లేడు.. ప్రశ్నించే అధికారీ లేడు.అంతా వాళ్లిష్టం.. దీంతో గ్రామా ల్లో మూడు పవ్వులు ఆరు కాయలుగా మట్టి మాఫియా సాగిపోతోంది. కోట్లాది రూపాయలతో ప్రభు త్వం పటిష్టం చేసిన కాలువ గట్లే ఖాళీ అయిపోతున్నాయి.  అయినా అధికార యంత్రాంగం చూస్తూ ఊరుకోవడం గమనార్హం.  


తాడిపూడి కాల్వ గట్టు ఖాళీ


నల్లజర్ల మండలం పోతవరం,సుభధ్రపాలెం అడ్డాగా మట్టి మాఫియా చెలరేగిపోతోంది.ఈ రెండు గ్రామాల పొడవుగా చేల మధ్య తాడిపూడి కాల్వ గట్టు ఉంటుంది. గత 15 రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి,గ్రావెల్‌ మాఫియా ఏకంగా తాడిపూడి కాల్వ గట్టునే కొల్లగొడుతున్నారు.అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయి నా సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే మామూళ్లు ఇస్తే మీ ఇష్టం వచ్చిన గట్టును తవ్వుకోమమని సలహా ఇవ్వడం శోచనీయం. ఇప్పటి వరకూ ఈ ప్రాంతం నుంచి కొన్ని వేల మెట్రిక్‌ టన్నుల గ్రావెల్‌ మట్టి తరలిపోయింది. 


అక్రమంగా తరలింపు.. 


 గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వ గ్రావెల్‌ రోడ్లను మంజూరు చేస్తుంది. సంబంధిత కాంట్రాక్టర్లు మైనింగ్‌ శాఖకి చలానా కట్టి గ్రావెల్‌కి అనుకూలమైన ప్రాంతం నుంచి గ్రావెల్‌ తీసుకోవాలి. కానీ కాంట్రాక్టర్లు తక్కువ ఖర్చుతో పని ముగించాలని గ్రావెల్‌ మాఫియాను ఆశ్రయిస్తున్నారు. దీంతో మైనింగ్‌ శాఖకు చలానా కట్టకుండానే దగ్గర్లో ఉన్న గ్రావెల్‌,మట్టి కలిసి ఉన్న మిశ్రమాన్ని పోసి బిల్లులు చేసుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు స్థలాల్లో రోడ్ల నిర్మాణానికి వాడుకుంటున్నారు.దీంతో గ్రావెల్‌కి డిమాండ్‌ ఏర్పడింది. టిప్పర్‌ గ్రావెల్‌ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు.ప్రతి రోజు పదుల సంఖ్యలో టిప్పర్లు గ్రావెల్‌ రవాణా చేస్తున్నాయి. దీంతో అటు మైనింగ్‌ శాఖకు ఆదాయం ఎగ్గొడుతున్నారు..ఇటు ప్రభుత్వం పటిష్టం చేసిన కాల్వ గట్లను కరిగించేస్తున్నారు.అయినా ఏ ఒక్క అధికారీ ప్రశ్నించడు..పట్టించుకోడు..


మాకిది మామూలే?


సుభద్రపాలెంలో పాతకోకల సుందరం పొలం ఆనుకుని ఉన్న తాడిపూడి కాల్వ గట్టును పోతవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన ఎక్స్‌కవేటర్‌తో తవ్వేస్తున్నాడు. ఈ మేరకు ఆంధ్రజ్యోతికి సమాచారం అందగా వెళ్లే సరికి గ్రావెల్‌ మట్టి త్రవ్వి యర్రంపేటకు చెందిన ఏపీ 05 టీఎం 3788 నెంబరు గల టిప్పర్‌లో లోడ్‌ చేసి తరలిస్తున్నారు.దీనిపై ప్రశ్నించగా అధికారులకు మామూళ్లు ఇచ్చాం.. తవ్వుకోమన్నారని చెప్పడం గమనార్హం. దీనిపై ఇరిగేషన్‌ ఏఈకి ఫోన్‌ చేసి వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా స్పందించలేదు. 


Updated Date - 2022-09-11T05:58:40+05:30 IST