ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆన్‌లైన్‌ వైద్యం

ABN , First Publish Date - 2022-06-07T06:44:38+05:30 IST

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చూశాం, ఆన్‌లైన్‌ క్లాసులు విన్నాం. కానీ ఎక్కడా లేని విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆన్‌లైన్‌ వైద్యం నడుస్తోంది.

ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో   ఆన్‌లైన్‌ వైద్యం
ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో నర్సులే వైద్యపరీక్షలు చేస్తున్న దృశ్యం

మూడు నెలలుగా వైద్యులు లేరు 

ఫోన్‌లో సూచనలు తీసుకుని రోగులకు వైద్యం చేస్తున్న నర్సులు

25 గిరిజన గ్రామాల ప్రజల ఇక్కట్లు 

కూనవరం, జూన్‌ 6: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చూశాం, ఆన్‌లైన్‌ క్లాసులు విన్నాం. కానీ ఎక్కడా లేని విధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆన్‌లైన్‌ వైద్యం నడుస్తోంది. కూనవరం మండలం కూటూరు పీహెచ్‌సీలో 3నెలలుగా వైద్యులు లేరు. గతంలో ఇక్కడ డిఫ్యూటేషన్‌ మీద వచ్చిన వైద్యుడు శివప్రసాద్‌ 3 నెలల క్రితం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఆసుపత్రిలో అప్పటి నుంచి వైద్యుని కుర్చీ ఖాళీగానే ఉంది. ఈ ఆసుపత్రిపరిధిలో గుట్టలపై నివశించే పది కొండరెడ్ల గ్రామాలతోపాటు మరో 15 గిరిజన గ్రామాల ప్రజలు ఈ కూటూరు పీహెచ్‌సీ ఆసుపత్రి వైద్యం మీదే ఆధారపడతారు. డాక్టర్‌ లేకపోవడంతో ఇక్కడ నర్సులే డాక్టర్‌ అవ తారం ఎత్తి రోగులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగి ఆరోగ్య పరిస్థితిని ఫోన్‌లో డిఫ్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్యకు వివరిస్తారు. పుల్లయ్య నర్సులు ఫోన్‌లో చెప్పిన రోగి ఆరోగ్యాన్ని బట్టి ఇంజక్షన్‌లు, మాత్రలు ఇవ్వాలని వివరిస్తారు. ఒక్కోసారి డిఫ్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ఫోన్‌ కలవకపోయినా సిగ్నల్స్‌ లేకపోయిన ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడాల్సిందే. గర్భవతులు, ఎమర్జెన్సీ రోగులు ఈ ఆసుపత్రికివస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మొత్తం ఈ ఆసు పత్రి వైద్యమంతా ఫోన్‌లద్వారా నే చికిత్స జరుగుతుంది. మరోవైపు మండలంలోని కోతుల గుట్టలో ఉన్న 30 పడకల ఆసుపత్రిలో సైతం వైద్యుల కొరతే ఉంది. ఈ ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులు ఉండాల్సినప్పటికీకే వలం ఒక దంత వైద్యురాలు మాత్ర మే ఉన్నారు. దీంతో ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యం అంతంత మాత్రంగానే అందుతుంది. ఈ పరిస్థితినిబట్టి చూస్తే ఏజెన్సీలో రోగులకు ఎటువంటి వైద్యం అందుతుందో అర్థమవుతుంది. రాబోవు రోజులు వ్యాధుల సీజన్‌కావడంతో రోగులు మరింత అవస్థలుపడే అవకాశం ఉంది. కోతులగుట్ట ఆసుపత్రిలో ప్లేట్‌లేట్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తామని ఏడాదికిందట అఽధికారులు హామీ ఇచ్చి నప్పటికీ ఇంతవరకు నెరవేరలేదు. దీనిపై డిఫ్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్యను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఏజెన్సీలో వైద్యుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. కూటూరు పీహెచ్‌సీకి రెండురోజుల్లో వైద్యుని నియమిస్తామని, అక్కడి గిరిజన ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చూస్తామని ఆయన తెలిపారు. 



Updated Date - 2022-06-07T06:44:38+05:30 IST