పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి సుస్తీ

ABN , First Publish Date - 2022-09-25T06:27:18+05:30 IST

విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తే....పూర్తిస్ధాయిలో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం నియోజకర్గానికి సంబంధించి ఎక్కువ శాతం గోదావరి తీరం కావడంతో లంక గ్రామాలు అధికంగా ఉన్నాయి.

పి.గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి సుస్తీ

   ఆస్పత్రిలో ఉండాల్సింది 12 మంది వైద్యులు.. కానీ ఉన్నవారు ఇద్దరే
  కొన్ని విభాగాలకు అసలు డాక్టర్లే లేరు
 వైద్యుల కొరతతో ఆగిన సిజేరియన్లు
  సాధారణ ప్రసవాలు మాత్రమే
  50 పడకల ఆస్పత్రి అయినా               
  ఆ స్థాయిలో అందని వైద్యం

పి.గన్నవరం, సెప్టెంబరు 24: విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తే....పూర్తిస్ధాయిలో వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం నియోజకర్గానికి సంబంధించి ఎక్కువ శాతం గోదావరి తీరం కావడంతో లంక గ్రామాలు అధికంగా ఉన్నాయి. వాటిలో నియోజకర్గ ప్రధాన కేంద్రం పి.గన్నవరం చుట్టుపక్కల  10 లంక గ్రామాలు ఉన్నాయి. దీంతో  ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే సుమారు 5 నుంచి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న మండల కేంద్రానికి రావాలి.  తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత వైద్యులు లేకపోతే అక్కడ నుంచి 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లాల్సిందే.. ప్రస్తుతం పి.గన్నవరం సామాజిక ఆరోగ్యకేంద్రం పరిస్థితి దారుణంగా ఉంది. వైద్యులు లేక వెలవెలబోతోంది.  గతంలో అబ్దుల్‌ కలాం చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ భీమాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దాతలు సహకారంతో అన్ని వసతులతో కూడిన ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. దీనికి తోడు వైద్యులు, సిబ్బంది సహకరించడంతో ప్రతి నెల 30 నుంచి 50 (సాధారణ, ఆపరేషన్‌) డెలవరీలు విజయవంతంగా జరిగేవి. దీంతో పి.గన్నవరం నియోజకవర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాలు నుంచి కూడా గర్భిణీలు ఈ ఆస్పత్రికి వచ్చి పురుడు పోసుకునేవారు. ఆసుపత్రిలో ప్రభుత్వం నిబంధనల జనరల్‌ మెడిసిన్‌ ఒకరు, జనరల్‌ సర్జన్‌ ఒకరు, గైనికాలజిస్ట్‌లు ఇద్దరు, చిన్నపిల్లల వైద్యులు ఒకరు, మత్తు వైద్యులు ఒకరు, కంటి వైద్యులు ఒకరు, దంత వైద్యులు ఒకరు, ఆర్ధోపెడిక్‌ ఒకరు, జనరల్‌ ఎంబీబీఎస్‌ స్‌ ఇద్దరు. అప్తామాలిక్‌ అధికారి ఒకరు ఇలా మొత్తం 12 మంది ఉండాలి. కాని ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌, మత్తు వైద్యులు సెలవులో ఉండటంతో ఇద్దరే ఉన్నారు. వీరికి తోడు ఎంబీబీయస్‌ ఒకరు, కిమ్స్‌ నుంచి వచ్చే నలుగురు వైద్యులు మాత్రమే రోగులకు సాధారణ చికిత్సలు అందిస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా  విధులు నిర్వహిస్తూ గైనకాలజిస్ట్‌ సహాయంతో ఆపరేషన్‌లు నిర్వహించే వైద్యులు డాక్టర్‌ అప్పారి సూర్యనారాయణ బదిలీపై వెళ్లడంతో గత నాలుగు రోజులుగా ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఆస్పత్రిని సాధారణ డెలివరీలకే పరిమితం చేశారు. హైరిస్క్‌ గర్భిణీలను అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఉన్న 50 పడకల ఆసుపత్రికి పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పెద్దగా జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.3 కోట్లతో నూతన భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది.

Updated Date - 2022-09-25T06:27:18+05:30 IST