తగ్గి.. పెరిగినది

ABN , First Publish Date - 2022-08-17T06:48:58+05:30 IST

అఖండ గోదావరికి వరద పోటు పెరిగింది. 24 గంటల కిందట తగ్గుముఖం పట్టిన గోదావరి వరద మరలా పెరుగుతుండడంతో తీరప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

తగ్గి.. పెరిగినది
కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద అఖండ గోదావరి వరద ఉధృతి

8 గంటల వ్యవధిలో మళ్లీ పెరిగిన గోదావరి 

ఉదయం రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

సాయంత్రం 4 గంటలకు మళ్లీ జారీ

అధికారుల ఉరుకులు.. పరుగులు


ధవళేశ్వరం/కొవ్వూరు, ఆగస్టు 16 : అఖండ గోదావరికి వరద పోటు పెరిగింది. 24 గంటల కిందట తగ్గుముఖం పట్టిన గోదావరి వరద మరలా పెరుగుతుండడంతో తీరప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎగువన భద్రా చలం, దిగువన ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో మంగళవారం ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం వరద ఉధృతి పెరగుతుండడంతో మరలా రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. దీంతో అధికారులు ఉరుకులు.. పరుగులు పెట్టారు.  ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తుండడంతో తగ్గుముఖం పట్టిన గోదావరి మరలా ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద మంగళవారం ఉదయం 8 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాదహెచ్చరికను ఉపసం హరించారు. సాయంత్రం 4 గంటలకు 13.75 అడుగులకు పెరగడంతో మరలా రెండో ప్రమాదహెచ్చరిక జారీ అయింది. గత నెల రోజులకు పైగా గోదావరికి వరద పొటెత్తడంతో నదీ పరివాహక ప్రాంతంలోని ఏటిగట్లు వరద ఉధృతితో నానిపోయి ఉన్నాయి. గోదావరి వరద ఉధృతి మరింత పెరిగితే ఏటిగట్లు బలహీనపడే ప్రమాదం పొంచి ఉంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద సోమవారం వరద తగ్గుముఖం పట్టి క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టాలపై చేరుకుంది. మంగళవారం క్షేత్రంలోని ఏటిగట్లను తాకుతూ వరద ప్రవహిస్తుంది. మరలా వరద పెరుగుతుండడంతో స్నానఘట్టాల మెట్లను మరోసారి వరద ముంచెత్తింది. వరద ఉదృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అప్రమత్తంగా ఉన్నట్లు కొవ్వూరు ఏజీఆర్‌బీ ఏఈ ఆర్‌.సునీల్‌బాబు తెలిపారు. గోదావరి వరద మరలా పెరుగుతుండడంతో భద్రాచలం వద్ద 56 అడుగులకు నీటిమట్టం చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. కొవ్వూరు అఖండ గోదావరి కుడిగట్టు విభాగం పరిధిలో కొవ్వూరు, వేగేశ్వరరపురం, పోలవరం ఫ్లడ్‌స్టోరేజ్‌లో ఫ్లడ్‌ మె టీరియల్‌ ఇసుక,వెదురుకర్రలు, సర్వేబాదులు సిద్ధం చేశామన్నారు. 

Updated Date - 2022-08-17T06:48:58+05:30 IST