-
-
Home » Andhra Pradesh » East Godavari » ganesh navaratri-NGTS-AndhraPradesh
-
లంభోధరా!
ABN , First Publish Date - 2022-08-31T06:34:49+05:30 IST
జై జై గణేశా.. జైకొడతాం గణేశా..అంటూ మార్కెట్‌కు వెళితే వ్యాపారులు ధరలతో బెదరగొట్టేశారు..

పెరిగిన ధరలతో జనం బెంబేలు
వ్యాపారులకు పండగ
చవితి సామగ్రిపై ధరల బాదుడు
ఒక్కరోజులోనే భారీగా పెరుగుదల
పండ్లు, పువ్వుల ధరలకు రెక్కలు
పూజా సామగ్రిది అదే దారి
చిన్న మట్టి ప్రతిమ రూ. 40
కర్పూర అరటి డజను రూ.80
కొబ్బరి కాయ ఒక్కటి రూ. 30
కొనుగోలుదారుడి జేబు గుల్ల
జై జై గణేశా.. జైకొడతాం గణేశా..అంటూ మార్కెట్‌కు వెళితే వ్యాపారులు ధరలతో బెదరగొట్టేశారు..ఎంతో ఆనందంగా పూజా సామగ్రి కొందామని మార్కెట్‌కు వెళ్లిన భక్తులు వ్యాపా రులు ధరల దరువుతో నీరసంగా మారిపోయారు.పల్లె లేదు.. పట్టణం లేదు.. ధరలు పెంచేసి లంబోధరాఘాతం చూపిం చారు.పత్రి నుంచి పువ్వుల ఽధరల వరకూ ఎక్కడా తగ్గ లేదు. అన్నింటా భక్తుల జేబు పిండేశారు.. పేద, మధ్యతరగతి ప్రజలు అధిక ధరలతో అన్నీ కొనుగోలు చేయలేక వెనుదిరిగారు.
రాజమహేంద్రవరంసిటీ/దివాన్‌చెరువు/నల్లజర్ల/పెరవలి, ఆగస్టు 30 : చవితి ఉత్సవాలకు పందిళ్లు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ ఉత్సవ కమిటీలు నవరాత్రుల పూజాధికాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలంకరణలు చేశారు. సర్వ విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు గణపతి పూజకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు చవితి ఏర్పాట్లు చేశారు. ఉభయగోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరంలో చవితి శోభ సంతరించుకుంది. పూజాదికాల నిమిత్తం వస్తుసామగ్రి కొనుగోలుకు రాజమహేంద్రవరం,చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నగరానికి చేరుకున్నారు. దీంతో నగరంలో సీతంపేట, కంబాలచెరువు, ఏవీ అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్, తాడితోట, ఆర్‌టీసీ కాంప్లెక్స్ రోడ్డు, వీఎల్‌పురం, మోరంపూడి, రైల్వేస్టేషన్ రోడ్డు, ఆల్‌కట్‌గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో పండ్లు, గణపతి విగ్రహాలు, పత్రులు, పాలవెల్లులు, పువ్వులు, దుకాణాలు ప్రజలతో నిండాయి. రాజమహేంద్రవరంలో నవరాత్రి ఉత్సవ పందిళ్లు వీధివీధినా వెలిశాయి. నగరంలో ముఖ్యంగా కోరుకొండ రోడ్డు, కంబాలచెరువు,గణేష్ చౌక్, గోకవరం బస్టాండ్, పుష్కరాలరేవు, గోదావరి బండ్ రోడ్డు సిద్ధివినాయక ఆలయం, కోటిపల్లి బస్టాండ్, ఇన్నీసుపేట, రైల్వేస్టేషన్ రోడ్డు, తాడితోట, దానవాయిపేట, ప్రకాష్ నగర్ ,వీఎల్‌పురం, శంభునగర్ తదితర ప్రాంతాల్లో గణనాథుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. మండల గ్రామాల్లోనూ చవితి సందడి నెలకొంది. దివాన్‌చెరువులో శ్రీలక్ష్మీగణపతి ఆలయం వద్ద, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలోని నిర్మల్ గ్రామ పుర స్కార్ కళా వేదిక వద్ద శ్రీవరసిద్ధి వినాయక ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. నిడదవోలు గణేష్ చౌక్, చాగల్లు తెలగాసంఘం, బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయం, కోరుకొండ,సీతా నగరం, అనపర్తి, రంగంపేట, కడియం, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, రాజానగరం మండలాల్లో చవితి ఉత్సవాలకు ప్రత్యేక పందిళ్లు వేశారు. ఆయా ప్రాంతాల్లో విద్యుద్దీపాలంకరణలు చేశారు. మంగళవారం పండుగ వాతావరణం ఒక రోజు ముందుగానే వచ్చేసింది.
గణపతి బప్పా మోరియా.. పువ్వుల ఽధరలు హోరయా!
పువ్వుల ధరలకు రెక్కలు వచ్చాయి. కాకరపర్రు హోల్‌సేల్ పూల మార్కెట్‌లో రెండు మూడు రోజులు ముందు నుంచే హడావిడి మొదలైంది. మంగళవారం కాకరపర్రు హోల్ సేల్ పూల మార్కెట్‌లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. బంతి పసుపు, ఎరువు కేజీ రూ.70, లిల్లీ రూ.200 నుంచి రూ.250 , చామంతి రూ.200 నుంచి రూ.250, గులాబీలు వంద రూ.200 నుంచి రూ.250, మల్లెలు రూ.900 నుంచి రూ.1200 , జా జులు రూ.800 నుంచి రూ.1200, కనకాంబరాలు రూ. రూ. 1000 నుంచి రూ.1500 ధరలు పలికాయి.
పండ్ల ధరలూ పెంచేశారు..
దివాన్‌చెరువు పండ్ల మార్కెట్‌లో మంగళవారం పండ్ల ధరలు ఆకాశాన్నంటాయి. యాపిల్ వంద సైజు ఆధారంగా రూ.వెయ్యి నుంచి రూ.2500 వరకూ పలకగా దానిమ్మ రూ. 100 కాయలు రూ.వెయ్యి నుంచి రూ.1500, 10 కిలోల ద్రాక్ష ట్రే రూ.950, నంధ్యాల రకం బత్తాయి ఒక కేజీ రూ.25 పలికింది. కేజీకి 8 కాయలు వస్తాయి. ఇక బుట్ట బత్తాయి కాయ రూ.6కు అమ్మినట్టు కొంత మంది వ్యాపారులు తెలి పారు. యాపిల్ మూడు కాయలు రూ.100, బత్తాయి డజను రూ.200, దానిమ్మకాయలు ఐదు రూ.150లకు విక్రయించారు. నిన్నటి వరకు బత్తాయి కిలో రూ.50లకు విక్రయించారు. మంగళవారం మార్కెట్‌లో కిలో రూ.100ల పలికాయి. అదే బాటలో యాపిల్, ఇతర పండ్ల ధరలు పెంచేశారు.
అరిటాకు రూ.5
వినాయక చవితికి ఉపయోగించే పూజా సామాగ్రీ,వినాయక మట్టి విగ్రహాలు మరింత ప్రియంగా మారాయి. వ్యాపారులు పండుగ అవసరాన్ని అవకాశంగా తీసుకుని ధరలు పెంచేశారు. పూజకు కావాల్సిన మారేడుకాయ, ఎలక్కాయ,సీతాఫలం, మొక్కజొన్న పొత్తు రూ.100లు పలికాయి. అరిటాకు ఒకటి రూ.5, మామిడాకులు, పత్రులు కట్ట రూ.30, మట్టి వినాయకుడు చిన్నది అయితే రూ.40 కాస్త పెద్దది అయితే రూ.80, కొబ్బరికాయ ఒక్కటి రూ.30, కర్పూర అరటిపండ్లు డజను రూ. 80లు ధరలు పలికాయి. కలువ పువ్వులు సైతం ఒక్కొకటి రూ.20 నుంచి రూ.30లు పలకడం విశేషం. బెల్లం, పప్పుల నుంచి, పిండివంటలకు వినియోగించే పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. బెల్లం కేజీ రూ.53, మినపప్పు కేజీ రూ.110,శనగపప్పు కేజీ రూ.80, ఆయిల్ కేజీ రూ.175, కారచి రూ.50, వరి పిండి కేజీ రూ.35, వరినూక కేజీ రూ.40, నెయ్యి కేజీ రూ.400 ధరలు పలుకుతున్నాయి.
బెదరగొట్టేశారు గణేశా!
కోరుకొండ : గత రెండేళ్లగా కరోనా కారణంగా గ్రామాల్లో గణేష్ ఉత్సవాలు అంతగా జరగలేదు. ఈ ఏడాది ప్రతి వీధిలో మండపాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించాలనుకున్న నిర్వాహకుల ఆశలపై పోలీస్ ఆంక్షలు నీళ్లు చల్లాయి.గతంలో ఒక్కో ఊరులోను 20 నుంచి 30 వరకు గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసి 9 రోజుల పాటు అం గరంగవైభవంగా గణపతి నవరాత్రి ఉత్స వాలు నిర్వహించే వారు. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వ ఆంక్షల కారణంగా చాలా మంది ఉత్సవాలు జరిపేందుకు వెనుకంజ వేశారు. దీంతో ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేశారు.ఆంక్షలు విగ్రహాల విక్రయ దారులపై పడ్డాయి. కోరుకొండ మండలం 22 గ్రామాల్లో సుమారు 200 వరకు విగ్రహాలు పెడతారని అంచనా వేసినా అమ్మకందారులు ఆ మేరకు వారం రోజుల క్రితమే కోరుకొండకు విగ్రహాలు తరలించారు. 3 చోట్ల ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి విగ్రహాలు అందుబాటులో ఉంచినా మంగళవారం రాత్రి వరకు 50 విగ్రహాలు అమ్ముడుపోలేదని అమ్మకందారులు వాపోయారు.
