స్నేహామృతం ఇచ్చేశక్తి మరేది ఇవ్వలేదు

ABN , First Publish Date - 2022-11-28T01:35:01+05:30 IST

రాయవరం కంటిపూడి సీతారత్నం కల్యాణ మండపంలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల 1975-77 పీజీ (ఎంకామ్‌) పూర్వ విద్యార్థుల 2వ ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసంగా సాగింది.

స్నేహామృతం ఇచ్చేశక్తి మరేది ఇవ్వలేదు

ఉల్లాసంగా 1975-77 పీజీ పూర్వవిద్యార్థుల సమావేశం

రాయవరం, నవంబరు 27: రాయవరం కంటిపూడి సీతారత్నం కల్యాణ మండపంలో ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల 1975-77 పీజీ (ఎంకామ్‌) పూర్వ విద్యార్థుల 2వ ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసంగా సాగింది. పూర్వ విద్యార్థులు బి.భాస్కరశర్మ, తేతల సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కళాశాల పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జీవితంలో స్నేహామృతం ఇచ్చే శక్తి మరేదీ ఇవ్వలేదన్నారు. తాను డీఎన్‌ఆర్‌ కాలేజీలో పీజీ తొలి బ్యాచ్‌ విద్యార్థిగా ఉన్నానని ఆనాటి జ్ఞాపకాలు మరలేనివన్నారు. గురువులు నిమ్మగడ్డ గంగాధరరావు, మంతెన లక్ష్మిపతిరాజు, జుత్తిగ చంద్రప్రసాద్‌లను పూర్వవిద్యార్థులు సత్కరించారు. సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డిని పూర్వవిద్యార్థులు, లెక్చరర్స్‌ ఘనంగా సత్కరించారు. తొలుత పూర్వవిద్యార్థులు కుటుం బ సభ్యులతో సరదాగా గడిపి భోజనం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళం ఏర్పాటుకు మిత్రబృందంగా ఏర్పడిన ఏఎంసీ డైరెక్టర్‌ తేతల సుబ్బిరామిరెడ్డి, బి.భాస్కరశర్మ, రామలింగేశ్వరరావు, వరదా రాంబాబులను పూర్వ విద్యార్థులు అభినందించారు.

‘ఆర్గానిక్‌ మామ, హైబ్రీడ్‌ అల్లుడు’ చిత్రం

ఆర్గానిక్‌ మామ, హైబ్రీడ్‌ అల్లుడు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు సినీ దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రేమను ప్రేమతోనే కలిపేసుకోవాలి.. పగతో కాదనే కథాంశంతో చిత్రం తీసినట్లు చెప్పారు. తానుచేసే పనిపై మనసంతా లగ్నం చేసి చేస్తానని, తనకు తెలిసిన ప్రపంచం సినిమా మాత్రమేనని సినిమా కోసం తాను ఎంతైనా కష్టపడతామన్నారు. సినిమాల్లో దర్శకత్వంతో పాటు కథ, సంగీతం, మాటలు, స్ర్కీన్‌ప్లే వహించడం గోదావరి తల్లి ఆశీర్వాదం, గోదావరి నీళ్లు తాగడం వల్లనే సాధ్యపడిందన్నారు. కరోనా సమయంలో ఖాళీగా కూర్చోకుండా వచ్చే సినిమా కోసం డైలాగులు రాసినట్లు చెప్పారు. ఈసందర్భంగా పలువురు రాయవరం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఎస్‌వీ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకటరమణ, పారిశ్రామికవేత్తలు చింతా పాండు రంగారెడ్డి, కర్రి వెంకట ముకుందరెడ్డి, మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాస్‌, స్థానిక నేతలు పడాల కమలారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, న్యాయవాది టి.రామచంద్రారెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-11-28T01:35:03+05:30 IST