నర్సరీ రైతులను ముంచేసింది..

ABN , First Publish Date - 2022-07-18T07:14:25+05:30 IST

రైతుల అంచనాలు తల్లకిం దులయ్యాయి. ఆగస్టు వరకూ వరద మన వరకూ రాదులే అని లంక గ్రామాల ప్రజలంతా గుండెలపై చేయి వేసుకుని ఉన్నారు. అయితే అంతలోనే వరద ముంచెత్తింది.

నర్సరీ రైతులను ముంచేసింది..
పొట్టిలంకలో నీట మునిగిన నర్సరీ మొక్కలు

కడియం, జూలై 17: రైతుల అంచనాలు తల్లకిం దులయ్యాయి. ఆగస్టు వరకూ వరద మన వరకూ రాదులే అని లంక గ్రామాల ప్రజలంతా గుండెలపై చేయి వేసుకుని ఉన్నారు. అయితే అంతలోనే వరద ముంచెత్తింది. తీవ్రం నష్టం మిగిల్చింది. దేశవ్యాప్తంగా నర్సరీలకు పేరు గాంచిన కడియం మండలంలో పొట్టిలంక, కడియపులంక, బుర్రిలంక, వెంకయ్యపేట, వేమగిరి గ్రామాల లంక భూముల్లో రైతులు అరటి, కంద, దొండ, వంగ, పచ్చిమిర్చి, బెండ వంటి కూరగాయ పంటలు, జామ, కోకో, బొప్పాయి వంటి వాణిజ్య పంటలు, మామిడి,  సపోటా, ఎవెన్యూ, వేప, రావి, మహాగని, స్పెదోడియా, కోనోకార్పస్‌ వంటి మొక్కలు, నిమ్మ, నారింజ, బత్తాయి, జామ వంటి పండ్ల మొక్కలు, కనకాబరం, బంతి, లిల్లీ, జాజులు వంటి పూలతోటలను సాగుచేస్తారు. నర్సరీల రైతులు  జూలై నెలాఖరు నాటికి మొక్కలను అమ్మేసి వరదకు వదిలేస్తారు. అయితే ఈ సారి మాత్రం వరద ముందుగా రావ డంతో నర్సరీ రైతులకు నష్టమే మిగిలింది. వరద ఉధృతి తగ్గినా మొక్క గత నాలుగు రోజులుగా నీటిలో మునిగిపోవడంతో క్రింద వేరు భాగం కుళ్లిపోయి మొక్క చనిపోతుందని రైతులు అంటు న్నారు.దీంతో కూరగాయలు, ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.ఉద్యాన శాఖ గణాంకాల ప్రకారం సుమారు 250 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఇందులో 90 హెక్టార్ల వరకు నర్సరీలు ఉన్నాయని ఉద్యానశాఖ అధికారి డి.సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఉద్యాన రైతు లకు ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు, నర్సరీ రైతులకు ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు నష్టం వాటి ల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


రూ. 5 లక్షల వరకూ నష్టపోయా..

అరెకరం భూమిలో 9-10 సైజు ఎవెన్యూ రకం మొక్కలు పెట్టా. మరో అరెకరంలో పచ్చి మిర్చి  వేశా.గోదావరి కారణంగా అటు నర్సరీ మొక్కలు, ఇటు మిర్చి   మునిగిపోయి రూ. 5 లక్షల వరకు నష్టపోయా.  - కామిరెడ్డి గోవిందు, రైతు, పొట్టిలంక  


రూ. 3 లక్షల వరకూ నష్టపోయా..

70 సెంట్లు భూమిలో పచ్చిమిర్చి   వేశా. గతంలో రూ. 250 ఉండే మిర్చి ధర ప్రస్తుతం రూ. 400 నుంచి రూ. 500 వరకు ఉంది.   మరో ఎకరంలో వంగ పంట వేశా.వరద ముంచెత్తి రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లింది.-  కొత్తపల్లి శ్రీను, రైతు, పొట్టిలంక  

Updated Date - 2022-07-18T07:14:25+05:30 IST