అత్తింటి వేధింపులు తాళలేక.. తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-11-28T01:25:45+05:30 IST

భర్త, అత్త వేధింపులు భరించలేక కూతుళ్లతో కలిసి తనువు చాలించాలనుకుంది. రైలుకు ఎదురుగా వెళుతుండగా గమనించిన రైల్వే కీమ్యాన్‌ వారిని పట్టాలపై నుంచి పక్కకులాగి ప్రాణాలు కాపాడాడు. పిఠాపురం సీఐ అక్కడకు చేరుకుని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి బంధువులకు అప్పగించారు. తల్లీ కూతుళ్ల ప్రాణాలు కాపాడిన కీ మ్యాన్‌ను పలువురు అభినందించారు.

 అత్తింటి వేధింపులు తాళలేక..   తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం

కౌన్సెలింగ్‌ ఇచ్చి బంధువులకు అప్పగించిన సీఐ వైఆర్‌కే

గొల్లప్రోలురూరల్‌, నవంబరు 27: భర్త, అత్త వేధింపులు భరించలేక కూతుళ్లతో కలిసి తనువు చాలించాలనుకుంది. రైలుకు ఎదురుగా వెళుతుండగా గమనించిన రైల్వే కీమ్యాన్‌ వారిని పట్టాలపై నుంచి పక్కకులాగి ప్రాణాలు కాపాడాడు. పిఠాపురం సీఐ అక్కడకు చేరుకుని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి బంధువులకు అప్పగించారు. తల్లీ కూతుళ్ల ప్రాణాలు కాపాడిన కీ మ్యాన్‌ను పలువురు అభినందించారు.

గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామానికి చెందిన ఎనుగంటి శివతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహ సమయంలో రెండు ఎకరాల పొలంతో పాటు తదనంతరం రూ.5లక్షల వరకూ నగదు ఇచ్చారు. భర్త శివ, అత్త కాసులమ్మలు తరచూ వెంకటలక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధించేవారు. వివాహమై 11 ఏళ్లు గడిచినా వేధింపులు ఆగకపోగా విడాకులు ఇమ్మంటూ పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. పెద్దల్లో పెట్టినందుకు ఆగ్రహంతో వెంకటలక్ష్మిపై శివ చేయి చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరి వేధింపులు భరించలేక వెంకటలక్ష్మి, తన కూతుళ్లు భవ్య, పార్థులతో కలిసి దుర్గాడ రైల్వేగేటు వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి విజయవాడ నుంచి విశాఖవైపు సూపర్‌ఫాస్టు రైలు వస్తున్న ట్రాక్‌పైకి చేరుకుంది. అదే సమయంలో పెట్రోలింగ్‌ చేసుకుంటూ వస్తున్న దుర్గాడ కీ మ్యాన్‌ పిడిమి వెంకటేశ్వరరావు వీరిని గమనించాడు. మహిళను ప్రశ్నించినా సమాధానం చెప్పకపోవడంతో పిల్లలను ప్రశ్నించగా వారు విషయం తెలిపారు. రైలు దగ్గరకు రావడంతో వెంటనే అప్రమత్తమైన వెంకటేశ్వరరావు తల్లీకూతుళ్లను రైలుపట్టాలపై నుంచి పక్కకు లాగేసి ప్రాణాలు కాపాడాడు. వెంటనే కంట్రోల్‌ రూమ్‌ 100తోపాటు పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావుకు సమాచారం అందించాడు. సీఐ అక్కడకు చేరుకుని తల్లీకూతుళ్లతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం వారి బంధువులను అక్కడకు రప్పించి మాట్లాడారు. బాధితురాలిని కాకినాడ వన్‌స్టా్‌ప సెంటర్‌కు తీసుకువెళ్లి అక్కడ కౌన్సిలింగ్‌ ఇప్పించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లికూతుళ్ల ప్రాణాలు కాపాడిన రైల్వేకీమ్యాన్‌ వెంకటేశ్వరరావును పలువురు అభినందించారు.

Updated Date - 2022-11-28T01:25:48+05:30 IST