వదలని వరద

ABN , First Publish Date - 2022-07-18T07:03:03+05:30 IST

గోదావరి ఉధృతంగానే ఉంది. భద్రాచలం వద్ద శాంతించినా.. అఖండ గోదావరిలో మాత్రం నీటిమట్టం తగ్గలేదు.. ఇంకనూ కొవ్వూరు గోష్పదక్షేత్రంలో వరద కొనసాగుతూనే ఉంది.

వదలని వరద
మద్దూరులంకలో డాబాలెక్కిన ఇల్లు

కొవ్వూరు, జూలై 17 : గోదావరి ఉధృతంగానే ఉంది. భద్రాచలం వద్ద శాంతించినా.. అఖండ గోదావరిలో మాత్రం నీటిమట్టం తగ్గలేదు.. ఇంకనూ కొవ్వూరు గోష్పదక్షేత్రంలో వరద కొనసాగుతూనే ఉంది. గత ఐదు రోజులగా క్షేత్రం అంతా జలదిగ్భందంలోనే ఉంది. ఆలయాలన్నీ వరద ముంపునకు గురయ్యాయి. క్షేత్రంలోకి వెళ్లే రహదారులపై వరదనీరు చేరడంతో లోపలకు ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మండలంలోని చిడిపి, కుమారదేవం, ఆరికిరేవుల, కొవ్వూరు, వాడపల్లి, మద్దూరు స్నానఘట్టాల వద్ద సచివాలయ సిబ్బందిని ఏర్పాటుచేసి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్నానఘట్టాలు, ఇసుక ర్యాంపులకు వెళ్లే మార్గాల్లో వరదనీరు పైకి చేరకుండా ఇసుకబస్తాలు, క్వారీచట్రు వేసి ఏటిగట్లను పటిష్ట పరిచారు.  మద్దూరులంక గ్రామాన్ని వరద ముంచెత్తింది. గత రెండు రోజులుగా గ్రామ వీధులన్నీ వరదనీటితో నిండిపోయాయి. ఇళ్లలో నీరు చేరడంతో గ్రామస్థులు డాబాలపై ఎక్కారు. రహదారులపై 4 అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహించడంతో గ్రామస్థులు పడవలపై ప్రయాణాలను కొనసాగిస్తున్నారు.   140 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు కొవ్వూరు తహశీల్దార్‌ బి.నాగరాజు నాయక్‌ తెలిపారు. మద్దూరు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో పల్లిపాలెంకు చెందిన 36 మంది, యానాంకు చెందిన మత్య్సకారులు 31 మంది, సీతంపేటకు చెందిన 73 మందికి భోజన వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. కొవ్వూరు, రాజమండ్రి మద్య గోదావరి లంకల్లో చిక్కుకుపోయిన గోవులకు పశు సంవర్థక శాఖ అదికారులు దాణా తీసుకువెళ్లారు. జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ టి.సత్యగోవిదందు, జిల్లా ఫైర్‌ అధికారి మార్టిన్‌ లూధర్‌ కింగ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పడవలపై గోవులకు 500 కేజీల టి.ఎం.ఆర్‌ 10 బస్తాలు తీసుకువెళ్లారు. లంకలో ఉన్న 75 గోవులకు ఒక్కొక్క గోవుకు 5 కేజీల చొప్పన దాణా అందజేశారు.  స్థానిక మత్య్సకారుల సహకారంతో గోవులను రాజమహేంద్ర వరం కోటిలింగాల రేవుకు తరలించారు. 

Read more