ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

ABN , First Publish Date - 2022-09-27T06:40:40+05:30 IST

వివిధ ప్రజా సమస్యలపై చేపట్టిన ధర్నాలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ సోమవారం దద్దరిల్లింది. వివిధ ప్రజా సంఘాలతో పాటు ప్రజలు ఎదుర్కొనే కీలక సమస్య లతో ఆయా వర్గాల ప్రజలు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌
కలెక్టరేట్‌ ఎదుట అంగనవాడీల ఆందోళన

  • రొయ్యల ప్రోసెసింగ్‌ యూనిట్‌ తొలగించాలని నాలుగు గ్రామాల ప్రజల ఆందోళన
  • సూపర్‌వైజర్‌ పోస్టులను పారదర్శకంగా ఎంపిక చేయాలి: అంగనవాడీలు
  • ఆక్వా అక్రమ చెరువులను తొలగించాలి: అంతర్వేది దేవస్థానం గ్రామస్తులు

 అమలాపురం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రజా సమస్యలపై చేపట్టిన ధర్నాలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ సోమవారం దద్దరిల్లింది. వివిధ ప్రజా సంఘాలతో పాటు ప్రజలు ఎదుర్కొనే కీలక సమస్య లతో ఆయా వర్గాల ప్రజలు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వేర్వేరుగా ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ప్రధానంగా అయినవిల్లి మండలం పోతుకుర్రు గ్రామంలో రొయ్యల ఫ్యాక్టరీ తొలగించాలనే డిమాండుతో నాలుగు గ్రామాల ప్రజలు భారీ ధర్నా నిర్వహించారు. అంగనవాడీ సూపర్‌వైజరు పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలనే డిమాండుతో అంగనవాడీ ఉద్యోగులు, రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులు, విధులను సర్పంచలకు కల్పించాలని రాజోలు నియోజకవర్గానికి చెందిన సర్పంచలు ధర్నా చేపట్టారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఆక్వా అక్రమ సాగు నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 

అయినవిల్లి మండలం పోతుకుర్రులో చాయిస్‌ కానింగ్‌ కంపెనీ (రొయ్యల ప్రోసెసింగ్‌ యూనిట్‌) నుంచి వదులుతున్న వ్యర్థాలతో సమీపంలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రోసెసింగ్‌ యూనిట్‌ నుంచి వదిలే వ్యర్థాలు, రసాయనాల వల్ల సమీపంలోని మాగాం, కె.జగన్నాథపురం, పోతుకుర్రు, క్రాప శంకరాయగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర రోగాలబారిన పడుతున్నారు. యూనిట్‌ వల్ల నీరు కలుషితం కావడంతో పాటు దుర్గంధం వెదజల్లి ఇబ్బందులు పడుతున్నామని సుమారు 400 కుటుంబాల ప్రజలు తమ కష్టాలను అధికారులు తీర్చాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అయినవిల్లి పోలీసులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండు చేశారు. వందల సంఖ్యలో ప్రజలు ధర్నాకు తరలివచ్చారు. 

గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టులను గతంలో వలే పారదర్శకంగా ఎంపిక చేయాలని డిమాండు చేస్తూ సీఐటీయూ అనుబంధ అంగనవాడీ వర్కర్లు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పరీక్షా ఫలితాల కీ విడుదల చేయాలని, పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ  ఎన్ని మార్కులు వచ్చాయో ప్రకటించాలని, ఫలితాల్లో రోస్టర్‌ పద్ధతి పాటించాలని, మెరిట్‌ ఆధారంగా వీడియోలు తీసి తుది జాబితాను ప్రకటించాలని డిమాండు చేశారు. యూనియనకు చెందిన అధ్యక్షులు జి.బేబీరాణి, కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తదితరులు నాయత్వం వహించారు. 

సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామ పరిధిలో అగ్నికుల క్షత్రియ ఫీల్డు లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ భూముల్లో వైసీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న ఆక్వా అక్రమ సేద్యాన్ని నిరోధించి చెరువులను తొలగించాలని డిమాండు చేస్తూ ఆ గ్రామానికి చెందిన వివిధ గ్రూపుల్లోని ప్రజలు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి నోటీసు ఇచ్చినప్పటికీ ఆక్వా సేద్యాన్ని నిరోధించలేకపోతున్నారని, ఇప్పటికే లీజుకు తీసుకున్న చెరువుల్లో సాగు ప్రారంభమైందని వారు ఆరోపించారు. చెరువులకు ఇచ్చిన విద్యుత సర్వీసును తొలగించాలని, పక్కనే ఉన్న అంగనవాడీ కేంద్రం మంచినీటి సంపునకు రక్షణ కల్పించాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. ఇప్పటికే స్పందనలో పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన శూన్యమని ఆరోపిస్తూ చేపట్టిన ఈ ధర్నాలో ప్రజా సంఘాల నాయకుడు ముత్యాల శ్రీనివాసరావు, చవ్వాకుల వెంకట్‌, రేవు తిరుపతిరావు, పీఎనఎం కాలనీ, బుంగావారిగ్రూపు, యడ్లవారిగ్రూపులకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. 


Read more