బొండార్స్‌.. మటాష్‌!

ABN , First Publish Date - 2022-02-23T06:21:11+05:30 IST

కొబ్బరి రైతులను వరుస కష్టాలు వేధిస్తున్నాయి. కొబ్బరి మార్కెట్‌ ధరలు పతనమై రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోతుండగా, ఇటు కొత్త కొత్త తెగుళ్లు చెట్ల ఆకులపై సోకి తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. రూగోస్‌(తెల్లదోమ) తెగులుపాటు తాజాగా అదే సంతతికి చెందిన బొండార్స్‌ నెస్ట్‌ఫ్లై సోకడంతో ఇప్పుడు చెట్ల ఆకులన్నీ తెల్లగా మారిపోతున్నాయి.

బొండార్స్‌.. మటాష్‌!
బండారులంకలో బొండార్స్‌ ఆశించి ఎండిపోతున్న కొబ్బరాకులు

  • కొబ్బరి ఆకులపైకొత్త తెగులు విజృంభణ 
  • తెల్లగామారి ఎండిపోతున్న చెట్లు
  • భారీగా నష్టమంటున్న రైతులు 
  • రూగోస్‌, బొండార్స్‌ తెగుళ్ల నివారణకు శాస్త్రవేత్తల రక్షణ చర్యలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొబ్బరి రైతులను వరుస కష్టాలు వేధిస్తున్నాయి. కొబ్బరి మార్కెట్‌ ధరలు పతనమై రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోతుండగా, ఇటు కొత్త కొత్త తెగుళ్లు చెట్ల ఆకులపై సోకి తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. రూగోస్‌(తెల్లదోమ) తెగులుపాటు తాజాగా అదే సంతతికి చెందిన బొండార్స్‌ నెస్ట్‌ఫ్లై సోకడంతో ఇప్పుడు చెట్ల ఆకులన్నీ తెల్లగా మారిపోతున్నాయి. తలలు వాల్చేస్తూ చెట్లకు ఉన్న కాయలన్నీ రాలిపోతున్నాయి. ఈ తెగులు ఇప్పుడు కోనసీమలోని సముద్రతీర ప్రాంతాలతోపాటు అనేక గ్రామాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో ఈ తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా రక్షణ చర్యలు చేపట్టడానికి ఉద్యానవనశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది. కోన సీమలో 90 వేల ఎకరాలపైనే సాగులో ఉంది. గత కొన్నేళ్ల నుంచి కొబ్బరి తోటలపై రూగోస్‌ తెల్లదోమ విస్తృతంగా వ్యాపించి కొబ్బరి రైతాంగాన్ని కష్టనష్టాలకు గురిచేస్తోంది. కోనసీమ నలుమూలల ఈ తెగులు వ్యాపించినప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో ఇప్పటికే కొంత నిర్మూలనకు కృషి చేశారు. ఇప్పుడు రూగోస్‌కన్నా ప్రమాదకరమైన బొండార్స్‌ తెగులు వల్ల పంటలను రైతులు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూగోస్‌ వ్యాపించి తగ్గుతున్నచోటే బొండార్స్‌ విజృంభించడం వల్ల ఆ ప్రాంతంలో కొబ్బరి చెట్లన్నీ సర్వనా శనం అయిపోతున్నాయి. తెల్లదోమ నివారణకు హిస్సారియా కల్చర్‌ లేదా వేపనూనె వాడొచ్చు. ఎనకార్షియా డ్రైకోక్రైసా బద నికలతో బొండార్స్‌ నివారణ సాధ్యమవుతుందని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఎకరా తోటలో తెగులు వ్యాపిస్తే సగానికి పైగానే చెట్లు నాశ నం అవుతున్నాయి. ఈ తెగులు కొబ్బరిచెట్లతోపాటు ఆయిల్‌ ఫామ్‌ పంటలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నందున వాటి నివారణకు శాస్త్రవేత్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రైతులు కోరుతున్నారు. ఇందుకోసం రైతులు సంఘటితమై రూగోస్‌తోపాటు బొండార్స్‌ నివారణకు శాస్త్రవేత్తల సహకారంతో రక్షణ చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఫలించినప్పటికీ మరికొన్నిచోట్ల సత్ఫలితాలు ఇవ్వడంలేదని రైతుల అభి ప్రాయం. కొబ్బరి రైతులను తీవ్రంగా నష్టాలకు గురిచేస్తున్న ఈ తెగుళ్ల నివారణకు ఉన్నతస్థాయిలో ప్రణాళికలు రూపొందించి కొబ్బరి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.  

Updated Date - 2022-02-23T06:21:11+05:30 IST