అప్రమత్తంగా లేకుంటే... అంతే సంగతులు

ABN , First Publish Date - 2022-09-11T07:16:21+05:30 IST

ఊరి పండుగలు, సరదా స్నానాలు ఒక్కొక్కసారి తీర గ్రామాల్లో తీవ్రవిషాదాన్ని నింపుతున్నాయి. అప్పటివరకూ కళ్లముందు తిరిగిన బిడ్డలు కళ్లెదుటే కడలి అలలకు బలవుతూ కడసారి చూపు కూడా దక్కకుండా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.

అప్రమత్తంగా లేకుంటే... అంతే సంగతులు

  • ప్రమాదభరితంగా కోన తీర సముద్ర రేవులు
  • వారాంతాల్లో సరదాగా స్నానాలకు వచ్చి మృత్యువాత
  • నిమజ్జనాల్లోను బలవుతున్న నిండు ప్రాణాలు

తొండంగి, సెప్టెంబరు 10: ఊరి పండుగలు, సరదా స్నానాలు ఒక్కొక్కసారి తీర గ్రామాల్లో తీవ్రవిషాదాన్ని నింపుతున్నాయి. అప్పటివరకూ కళ్లముందు తిరిగిన బిడ్డలు కళ్లెదుటే కడలి అలలకు బలవుతూ కడసారి చూపు కూడా దక్కకుండా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. 

తొండంగి మండలంలో అద్దరిపేటనుంచి చోడిపల్లిపేట వరకూ 20కిలోమీటర్ల మేర కోన తీర ప్రాంతం విస్తరించి ఉంది. దీన్ని ఆనుకుని ఉన్న గ్రా మాలవద్ద మత్స్యకారులు వేటసాగించే రేవులు ఉన్నాయి. అద్దరిపేట, వేమవరం పంపాదిపేట, యర్రయ్యపేట, ఎల్లయ్యపేట, గొల్లముసలయ్యపేట, నర్సిపేట, ఒంటిమామిడి, దానవాయిపేట, పెరుమాళ్లపురం, చోడిపల్లిపేట తదితర ప్రాంతాల్లో రేవులు ఉన్నాయి. ఇవన్నీ సముద్రస్నానాలు చేసేందుకు అనువైనవి కావు. అయినా గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే విగ్రహాలను ఈ రేవుల్లోనే నిమజ్జనం చేస్తుంటారు. గ్రామాల్లో జరిగే తాడుపెద్దులకు అచ్చు పోసే సందర్భంలో కూడా గ్రామస్తులంతా తాడిపెద్దుతోపాటు సముద్ర స్నానాలు చేసేందుకు తరలివెళ్తుంటారు. వారాంతాల్లో యువత కూడా స్నేహితులతో కలిసి స్నానాలకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామాల్లోని యువకులు మితిమీరిన ఉత్సాహంతో సముద్ర స్నానాలకు దిగి అలల ఉఽధృతికి లోనికి పోయి గల్లంతై శవాలుగా తిరిగొస్తున్నారు.

గతంలో ఎన్నో ఘటనలు

గతంలో కాకినాడకు చెందిన యువకులు పిక్నిక్‌ నిమిత్తం పెరుమాళ్లపురం శివారు రేవు వద్దకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. గతంలో ఏళ్ల కిందట జీఎంపేటకు చెందిన యువకులు అద్దరిపేట తీర్థానికి వెళ్లి వచ్చి గ్రామంలోని రేవులో స్నానానికి దిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక నిమజ్జనం లేదా గ్రామ ఉత్సవాల సందర్భంగా తరచూ ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మాఘ పౌర్ణమి, శివరాత్రి వంటి సందర్భాల్లో ఇంతగా ప్రమాదాలు జరగవు. గ్రామ పండుగలు, వినాయక నిమజ్జనాలు జరిగే సందర్భాల్లో తమ గ్రామాన్ని ఆనుకున్న రేవు కావడం, తమకు పరిచయమున్న రేవే అన్న ధీమాతో దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్థానికంగా ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఉంటే తక్షణం స్పందించి ప్రాణాలను కాపాడిన సంఘటనలు అనేకం జరిగాయి.

మత్స్యకారులు ఉంటేనే...

రెండురోజుల క్రితం తొండంగి మండలంలోని చోడిపల్లిపేటవద్ద వినాయక నిమజ్జనం నిమిత్తం వచ్చి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో కూడా స్థానిక మత్స్యకారులు ఆరుగురిని రక్షించి ప్రాణాలు కాపాడారు. అయినా ఇద్దరు మృతిచెందారు. కోన తీర ప్రాంతంలో ఉన్న అన్ని రేవులు సురక్షితం కాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వినాయక ఉత్సవాలు వంటి ప్రధాన ఉత్సవాలు జరిగే సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక పెద్దలతో కమిటీలు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపడితే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. సురక్షితం కాని రేవుల్లో గణపతి నిమజ్జనం జరగకుండా చూస్తే కొంతమేర ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందని, వారాంతాల్లో కూడా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read more