పేపరుమిల్లుకేమైంది!

ABN , First Publish Date - 2022-09-25T06:42:22+05:30 IST

రాజమహేంద్రవరం పేపరు మిల్లు ఉద్యోగుల విషయం లో ఓ మాయాజాలం కొనసాగుతోంది.

పేపరుమిల్లుకేమైంది!
ఏపీ పేపర్‌మిల్లు

పేపరుమిల్లులో అయోమయం
65 మంది పర్మినెంట్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌  
తక్కువ జీతాలతో కొత్తవారికి అవకాశం
ఫ్యాక్టరీలో 3,500 మంది కార్మికులు
మరో 70 మందిని సాగనంపే ప్రయత్నం?
తాత్కాలిక ఉద్యోగులకు ప్రమోషన్లు నిల్‌
వైసీపీకీ చెందిన ఓయూనియన్‌ నేతే కీలకం
యాజమాన్యంపై ఎమ్మెల్యే రాజా ఫిర్యాదు?ఆంధ్ర పేపర్‌ మిల్లు.. రాజమహేంద్రవరంలో ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని వేలాది కుటుంబాలు ఉన్నాయి.. అటువంటి ఫ్యాక్టరీకి ఏదో అయ్యింది.. ఇటీవల పర్మినెంట్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చి వారి వారసులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.. నాడు ఏదో వయసైపో యిన వారిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇచ్చారని అంతా ఆనందపడ్డారు.. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు మరో పిడుగులాంటి వార్త చెప్పారు.. ఈ నెలలో మరో 70 మంది సాగనంపు తున్నట్టు సారాంశం.. ఇలా ఎందుకు చేస్తున్నారో  తెలియక ఉద్యోగులు మదనపడుతున్నారు. దీనిపై యాజమాన్యం మాత్రం నోరుమెదపడం లేదు. (రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)రాజమహేంద్రవరం పేపరు మిల్లు ఉద్యోగుల విషయం లో ఓ మాయాజాలం కొనసాగుతోంది.మూడు నెలల నుంచి పర్మినెంట్‌ ఉద్యోగులను నొప్పిలేకుండా సాగనంపుతున్నారు. ఈ విషయంలో రూ.లక్షలు చేతులు మారుతుండడంతో పేపరుమిల్లు ఉద్యోగులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారమే నడుస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అనేది అంతు పట్టని విషయంగా ఉంది. ఈ పేపరుమిల్లును వేరేవారు కొనుగోలు చేయబోతున్నారని, ఇపుడు ఎక్కువ జీతాలతో ఉన్నపర్మినెంట్‌ ఉద్యోగులను తప్పించి తక్కువ జీతాలతో ఉద్యోగులను నియమిస్తే తాము కొనుగోలు చేస్తామని కొందరు షరతు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకూ నిజమనేది కొద్ది నెలల్లో తేలిపోనుంది.


ఉద్యోగులను సాగనంపుతున్నారు..


గత మూడు నెలలగా పరంపరగా ఉద్యోగులను సాగనంపుతున్నారు. మూడు నెలల కిందట రెండు మూడేళ్లలోపు సర్వీసు ఉన్న సుమారు  65 మంది పర్మినెంట్‌ ఉద్యోగులను ఒప్పించి, వారి కొడుకులకో, అల్లుళ్లకో  ఉద్యోగాలిచ్చారు. వయసురీత్యా తప్పుకుని, వారి వారసులకు ఎవరికో ఉద్యోగం రావడం అనేది ఉద్యోగులతో పాటు, యూనియన్లు కూడా హర్షిస్తాయి. కానీ ఇవాళ మరో 70 మందిని ఇంటికి సాగనంపుతున్నారు. కానీ ఇక్కడ వారి వారసులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదు. సుమారు రూ.5 లక్షల వరకూ ఇచ్చి, వారిని ఉద్యోగాలకు రాజీనామా చేయిస్తున్నారు. మరొక ముఖ్య విషయమేంటే... ఈ వ్యవహారం నేరుగా పేపరుమిల్లు యాజమాన్యం పేరతో జగడంలేదు. ఇందులో కీలకంగా యూనియన్‌కు చెందిన వైసీపీ నేత వ్యవహరించడం గమనార్హం. ఇతని చేత యాజమాన్యమే చేయిస్తుందా, లేదా ఏదైనా వ్యూహం ఉందా అనేది తేలాల్సి ఉంది. ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ అనేది ప్రభుత్వమో, కంపెనీనో ప్రతిపాదించి అమలు చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వీఆర్‌ ఎస్‌ను యాజమాన్యం ప్రతిపాదించలేదు. సదరు నేతే ప్రతిపాదించి, ఇక ఏడాది.. రెండేళ్లు పనిచేసే కంటే ఇప్పుడే సుమారు రూ. 5 లక్షలకు పైగా తీసుకుని ఇంటికి వెళితే ఏదో పనిచేసుకోవచ్చు. హ్యాపీగా ఉండవచ్చని నచ్చచెప్పి,వారిని ఒప్పిస్తున్నట్టు సమాచారం. ఈ పేపరుమిల్లులో పర్మినెంట్‌, తాత్కాలిక ఉద్యోగులు సుమారు 3,500 మంది వరకూ ఉంటారు. వీరికి రూ.40 వేల నుంచి 70 వేల వరకూ జీతాలు ఉంటాయి.మిల్లులో లోడింగ్‌ చేసేవారికి,  కెమికల్‌ బస్తాలు, ఇతర బరువులు మోసే వారికి నెలకు రూ.70 వేల జీతాల వరకూ ఉంటాయి. మిల్లు యాజమాన్యం వీఆర్‌ఎస్‌ ప్రతిపాదించకుండా,ఇంత పెద్ద జీతాలు ఉన్నవారికి ఏ ప్ర యోజనం అందకుండా, ఎందుకు ఉద్యోగాలు మానేస్తారు. అనేది అందరూ వేస్తున్న ప్రశ్న.వీరిని సాగనంపడానికి ఇప్ప టికే మరింత మందిని ఉద్యోగాలు ఇస్తామని పోగుచేసి, వారి వద్ద నుంచి రూ.లక్షలు వసూలు చేసి,బయటకు వెళ్లిపోతున్నవారికి కొంత ముట్టచెబుతున్నట్టు ఆరోపణలున్నాయి.  ప్రస్తుతం మరో 70మందిని సిద్ధం చేయడం గమనార్హం.


హల్‌చల్‌ చేస్తున్న లేఖ..


ఆంధ్రపేపరుమిల్లు యాజమాన్యం అవలంభిస్తున్న చట్ట వ్యతిరేక  పద్ధతులపై చర్య తీసుకోవాలని కోరుతూ  రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా  రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్‌ కమిషనర్‌ కార్తికేయ మిశ్రాకు రాసినట్టు ఉన్న లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019లో  గుర్తింపు యూనియన్లతో జరిగిన 12(3) ఒప్పందంలో 84 మంది కాంట్రాక్టు కార్మికులను  సీనియారిటీ ఆధారంగా ఇన్‌ప్లాంట్‌ ట్రైనీలు గానూ, 55 మందిని బదిలీ ఉద్యోగులుగానూ, కోర్‌ విభాగాలలో మరో 55 మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడానికి  అంగీకారం కుదిరింది. దానిని అమలు చేయలేదన్నారు. ఈ లేఖలో పలు విషయాలను పొందుపరిచారు.


కొత్తవారికి రూ.8 వేల జీతం


 గత మూడు నెలల కిందట పర్మినెంట్‌ ఉద్యోగులను ఇంటికి పంపి, వారి వారసులకు ఉద్యోగాలిచ్చారు.  అన్ని కటింగ్‌లూ పోను మొదట నెలకు రూ.12వేల వరకూ ఇస్తామని చెప్పినట్టు సమాచారం. మొదట నెలలో వచ్చినా తర్వాత నెల నుంచి జీతాలు తగ్గించినట్టు, ప్రస్తుతం నెలకు రూ. 8 వేలు మాత్రమే ఇస్తున్నట్టు సమాచారం.


20 ఏళ్లుగా పనిచేస్తున్నవారు పక్కకు..


 ఇక్కడ సుమారు 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారిని సీనియారిటీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలి. కానీ ఏదో సాకు చూపి వారిని తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగిస్తున్నా రు. తక్కువ జీతాలే ఇస్తున్నారు. వారిని పర్మినెంట్‌ చేయకుండా కొత్తగా పర్మినెంట్‌ ఉద్యోగులను తీసుకోవడం కూడా విమర్శలకు గురైంది.ఈ నేపఽథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.     

Read more