ఏజెంట్ల చేతిలో మోసపోయి కేరళలో ఉన్న మహిళలను కాపాడుతాం..

ABN , First Publish Date - 2022-08-31T06:49:13+05:30 IST

గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలకు గురై కేరళలో జైలులో ఉన్న మహిళలను కాపాడేందుకు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

ఏజెంట్ల చేతిలో మోసపోయి కేరళలో ఉన్న మహిళలను కాపాడుతాం..

ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వెల్లడి 8 ‘ఆంధ్రజ్యోతి’ వార్తకు స్పందన

అమలాపురం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలకు గురై కేరళలో జైలులో ఉన్న మహిళలను కాపాడేందుకు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ అమాయక మహిళలను గల్ఫ్‌కు పంపిస్తామని మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరరించారు. ‘ఏజెంట్ల చేతిలో మోసపోయి..’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వార్తా కథనం ప్రచురితమైంది. దీంతోపాటు మీడియాలో కూడా పలు కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే రావులపాలెంలో ఉన్న గుబ్బల మహాలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని చెప్పారు. కేవలం ముగ్గురు మాత్రమే కేరళ జైలులో ఉన్నట్టు నిర్థారణ అయిందన్నారు. ఈ కేసు విషయంపై కేరళ పోలీసులను కాంటాక్టు చేయగా ఘటనకు దారితీసిన పరిస్థితులను వివరించి విచారణకు పూర్తి సహకారం అందించడానికి అంగీ కరించినట్టు తెలిపారు. మరో ఇద్దరు మహిళలు కూడా కండీషన్‌ బెయిల్‌పై కేరళలోనే ఉన్నట్టు తెలుస్తోందని, ఐసీడీఎస్‌, పోలీసు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని పంపి అక్కడ అధికారులతో కలసి కోర్టులో బెయిల్‌ షరతులు తొలగించే విధంగా పిటీషన్‌ ఫైలుచేసి వారిని ప్రభుత్వ సహకారంతో వారిని అమలాపురం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేరళలో కేసులు నమోదై ఉన్నందున వారు అమలాపురం వచ్చిన తర్వాత బాధితుల నుంచి వాంగ్మూలం తీసుకుని కొత్త కేసులు నమోదు చేయాలా లేక కేరళలో నమోదైన కేసులతో విచారణ పూర్తిచేయాలా అనే అంశంపై ఆలోచిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కాగా ఈ మహిళలను గల్ఫ్‌ పంపిస్తామని చెప్పి కేరళలో నకిలీ వీసాలు అందించి అరెస్టయ్యేలా చేసిన ఉప్పలగుప్తం మండలం గోపవరంనకు చెందిన తాళ్ల రాం బాబు కోసం పోలీసులు ఇంటికి వెళ్లి విచారించినట్టు తెలిసింది. మంగళవారం ఉదయమే  ఇంటికి వచ్చిన రాంబాబు మళ్లీ పోలీసులు వెళ్లకముందే వెళ్లిపోయినట్టు సమాచారం.



Read more